– అంకిత భావంతో ప్రజల సమస్యలను పరిష్కరించాలి
– ముఖ్యమంత్రి నమ్మకాన్ని ఎంపీడీవోలు నిలబెట్టుకోవాలి
– రాష్ట్రస్థాయి ప్రజావాణి ఇన్‌చార్జి చిన్నారెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 13 : ప్రజలకు జవాబుదారులం అనే విషయాన్ని అధికారులు ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించవద్దని, ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతీ అధికారి అంకితభావం, బాధ్యతతో విధులు నిర్వర్తించాలని రాష్ట్రస్థాయి ప్రజావాణి ఇన్‌చార్జి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి.చిన్నారెడ్డి అన్నారు. ప్రజా భవన్‌లో గురువారం నిర్వహించిన మండల నోడల్ అధికారులైన ఎంపీడీవోల(560 మంది) శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి గ్రామాల నుంచి వచ్చే ప్రజలతో ఓపికగా మాట్లాడి వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి వాటిని క్షేత్రస్థాయిలో పరిష్కరించే గురుతర బాధ్యత మండల నోడల్ అధికారి, వివిధ శాఖల మండల అధికారులపై ఉందని అన్నారు. ఎంపీడీవోలకు మండల ప్రజావాణి నోడల్ అధికారిగా ఎంతో నమ్మకంతో నియమించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విశ్వాసాన్ని వారు నిలుపుకోవాల ని, ప్రజావాణి ద్వారా సమస్యలను పరిష్కరించి ప్రజల మన్ననలు పొందాలని చిన్నారెడ్డి పిలుపునిచ్చారు. ప్రజావాణి పేదవారి సమస్యల పరిష్కార వేదికగా మారాలన్నారు. రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తున్న సీఎం ప్రజావాణి 75% సక్సెస్ రేటును సాధించిందని, ఇదే స్థాయిలో సమస్యలను పరిష్కరిస్తూ జిల్లా, మండలస్థాయి ప్రజావాణి అధికారులు కృషి చేయాలని సూచించారు. మండలస్థాయి ప్రజావాణిలో బాధ్యతలు నిర్వర్తించే అధికారులు సమన్వయంతో ఎలాంటి లోపం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈనెల 17నుంచి రాష్ట్రవ్యాప్తంగా తొలిసారిగా ప్రారంభం కానున్న మండలస్థాయి ప్రజావాణి కార్యమాలకు అన్ని ఏర్పాట్లు ముందస్తుగా పూర్తి చేసుకుని సిద్ధంగా ఉండాలని చిన్నారెడ్డి సూచించారు. సీఎం ప్రజావాణి మాదిరి మండలస్థాయిలోనూ శాఖల వారీగా డెస్క్‌లు, ప్రజల దరఖాస్తులు రాసేందుకు హెల్ప్ డెస్క్‌లు, వైద్య సేవలు, తాగు నీరు ఏర్పాట్లు చేసుకోవాలని, వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని చెప్పారు. స్టేట్ నోడల్ అధికారి కె.విద్యాసాగర్ మాట్లాడుతూ ప్రజలు మాస్టర్స్ అని, అధికారులు సేవకులు అన్న విషయాన్ని గుర్తు పెట్టుకుని ప్రజావాణి బాధ్యులు ప్రజల సమస్యలను పరిష్కరించాలన్నారు. మండల, జిల్లా నోడల్ అధికారులు ప్రజల సమస్యలను పరిష్కరించడం కర్తవ్యంగా భావించాలని సూచించారు. సీఎం కార్యాలయంలో ప్రజావాణి వ్యవహారాల పర్యవేక్షకుడు, సీఎం ఓఎస్‌డీ వేముల శ్రీనివాసులు మాట్లాడుతూ సమస్యలతో ప్రజావాణికి వచ్చే ప్రజలకు సాంత్వన కల్పించాలని ఎంపీడీవోలకు సూచించారు. మండల నోడల్ అధికారి, మిగతా శాఖల అధికారులు ప్రజల విశ్వాసాన్ని చురగొనాలన్నారు. పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖల కమిషనర్ దివ్య దేవరాజన్ మాట్లాడుతూ ప్రజావాణికి వచ్చే ప్రజల సమస్యలను ఓపికగా వింటే సగం సమస్య పరిష్కారం అయినట్లేనని, సమస్యల పరిష్కారం కోసం గట్టి చర్యలు చేపట్టాలని సూచించారు. శిక్షణలో భాగంగా మండలస్థాయిలో ప్రజావాణి నిర్వహణకు తీసుకోవాల్సిన అనేక అంశాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా నిపుణులు వివరించారు. కార్యక్రమంలో ప్రణాళిక శాఖ డైరెక్టర్ షేక్ మీరా, సీఎం ప్రజావాణి ఏసీపీ ఉమేందర్, డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అధికారి సుశీల, సీఎం ప్రజావాణి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





