– నోటీసులు తిరస్కరించిన రైతులు
– రికార్డుల ప్రకారం న్యాయంగా సర్వే చేసి న్యాయం చేయండి
– శివారు వెంకటాపూర్ రైతుల స్పష్టీకరణ
– సీఎం, కలెక్టర్ న్యాయం చేయాలని వేడుకున్న రైతులు
మర్కుక్,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 24 : మర్కూక్ మండలం ఎర్రవల్లి గ్రామం 325 సర్వే నంబర్ వివాదం ఇప్పుడు శివారు వెంకటాపూర్ గ్రామానికి పాకి తీవ్ర కలకలం రేపుతోంది. శివారు వెంకటాపూర్ గ్రామానికి చెందిన 41,85,88,77,100 సర్వే నెంబర్లకు సంబంధించి జీపీవో అధికారి నోటీసులు ఇవ్వబోగా గ్రామానికి చెందిన 42 మంది రైతులు తిరస్కరించారు. దీంతో చేసేది లేక జీపీవో అధికారి నోటీసులను తిరిగి వెంట తీసుకెళ్లారు. గ్రామస్తులు మాట్లాడుతూ తమకు ప్రభుత్వం అధికారికంగా ధరణి పాస్ పుస్తకాలు, పూర్వపు ఇందిరమ్మ పట్టాలు 41,85,88 సర్వే నంబర్ల పేరుతో ఇచ్చింది. తాము దశాబ్దాలుగా అందులోనే సాగు చేసుకుంటున్నాం.. కానీ అప్పుడు ప్రభుత్వ అధికారులు 2017లో పలు సర్వే నంబర్లతో కూడిన తమ భూములను ఎర్రవల్లికి చెందిన 325 సర్వే నంబర్ లో కలిపేసారని, మళ్లీ ఇప్పుడు నోటీసులు ఇచ్చి కొలవడానికి వస్తున్నారు.. ఇది ఎక్కడి న్యాయమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు 2017 నాటి హద్దులను తమ గ్రామానికి చూపించి ఆ తరువాతనే తమకు నోటీసులు ఇచ్చి సర్వేకు రావాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. సర్వే నంబర్లను శివారు వెంకటాపూర్ గ్రామంలో కలపకుండా ఎర్రవల్లి 325లో కలపడం వల్ల కొందరు రైతులకు తమ సొంత గ్రామం పేరు మీదనే భూమి లేకుండా పోయిందని ఆరోపించారు. 41,85,88,77, 100 సర్వే నంబర్ భూమిని తీసుకెళ్లి 325 లో కలపడం వల్ల గ్రామంలో తాము భూమి లేని వాళ్లం అయిపోతున్నాం అని మాట్లాడారు. పాస్ పుస్తకాలు చేతిలో ఉన్నా సర్వేల పేరుతో తమ భూములు లాక్కుంటే ఎలా? ముందు గ్రామానికి చెందిన సర్వే నెంబర్ల హద్దులు నిర్ధారించాలి.. గతంలో ఉన్న విధంగా తమ శివారు భూములను తమకు చూపించిన తర్వాతే నోటీసులు ఇవ్వాలని, అప్పుడే కొలతలకు సహకరిస్తాం అని జీపీవోకు, సర్వేయర్లకు స్పష్టం చేశారు. దీంతో శివారు వెంకటాపూర్ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హైమవతి వెంటనే స్పందించి రికార్డుల ప్రకారం న్యాయంగా సర్వే చేయించి తమకు న్యాయం చేయాలని రైతులు వేడుకున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు



