సమాజానికి మార్గదర్శకుడు రవిదాస్

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 25 : సంత్ రవిదాస్ మహరాజ్ జీవిత చరిత్రను ప్రతి భారతీయుడు తెలుసుకోవాలని, అట్టడుగు వర్గంలో జన్మించినప్పటికీ భక్తి, ఆధ్యాత్మికత, జ్ఞానంతో సమాజానికి మార్గదర్శకులుగా నిలిచారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు పేర్కొన్నారు. భక్తి ఉద్యమంలో రవిదాస్ విశిష్ట పాత్ర పోషించారని, కుల వివక్షకు వ్యతిరేకంగా నిలబడి సమానత్వం, సామాజిక సమరసత, భక్తి మార్గాన్ని ప్రజలకు చూపారని తెలిపారు. సంత్ శిరోమణి రవిదాస్ మహరాజ్ 650వ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయించగా ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి వర్క్‌షాప్ నిర్వహించి వారి సందేశాన్ని సమాజంలోని ప్రతి వర్గానికీ చేర్చే కార్యాచరణపై చర్చిస్తున్నామన్నారు. విదేశీ దండయాత్రలు, సామాజిక సంక్షోభాల కాలంలో హిందూ ధర్మ పరిరక్షణకు రవిదాస్ సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయన్నారు. ఆయన ఆలోచనలు, సందేశాలు, జీవన విధానం నేటి సమాజానికీ అత్యంత ప్రాసంగికమని చెప్పారు. ఆయన వంటి మహనీయులు సమాజాన్ని ఏకం చేసిన మహోన్నతులన్నారు. రవిదాస్ జయంతి సందర్భంగా పార్టీ కేంద్ర కమిటీ రూపొందించిన అన్ని కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గురుపూర్ణిమ సందర్భంగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున ప్రజల భాగస్వామ్యాన్ని కల్పించి రవిదాస్ మహరాజ్ సందేశాన్ని ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీ రేఖా శర్మ, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కాంతి కిరణ్, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, సీనియర్ నాయకులు చింతా సాంబమూర్తి, జాతీయ ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు కె.రాములు, తదితరులు పాల్గొన్నారు.

ప్రశ్నాపత్రాల లీకేజీలను అరికట్టేందుకు కఠిన చట్టం

పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీకేజీలను అరికట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2024లో పబ్లిక్ ఎగ్జామినేషన్స్(ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) చట్టం-2024ను తీసుకొచ్చిందని రామచందర్‌రావు తెలిపారు. శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వ హయాంలో దేశవ్యాప్తంగా అనేక పరీక్షా లీకేజీలు జరిగినప్పటికీ ఇలాంటి కఠినమైన చట్టాన్ని తీసుకురాలేకపోయారన్నారు. పరీక్షల నిర్వహణను మరింత పారదర్శకంగా, నిష్పాక్షికంగా మార్చేందుకు నిపుణులతో కూడిన రాధాకృష్ణ కమిటీ సిఫారసుల మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ)లో కేంద్రం పలు సంస్కరణలు చేపట్టిందన్నారు. ‘నీట్‌’లో లోపాలు జరిగినందున బాధ్యులపై చర్యలు తీసుకుంటూ దాదాపు 47మంది అధికారులను బదిలీ చేసిందన్నారు. 2024 చట్టాన్ని మరింత కఠినతరం చేస్తూ పార్లమెంటులో సవరణలు తీసుకురావాలని నిర్ణయించిందని, ఈ చట్టం పరిధిలో యూపీఎస్సీ, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్, ఎన్‌టీఏ నిర్వహించే పరీక్షలతోపాటు కేంద్ర ప్రభుత్వం నిర్వహించే అన్ని ప్రజా పరీక్షలు ఉంటాయని వివరించారు. అక్రమాలకు పాల్పడిన వారికి కనీసం పదేళ్ల జైలు శిక్ష విధించేలా చట్టాన్ని మరింత కఠినతరం చేస్తున్నారని, ఇప్పటివరకు ఉన్న రూ.కోటి జరిమానాను రూ.15 కోట్ల వరకు పెంచే ప్రతిపాదన తీసుకొచ్చారని చెప్పారు. పేపర్ లీకేజీ కేసుల విచారణ వేగవంతానికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి నాలుగు నెలల్లోపు దర్యాప్తు పూర్తిచేసి చట్టపరమైన చర్యలు తీసుకునేలా వ్యవస్థను బలోపేతం చేస్తున్నారన్నారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడే దిశగా, ప్రజా పరీక్షల విశ్వసనీయతను మరింత బలోపేతం చేసే ఈ చరిత్రాత్మక నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *