– జూనియర్ ఆర్టిస్ట్ దొడ్డిసూరి కళ అరెస్ట్
హైదరాబాద్,ప్రజాతంత్ర,జూన్9: హైదరాబాద్‌లో అంతర్జాతీయ మాదకద్రవ్యాల అక్రమ రవాణా నెట్‌వర్క్‌ను ఈగల్ ఫోర్స్ తెలంగాణ, కస్టమ్స్ విభాగం, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) సంయుక్తంగా ఛేదించాయి. బ్యాంకాక్- ఇండియా మార్గంలో సాగుతున్న ఓజి గంజాయి స్మగ్లింగ్ ముఠాను బట్టబయలు చేసి కీలక నిందితులను గుర్తించారు. ఈ కేసులో హైదరాబాద్‌కు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ దొడ్డి సూరి కళను శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు అరెస్ట్ చేశారు. ఆమె వద్ద నుంచి 2.15 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న సమయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించగా ఈ డ్రగ్స్ బయటపడ్డాయి. కేరళకు చెందిన చల్లిల్ పుత్తన్‌పురయిల్ నఫ్షీద్ అలియాస్ అలెక్స్ ఈ ముఠాకు ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. మహిళా జూనియర్ ఆర్టిస్టులను లక్ష్యంగా చేసుకుని ఒక్కో ట్రిప్‌నకు రూ.20 వేల వరకు పారితోషికం ఇస్తామని ఆశ చూపించి వారిని డ్రగ్స్ రవాణాకు వినియోగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల విచారణలో మరికొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2026 మార్చిలో సూరి కళ మొదటిసారి బ్యాంకాక్‌కు వెళ్లి అక్కడి నుంచి గంజాయిని తీసుకువచ్చి చెన్నైలో ముఠా సభ్యులకు అప్పగించినట్లు తేలింది. అనంతరం ఏప్రిల్ 2026లో మరోసారి బ్యాంకాక్ వెళ్లి మాదకద్రవ్యాలను భారత్‌కు తీసుకువచ్చి హైదరాబాద్‌లో అందజేసినట్లు గుర్తించారు. జూన్ 2026లో మూడోసారి అదే తరహా ప్రయత్నం చేస్తుండగా శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు.. జూనియర్ ఆర్టిస్ట్ దొడ్డి సూరి కళను పట్టుకున్నారు. దీంతో అంతర్జాతీయ స్మగ్లింగ్ నెట్‌వర్క్ కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ముఠాలో రాజు బిస్వాస్ అనే వ్యక్తి కూడా కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తులో తేలింది. అలాగే గంగా భవాని, గౌరి అనే మరో ఇద్దరు మహిళలను కూడా బ్యాంకాక్‌కు పంపించి గంజాయి రవాణా చేయించినట్లు అధికారులు గుర్తించారు. మహిళా ఆర్టిస్టులను ఎరగా వేసుకుని అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ నిర్వహిస్తున్న ఈ ముఠాపై అధికారులు మరింత సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెట్‌వర్క్‌కు సంబంధించిన మరికొంతమంది సభ్యులు, ఆర్థిక లావాదేవీలు, విదేశీ సంబంధాలపై విచారణ కొనసాగుతోంది. 2.15 కిలోల క్షఉ గంజాయి స్వాధీనం కావడంతో పాటు అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్‌కు సంబంధించిన కీలక ఆధారాలు కూడా లభించినట్లు అధికారులు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.