– సత్తుపల్లి సైబర్ మోసాల కేసులో సంచలనం
– రంగంలోకి ‘సిట్’
– రాష్ట్రంలోనే అతిపెద్ద సైబర్ ఆర్థిక నేరం
– టీసీఎస్బీ డీఎస్పీ మురళీధర ప్రసాద్ నేతృత్వంలో దర్యాప్తుసత్తుపల్లి/ఖమ్మం, ప్రజాతంత్ర, జూలై 25 : ఖమ్మం జిల్లాలో వెలుగులోకి వచ్చిన భారీ సైబర్ మోసాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రారంభంలో రూ.547 కోట్ల అనుమానాస్పద లావాదేవీలుగా గుర్తించిన ఈ కేసు, దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ రూ.1,000 కోట్లకు పైగా అక్రమ ఆర్థిక లావాదేవీలతో కూడిన దేశ వ్యాప్త సైబర్ నెట్‌వ‌ర్క్‌గా మారే అవకాశాలు కనిపించడంతో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీసీఎస్బీ) ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను రంగంలోకి దించింది. డీఎస్పీ కె.వి.మురళీధర ప్రసాద్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందానికి విచారణ బాధ్యతలు అప్పగించారు. పలు రాష్ట్రాలకు విస్తరించిన నిధుల బదిలీలు, బ్యాంకు ఖాతాల వినియోగం, అంతర్జాతీయ లింకులు, మాస్టర్ మైండ్ల పాత్రపై సిట్ లోతైన దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసు రాష్ట్రంలో ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన అతిపెద్ద సైబర్ ఆర్థిక నేరాల్లో ఒకటిగా అధికారులు భావిస్తున్నారు. సైబర్ మోసాల ద్వారా దేశవ్యాప్తంగా వసూలైన డబ్బును అమాయకుల పేర్లతో తెరిచిన బ్యాంకు ఖాతాల ద్వారా మళ్లించి, అక్రమ నిధులను చట్టబద్ధమైన లావాదేవీలుగా మార్చే వ్యవస్థను నిందితులు ఏర్పాటు చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం. ప్రతి వారం దర్యాప్తు పురోగతి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
సత్తుపల్లి ప్రాంతానికి చెందిన ఓ యువకుడికి ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి అతని పేరుతో బ్యాంకు ఖాతాలు తెరిపించినట్లు నమోదైన ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అనంతరం ఆ ఖాతాల ద్వారా భారీ స్థాయిలో అను మానాస్పద లావాదేవీలు జరిగినట్లు గుర్తించిన పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇదే సమయంలో ఖమ్మంలోని వీఎం బంజారా పోలీస్ స్టే షన్లో నమోదైన మరో కేసులో కూడా ఇలాంటి తరహా లావాదేవీలు బయటపడటంతో రెండు కేసులను అనుసంధానం చేసి ఖమ్మం సీపీ సునీల్ దత్ ఆదేశాలతో కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. దర్యాప్తులో నిందితులు నిరుద్యోగ యువకులు, రోజు వారీ కూలీలు, చిన్న వ్యాపారులు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని లక్ష్యంగా చేసుకున్నట్లు గుర్తించారు. ఉద్యోగాలు, కమిషన్లు, వ్యాపార అవ కాశాల పేరుతో వారి పేర్లపై బ్యాంకు ఖాతాలు తెరిపించి, ఏటీఎం కార్డులు, చెక్ బుక్ లు , ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. తర్వాత దేశవ్యాప్తంగా జరిగిన వివిధ సైబర్ మోసాల ద్వారా బాధితుల నుంచి వసూలైన డబ్బును ఈ ఖాతాల ద్వారా మరో ఖాతాలకు మళ్లించారు. ఇలాంటి మ్యూల్ అకౌంట్లు వందల సంఖ్యలో వినియోగించినట్లు తేలింది.

అనేక రకాల సైబర్ నేరాల అనుసంధానం

కొద్ది నెలల కిందట సత్తుపల్లి కేంద్రంగా 60 మందికి పైగా అరెస్ట్ అయ్యారు. వీరిని జైలుకు పంపిన ఆ తర్వాత బెయిల్ పై వచ్చి దర్జాగా తిరుగుతుండడంతో సత్తుపల్లి , కల్లూరు ప్రాంత యువకులు అదే దారి పడుతున్నారు. ఈ నెట్‌వ‌ర్క్ కు  స్టాక్ మార్కెట్ పెట్టుబడి మోసాలు, క్రిప్టో పెట్టుబడి పేరుతో మోసాలు, ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్లు, ఓటీపీ మోసాలు, మ్యాట్రిమోనీ మోసాలు, నకిలీ పెట్టుబడి పథకాలు వంటి పలు రకాల సైబర్ నేరాలతో సంబంధాలు ఉండొచ్చనే అనుమానంతో సిట్ కు కేటాయించారు. ఈ మోసాల ద్వారా వచ్చిన నిధులను మ్యూల్ ఖాతాల ద్వారా పలు బ్యాంకులకు బదిలీ చేసినట్లు అధికారు లు అప్పట్లో గుర్తించారు. నిధుల ప్రవాహం ఎక్కడి నుంచి ప్రారంభమైంది. చివరకు ఎవరి ఖాతాలకు చేరింది, విదేశీ సర్వర్లు లేదా క్రిప్టో వాలెట్ల వినియోగం ఉందా. అనే కోణంలో కూడా సిట్ అధికారులు విచారణ చేయనున్నారు. దేశ వ్యాప్తంగా పనిచేస్తున్న ఇతర సైబర్ నేర ముఠాలతో ఈ నెట్‌వ‌ర్క్ కు సంబంధాలు ఉన్నాయా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే పలువురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు ప్రకటించగా, మరికొందరి కోసం గాలింపు కొనసాగుతోంది. ప్రధాన నిందితుడు పోట్రు ప్రవీణ్ బిఆర్ఎస్ యువ నేతగా ఉన్నారు. సైబర్ మోసాల ద్వారా కొల్లగొట్టిన  సొమ్మును తన వ్యక్తి గత రాజకీయ పలుకుబడి కోసం వినియోగించారు. వందలు అడిగిన వారికి వేల రూపాయలు అందజేశాడు. ప్రభుత్వం మారగానే ఆయన గుట్టు బయటపడింది. ఈ కేసులో ఇతర నిందితులు పొత్రు కళ్యాణ్, మోరంపూడి చెన్నకేశవ రావు జన్జునూరి శివకృష్ణ, ఉడుతనేని వికాస్ ఉన్నారు. ప్రస్తుత అధికార పార్టీకి చెందిన ఓ మంత్రి స్థాయి అనుచరులుగా ఇందులో కొందరికి ముద్ర ఉండడంతో వారిని ఆఖరున అరెస్ట్ చేశారు. రూ.547 కోట్ల అక్రమ లావాదేవీలు ఉన్నట్లు స్థానిక పోలీసులు తేల్చారు. ప్రస్తుతం ఈ కేసులో విదేశీ లింకులు రూ.547 కోట్ల నుంచి రూ.1,000 కోట్లకు పైగా అక్రమ ఆర్థిక లావాదేవీల ఉండడం, పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆ కేసులను సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు బదిలీ చేశారు. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో నమోదైన రెండు కేసుల ఆధారంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో కొత్తగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. వి.ఎం. బంజారా పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుతో పాటు సత్తుపల్లి పోలీస్ స్టేషన్‌లో నమోదైన మరో కేసును సైబర్ సెక్యూరిటీ బ్యూరో స్వాధీనం చేసుకుంది. ఈ వ్యవహారంలో సాంకేతిక ఆధారాలు, బ్యాంకు లావాదేవీలు, మనీలాండరింగ్ కోణాలపై లోతైన విచారణ చేపట్టనున్నారు. బ్యాంకు లావాదేవీల డిజిటల్ ట్రైల్ ఆధారంగా కీలక సూత్రధారులను గుర్తించే పనిలో దర్యాప్తు సంస్థలు నిమగ్నమయ్యాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు