– ఎందరో యోధులకు పుట్టినిల్లు తెలంగాణ
– రాచరిక పాలనకు విముక్తి కలిగిన సెప్టెంబర్ 17
– ఆధునిక తెలంగాణను నిర్మించుకుందాం
– ప్రజాపాలన దినోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17 : నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు.. తెలంగాణ ప్రజల స్వేచ్ఛ, ఆత్మగౌరవం, హక్కుల కోసం పోరాడిన యోధులందరికీ ఈ చారిత్రక సందర్భంగా ఘనంగా నివాళులు అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తరతరాల అణచివేత, దోపిడీ, భూస్వామ్య, పెత్తందారీ విధానాలపై ధిక్కార స్వరం వినిపించిన నేల తెలంగాణ అని, నిరంకుశ పాలకులకు వ్యతిరేకంగా ప్రాణాలకు తెగించి పోరాడిన యోధులకు పుట్టినిల్లు అని పేర్కొన్నారు. అస్తిత్వం, ఆత్మగౌరవం, హక్కుల కోసం ఈ నేల ఎప్పటికప్పుడు ప్రజా చైతన్యాన్ని రగిలించిందన్నారు. తెలంగాణ పబ్లిక్ గార్డెన్స్‌లో గురువారం ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. సుదీర్ఘ పోరాట చరిత్రలో సెప్టెంబర్ 17కు ప్రత్యేకమైన స్థానం ఉందన్నారు. భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చినా అప్పటి హైదరాబాద్ రాష్ట్రం నిజాం పాలనలోనే కొనసాగిందని చెప్పారు. తెలంగాణతోపాటు నేటి మహారాష్ట్ర, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు కూడా హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉండేవి.. నిజాం పాలనలో హైదరాబాద్ పారిశ్రామిక, వ్యవసాయ, విద్య, వైద్య రంగాల్లో పురోగతి సాధించింది.. అదే సమయంలో గ్రామీణ తెలంగాణలో భూస్వామ్య దోపిడీ, వెట్టిచాకిరి, అణచివేత తీవ్రంగా ఉండేది అని తెలిపారు. చివరి దశలో రజాకార్ల దౌర్జన్యాలు ప్రజలను కల్లోలపరిచాయని, దేశంలో అంతర్భాగం కావాలన్న ఆకాంక్ష ప్రజల్లో బలపడిందని చెప్పారు. ఆంధ్ర మహాసభ, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉద్యమాలు జరిగాయని, మరోవైపు రజాకార్ల ఆగడాలకు వ్యతిరేకంగా, భూమి-భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో సాయుధ పోరాటం ఉద్ధృతమైందని, రావి నారాయణరెడ్డి, భీంరెడ్డి నరసింహారెడ్డి, అనభేరి ప్రభాకర్‌రావు, చాకలి ఐలమ్మ, ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం వంటి ఎందరో యోధులు ఈ పోరాటాలకు నాయకత్వం వహించారని తెలిపారు. హైదరాబాద్ ప్రజల ఆకాంక్షలు, ఉద్యమాలు, పోరాటాల నేపథ్యంలో ఆనాటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ, ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో ఆపరేషన్ పోలో సైనిక చర్య చేపట్టగా ఏడో నిజాం భారత ప్రభుత్వానికి లొంగిపోయారని గుర్తు చేశారు. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ రాజ్యం అధికారికంగా భారతదేశంలో అంతర్భాగమైందని, అది నిజాం పాలకుల అధికారం ముగిసిన రోజు మాత్రమే కాదు.. రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య పాలనకు మార్గం తెరుచుకున్న చారిత్రక సందర్భం అని అన్నారు. అందుకే సెప్టెంబర్ 17ను మనం ప్రజా పాలన దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. ఆ చరిత్ర మనకు ఒక స్పష్టమైన సందేశం ఇస్తోంది. పాలనలో ప్రజలే కేంద్రంగా ఉండాలి.. ప్రజల ఆశలు, ఆకాంక్షలే ప్రభుత్వ నిర్ణయాలకు ప్రామాణికం కావాలి. అదే స్ఫూర్తితో ప్రజల ఆత్మగౌరవానికి పట్టం కడుతూ ప్రజా పాలన కొనసాగిస్తున్నాం అని ముఖ్యమంత్రి రేవంత్ చెప్పారు. తెలంగాణ ఇప్పుడు పొరుగు రాష్ట్రాలతో మాత్రమే కాదు.. ప్రపంచంతో పోటీ పడుతోందన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం రూ.4,18,931కు చేరిందని, ఇది దేశ తలసరి ఆదాయం కన్నా దాదాపు 91 శాతం అధికం అని, అభివృద్ధి అంకెల్లో మాత్రమే కాక ప్రజల జీవితాల్లో కనిపించాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ఎత్తిపోతలు, ఎసఎల్‌బీసీతోపాటు ఇతర పెండింగ్ ప్రాజెక్టుల పనులను యుద్ధప్రాతిపదికన చేపడుతునామన్నారు. తెలంగాణలో ప్రతి ఆడబిడ్డ సగర్వంగా జీవించాలి.. ఆర్థికంగా స్వతంత్రంగా ఎదగాలి.. అందుకే కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
బీసీలకు 42 శా²తం రిజర్వేషన్లకు బిల్లు రూపొందించాం
సామాజిక అంతరాలను తగ్గించి ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలనే లక్ష్యంతో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వేను శాస్త్రీయంగా చేపట్టామని, ఆ సర్వే ఆధారంగా విద్య, ఉపాధి, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను శాసనసభలో ఆమోదించి రాష్ట్రపతి ఆమోదానికి పంపించామని చెప్పారు. ఫిబ్రవరి 4ను ఏటా ‘తెలంగాణ సోషల్ జస్టిస్ డే’గా జరుపుకుంటున్నామని, సామాజిక న్యాయం అంటే నినాదం కాదు.. వెనుకబడిన వారిని ముందుకు తీసుకు రావడం.. అవకాశాలు తక్కువగా దక్కిన వారికి మరిన్ని అవకాశాలు కల్పించడం.. అప్పుడే సమాజం సమానంగా ముందుకు సాగుతుందని అన్నారు. ప్రజా ప్రభుత్వానికి విద్య, వైద్యం రెండు కళ్లలాంటివన్నారు. కుల, మత భేదాలు లేకుండా నాణ్యమైన విద్య అందాలనే లక్ష్యంతో ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు నిర్మిస్తున్నాం.. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతులు ప్రారంభించాం.. ప్రతి నియోజకవర్గంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం అని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉదయం అల్పాహారం, పాలు అందించేందుకు రూ.927 కోట్లు ఖర్చు చేస్తున్నాం.. మధ్యాహ్న భోజనాన్ని 12వ తరగతి విద్యార్థుల వరకు విస్తరించాం.. 11 లక్షల మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నాం అని వివరించారు. విద్యా రంగంలో తీసుకున్న చర్యలతో పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్‌లో తెలంగాణ 28వ స్థానం నుంచి 18వ స్థానానికి చేరుకుంది.. ప్రపంచంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాల ఆఫ్‌షోర్ క్యాంపస్‌లను హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఆరోగ్య రంగానికీ అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. 72 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను పారదర్శకంగా పూర్తి చేశాం.. గ్రూప్-1 నుంచి గ్రూప్-4 వరకు పరీక్షలను పారదర్శకంగా నిర్వహించా అని సీఎం చెప్పారు. ఏఐతో ఉద్యోగాల స్వరూపం మారుతోంది.. అందుకే నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేస్తూ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్‌గ్రేడ్ చేసుకున్నామని చెప్పారు. పాలిటెక్నిక్ కాలేజీల్లోనూ కొత్త కోర్సులు ప్రవేశపెడుతున్నామన్నారు. మన యువత ప్రపంచంతో పోటీ పడే స్థాయికి ఎదగాలి అని పిలుపునిచ్చారు.
మౌలిక వసతులను వేగంగా విస్తరిస్తున్నాం
రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులను కూడా వేగంగా విస్తరిస్తున్నామన్నారు. రూ.38 ,595 కోట్లతో 122.9 కి.మీ మెట్రో రెండో దశ విస్తరణకు ప్రతిపాదనలు పంపించాం.. ఆదిలాబాద్, మామునూరు విమానాశ్రయాలకు అనుమతులు సాధించాం.. హైదరాబాద్ ప్రజలకు స్వచ్ఛమైన గాలి, నీరు అందించాలనే లక్ష్యంతో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు ప్రారంభించాం.. 55 కి.మీ పరిధిలో మూసీని పునరుజ్జీవింపజేస్తాం అని చెప్పారు.
రేపటి తెలంగాణను నిర్మించేందుకు ప్రణాళికలు 
మన లక్ష్యం రేపటి తెలంగాణను నిర్మించడం.. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 లక్ష్యాలను సాధించేందుకు ప్రజా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది.. దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచే దిశగా అడుగులు వేస్తున్నాం.. దాదాపు 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని దేశంలో తొలి నెట్-జీరో స్మార్ట్ సిటీ నిర్మిస్తున్నాం.. డిసెంబర్‌లో నిర్వహించే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 సందర్భంగా ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్‌ను ఆవిష్కరిస్తాం అని ముఖ్యమంత్రి చెప్పారు.. ఫ్యూచర్ సిటీలో టీసీఎస్ రూ.70 వేల కోట్లతో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ నిర్మించేందుకు ముందుకొచ్చింది. రూ.లక్ష కోట్ల పెట్టుబడితో అమెజాన్ ఇప్పటికే డేటా సెంటర్ నిర్మాణం చేపట్టింది. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, లైఫ్ సైన్సెస్ హబ్, ఈవీ పార్క్, ఏఐ సిటీ, హెల్త్ సిటీ, ఎడ్యుకేషన్ సిటీ వంటి ప్రత్యేక జోన్లతో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నాం.. రీజినల్ రింగ్ రోడ్డు, గ్రీన్‌ఫీల్డ్ హైవేలు, డ్రైపోర్టులు, హైదరాబాద్-నాగపూర్, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-విజయవాడ పారిశ్రామిక కారిడార్లు తెలంగాణ ముఖచిత్రాన్ని మార్చనున్నాయి అని చెప్పారు. రహదారులు అభివృద్ధికి సూచిక అంటూ గ్రామం నుంచి మండలానికి, మండలం నుంచి జిల్లాకు, జిల్లా నుంచి రాష్ట్ర రాజధానికి మెరుగైన రహదారి అనుసంధానం కల్పించేందుకు పనులు చేపట్టామన్నారు. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి.. విద్యుత్ డిమాండ్ కూడా పెరిగింది.. తాగునీరు, విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు రాకుండా ముందస్తు ప్రణాళికలతో పనిచేస్తున్నాం.. ఈ పరిస్థితులను ఎదుర్కునేందుకు ప్రజలవైపు నుంచి కూడా సహకారం ఆశిస్తున్నాం..వీబీజీ రామ్ జీలో ఎక్కువ పని దినాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం అని సీఎం చెప్పారు.
చరిత్రను మరిచిపోం
అభివృద్ధి, సంక్షేమంతోపాటు ఆత్మగౌరవం, స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం ప్రజా పాలనకు పునాదులు. సెప్టెంబర్ 17 మనకు గతాన్ని మాత్రమే గుర్తు చేసే రోజు కాదు. మన బాధ్యతను కూడా గుర్తు చేసే రోజు. చరిత్రను మరిచిపోం.. చరిత్ర దగ్గరే ఆగిపోం.. ఆ పోరాట స్ఫూర్తితో ఆధునిక తెలంగాణను నిర్మించుకుందాం.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల భాగస్వామ్యంతో తెలంగాణను ప్రపంచం గర్వించే రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందాం అని పునరుద్ఘాటించారు.
—————————————————————————————————————————————————————-