100 రోజుల్లో 60 వేల మంది విద్యార్థులకు పౌష్టికాహారం

– సయ్యద్ ముజావర్‌పేటలో ప్రపంచస్థాయి కేంద్రీకృత వంటశాల
– సింగరేణి సీఎస్‌ఆర్ నిధులు రూ.9.60 కోట్లు 
– మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి పర్యవేక్షణ

సూర్యాపేట/హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 29 : ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదువుతున్న వేలాదిమంది విద్యార్థులకు రోజూ నాణ్యమైన, పరిశుభ్రమైన పౌష్టికాహారాన్ని అందించేందుకు ప్రభుత్వం భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. సూర్యాపేట జిల్లా మునగాల మండలం సయ్యద్ ముజావర్‌పేటలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్మిస్తున్న కేంద్రీకృత వంటశాలను రాబోయే వంద రోజుల్లో అందుబాటులోకి తేవడానికి పనులు వేగవంతం చేశారు. ఈ బృహత్తర ప్రాజెక్టును సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ తన సామాజిక బాధ్యత కింద అందిస్తున్న రూ.9.60 కోట్ల ఆర్థిక సహాయంతో హరే కృష్ణ మూవ్‌మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ (అక్షయపాత్ర) సహకారంతో నిర్మిస్తున్నారు.

1,029 విద్యాసంస్థలకు సేవలు

ఈ కేంద్రీకృత వంటశాల ద్వారా సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లోని మొత్తం 1,029 ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లోని సుమారు 60 వేల మంది విద్యార్థులకు ప్రతి పనిదినం తాజాగా తయారుచేసిన సమతుల పౌష్టికాహారాన్ని అందిస్తారు. సూర్యాపేట జిల్లాతోపాటు నల్లగొండ జిల్లాలోని నకిరేకల్, శాలిగౌరారం, కేతేపల్లి, వేములపల్లి మండలాలకు చెందిన 131 ప్రభుత్వ విద్యాసంస్థల్లోని 7,972 మంది విద్యార్థులకు కూడా ఈ వంటశాల నుంచే ఆహారం సరఫరా కానుంది.

అధునాతన సాంకేతికత – నాణ్యమైన ఆహారం

ఒకేచోట భారీస్థాయిలో ఆహారాన్ని సిద్ధం చేయడంతోపాటు నాణ్యతా పరీక్షలు, ప్యాకింగ్, రవాణా, పంపిణీ వ్యవస్థలను ఆధునిక సాంకేతికతతో అనుసంధానించనున్నారు. ఆహార భద్రత, పరిశుభ్రత, నిర్ణీత సమయానికి సరఫరాకు అత్యధిక ప్రాధాన్యతనిస్తారు. విద్యార్థులలో పోషకాహార లోపాన్ని నివారించేందుకు ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలతోపాటు భారత చిరు ధాన్యాల పరిశోధన సంస్థ సహాయంతో శాస్త్రీయంగా రూపొందించిన చిరు ధాన్యాల (మిల్లెట్స్) వంటకాలను మెనూలో చేర్చనున్నారు.

అధికారుల సమన్వయం – మంత్రి సమీక్ష

రాష్ట్ర నీటిపారుదల, ఆహార, పౌర సరఫరాల శాఖల మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఈ ప్రాజెక్టు పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. సింగరేణి సంస్థ, హరే కృష్ణ ఫౌండేషన్, సూర్యాపేట-నల్లగొండ జిల్లాల యంత్రాంగాల మధ్య సమన్వయం వహిస్తున్నారు.ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేసేందుకు భవన నిర్మాణం, మౌలిక వసతులు, ప్రత్యేక రవాణా రూట్ ప్లాన్‌ను ఒకేసారి సిద్ధం చేస్తున్నామని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, నల్లగొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్‌లు వెల్లడించారు.

కుటుంబాలకు ఆర్థిక ఊరట – బడి మానేసే రేటుకు చెక్

రోజూ ఉదయమే నాణ్యమైన అల్పాహారం, పౌష్టికాహారం అందడం వల్ల విద్యార్థుల్లో ఏకాగ్రత, అభ్యసన సామర్థ్యం పెరుగుతాయని భావిస్తున్నారు. అంతేకాక విద్యార్థుల హాజరు శాతం పెరగడానికి, బడి మానేసే (డ్రాపౌట్) సంఖ్య తగ్గడానికి ఈ పథకం ఎంతో దోహదపడుతుందని, రోజువారీ కూలిపై ఆధారపడే నిరుపేద కుటుంబాలకు, ముఖ్యంగా బాలికల పోషణకు ఈ కార్యక్రమం ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుందని అధికారులు స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *