– మాటల్లోనే 24గంటల విద్యుత్
– చేతల్లో నిలువునా మోసం
– విద్యుత్ ట్రిప్పింగ్ లతో మడులకు నీరందడంలేదు
– హరీష్ రావు విమర్శలు
గద్వాల, ప్రజాతంత్ర, అక్టోబర్ 14: గద్వాల నిజయోకవర్గం గట్టు మండలంలో వ్యవసాయానికి విద్యుత్ సరఫరా సక్రమంగా జరగడం లేదని ఉదయం నుంచి రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారని హరీష్‌రావు తెలిపారు. గట్టు మండలంలో సాగునీరు, విద్యుత్ అందక ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించి విద్యుత్ సరఫరా తీరును పరిశీలించేందుకు గట్టు మండల విద్యుత్ సబ్‌స్టేషన్‌ను మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంలో 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందితే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం 7-8 గంటల కరెంట్ కూడా రావడం లేదని, మధ్యమధ్యలో పదేపదే ట్రిప్ అవుతూ మోటార్లు నడవక పంటలు ఎండిపోతున్నాయని రైతులు గోడు వెళ్లబోసుకున్నారు.రైతుల ఆవేదన వాస్తవమా కాదా అని స్వయంగా నిర్ధారించుకోవడానికే తామంతా గట్టు సబ్‌స్టేషన్‌కు వచ్చి అధికారుల అధికారిక లాగ్‌బుక్‌ను స్వయంగా పరిశీలించానన్నారు. నిన్న అక్టోబర్ 13 లాగ్‌బుక్ రికార్డుల ప్రకారం రైతులకు ఇచ్చిన త్రీఫేస్ కరెంట్ కేవలం 7 గంటల 50 నిమిషాలు మాత్రమే.అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు కనీసం 8 గంటల కరెంట్ కూడా ఇవ్వలేకపోయింది. ఆ ఇచ్చిన 7 గంటల 50 నిమిషాల్లో కూడా నిరంతరాయంగా విద్యుత్ ఇవ్వలేదు.అందులోనూ మూడు సార్లు విద్యుత్ సరఫరాను బంద్ చేశారు. ఒకసారి గంట సేపు, మరోసారి ఐదు నిమిషాలు, ఇంకోసారి పది నిమిషాల పాటు కరెంట్ నిలిపివేశారు.ఇచ్చిన అరకొర సమయంలోనే మూడు నాలుగు సార్లు కరెంట్ కోతలు పెట్టడం సిగ్గుచేటు.ఇలా పదేపదే విద్యుత్ ట్రిప్ అవ్వడం వల్ల తీవ్ర నష్టం జరుగుతోంది. బోరు ఆన్ చేసి నీళ్లు పారేలోపే కరెంట్ పోతోంది, మళ్లీ వచ్చినప్పుడు మొదట పారిన మడే పారుతోంది తప్ప వెనక మళ్లకు నీళ్లు అందడం లేదు.ఫలితంగా చివరి మళ్లకు చుక్క నీరు అందక పంటలన్నీ రైతుల కళ్లముందే నిలువునా ఎండిపోతున్నాయి.కేసీఆర్ 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తే.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం 7 గంటల 50 నిమిషాల కరెంటు ఇచ్చి అందులోనూ గంటల కొద్దీ కోతలు విధిస్తూ అన్నదాతల జీవితాలతో చెలగాటమాడుతోందన్నారు. లాగ్‌బుక్ ఆధారంగా సబ్‌స్టేషన్ ఆపరేటర్‌ను నిలదీస్తే చేదు నిజాలు బయటపడ్డాయి. మేం ఏం చేస్తాం సార్.. పైనుంచి బంద్ చేయమంటే బంద్ చేస్తాం, ఆన్ చేయమంటే ఆన్ చేస్తాం.. మా ఫోన్లకు అధికారుల నుంచి బంద్ చేయమని మెసేజ్‌లు వస్తాయి తప్ప మా చేతుల్లో ఏమీ లేదు.. పైనుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత కరెంట్ ఇస్తే అంతే ఇస్తాం అని ఆపరేటర్ తన ఫోన్ చూపిస్తూ స్పష్టం చేశాడు. దీన్నిబట్టి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే పైనుంచే రైతుల కరెంట్‌ను కట్ చేస్తోందని రుజువైందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హైదరాబాద్ ముఖ్యం, హైటెక్ సిటీ ముఖ్యం, బడా పరిశ్రమలు ముఖ్యం.. కానీ పల్లెల్లోని పేద రైతులు మాత్రం ముఖ్యం కాదు.అందరూ వాడుకున్న తర్వాత కరెంట్ ఏమైనా మిగిలితే, ఆ మిగిలిన లో-వోల్టేజ్ కరెంటును గట్టు ప్రాంత రైతులకు ఇస్తున్నారు. ఒకవేళ హైదరాబాద్‌కో, పరిశ్రమలకో ఎక్కువ విద్యుత్ అవసరమైతే వెంటనే గట్టు సబ్‌స్టేషన్‌కు, ఇక్కడి రైతులకు కరెంట్ బంద్ చేస్తున్నారు. నగరాలకు, ఐటీ కంపెనీలకు నిరంతరాయంగా విద్యుత్ ఇచ్చి, రైతుల కరెంటుకు మాత్రం ఎసరు పెడుతున్నారు. కేసీఆర్ కు, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉన్న ప్రధాన తేడాను రైతాంగం స్పష్టంగా గమనించాలని కోరారు. కేసీఆర్ రైతును దేశానికి వెన్నెముకగా భావించి, మొదట రైతులకు కడుపునిండా 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చి ఆ తర్వాత మిగిలిన విద్యుత్‌ను పరిశ్రమలకు, ఇతర అవసరాలకు సర్దుబాటు చేశారు.కానీ నేటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైదరాబాద్‌కు, పరిశ్రమలకు కడుపునిండా కరెంట్ ఇచ్చి.. చివరకు మిగిలిన అడుగుబొడుగు లో వోల్టేజ్ విద్యుత్‌ను అన్నదాతల ముఖాన కొడుతోంది. ఈ మోసపూరిత విధానాన్ని రైతు సోదరులు గుర్తించి రేవంత్ సర్కార్‌కు తగిన గుణపాఠం చెప్పాలన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





