పాలమూరు జిల్లాలో మళ్లీ వలసల దుస్థితి

– రోడ్డు ప్రమాద బాధితులకు రూ.10లక్షల నష్టపరిహారం చెల్లించాలి
– నీళ్లుంటే ఈ వలసలు జరిగేవా?
– శ్రీశైలంలో నీళ్లున్నా మోటార్లు నడపలేదు
– విద్యుత్ సరఫరా లేక పంటలు ఎండిపోతున్నాయి
– ఉచిత కరెంటుకు ఉరితాడు జీవోనెం.17
– పాలమూరు వలసలకు రేవంత్ అసమర్థతే కారణం
– కొడంగల్లో రైతులకు బేడీలు
– నీళ్లడిగిన మక్తల్ రైతులపై నాన్ బెయిలబుల్ కేసులు
– సర్కార్ పై విరుచుకుపడ్డ హరీష్ రావు

గద్వాల, ప్రజాతంత్ర, అక్టోబర్ 14 : పాలమూరు జిల్లా నుంచి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆనాటి రోజులు తెస్తా.. పాత రోజులు తెస్తా అన్నాడు.. చెప్పినట్లే పాలమూరుకు పాత వలసల రోజులు తీసుకొచ్చాడని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా విమ‌ర్శించారు.  గద్వాల జిల్లా ఇందువాసి గ్రామంలో దాదాపు 40 దళిత కుటుంబాలు కూలి పనుల కోసం పక్క రాష్ట్రమైన కర్ణాటకకు వెళ్లి యాదగిరి జిల్లాలో రోడ్డు ప్రమాదానికి గురవడంతో బుధవారం ఆయన వారిని పరామర్శించారు. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించడగా మరో ఇద్దరి పరిస్థితి విషయమంగా వుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ స్పందించి బాధితులను పరామర్శించి సహాయం అందించమని అదేశించగా ప్రమాదంలో మరణించిన ఏసేపు, నాగన్న కుటుంబ సభ్యులను ఓదార్చి బీఆర్ఎస్  తరపున వారికి తక్షణ ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంతవరకు ఈ సంఘటనపై కలెక్టర్, ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమన్నారు. బాధితులకు రూ.10లక్షల నష్టపరిహారం ఇవ్వాలని, తీవ్రంగా గాయపడ్డ వారికి ప్రభుత్వం తరఫున మెరుగైన పూర్తి ఉచిత వైద్యం అందిస్తూనే తగిన ఆర్థిక సాయం అందించాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేశారు. సాగునీరు రాక, కరెంట్ లేక, చేతినిండా కూలి దొరకక మళ్లీ వలసలు మొదలయ్యాయి. ఈ గ్రామంలో ఎవరిని కదిలించినా కరెంట్ రావడం లేదని, కరెంట్ పరిస్థితి ఘోరంగా మారిందని లబోదిబోమంటున్నారన్నారు. కనీసం 6-7 గంటల కరెంట్ కూడా సక్రమంగా ఇవ్వడం లేదని రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారన్నారు. మేం ఇక్కడికి వస్తుంటే మార్గమధ్యంలో మల్దకల్, అయిజలో రైతులు మా కారును ఆపి సార్, రేవంత్ రెడ్డిని గట్టిగా నిలదీయండి.. నేను రైతును, ఎనిమిది ఎకరాల్లో పంట వేస్తే కరెంట్ రాక నిలువునా ఎండిపోతోంది అని ఎంతో ఆవేదనతో మొరపెట్టుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో పల్లె పల్లె పాలమూరులోన పల్లేర్లు మొలిసెనా అంటూ వలసల వేదనపై పాటలు పాడుకున్న దుస్థితి ఉండేది. కానీ రాష్ట్రం వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రత్యేక శ్రద్ధ చూపి నెట్టంపాడు, భీమా, కోయిల్‌సాగర్, కల్వకుర్తి లాంటి పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చారు. దాదాపు రూ. 4 వేల కోట్లు ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున చెక్ డ్యామ్‌లు నిర్మించి, చెరువులు బాగుచేసి పాలమూరు జిల్లాలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది. ఈ ఇందువాసి గ్రామానికి కూడా నెట్టంపాడు నీళ్లను పారించింది బీఆర్ఎస్సే. 24 గంటల కరెంట్, రైతుబంధు ఇచ్చి ఆదుకున్నాం. దాంతో గ్రామం పత్తి, పొగాకు, మొక్కజొన్న విత్తన పంటలకు కేరాఫ్ అడ్రస్‌గా మారి, పెద్ద పెద్ద సీడ్ కంపెనీలు ఇక్కడికి వచ్చి రైతులతో ఒప్పందాలు చేసుకున్నాయి. గ్రామస్తులందరికీ పుష్కలంగా ఉపాధి దొరికింది. గతంలో కేటీఆర్ వచ్చినప్పుడు రోడ్డుపై కూలీలను పలకరిస్తే మేము కర్ణాటక నుంచి, కర్నూలు నుంచి గద్వాలకు కూలి పనుల కోసం వలస వచ్చామని చెప్పిన పరిస్థితి ఉండేది. ఈ ప్రభుత్వం విద్యుత్ సరఫరాలో పూర్తిగా విఫలమైంది. ఆనాడు కేసీఆర్ పాలనలో బొంబాయి, దుబాయ్ పోయిన పాలమూరు బిడ్డలు తిరిగి సొంత గ్రామాలకు వచ్చి గౌరవంగా వ్యవసాయం చేసుకుని బతికారు. కానీ కాంగ్రెస్ పాలన రాగానే మళ్లీ వలసలు ప్రారంభమయ్యాయి. సీఎం సొంత జిల్లాలోని ఈ గ్రామం నుంచి 40 దళిత కుటుంబాలు పొట్టచేతపట్టుకుని కర్ణాటకకు వలసపోయే దుస్థితి వచ్చిందంటే రేవంత్ రెడ్డి సిగ్గుతో తలదించుకోవాలి, ప్రజలకు క్షమాపణ చెప్పాలి.నీ పాలనలో నీ జిల్లాలోని వలసకూలీలకు కూడా నువ్వు న్యాయం చేయలేకపోయావు. కేసీఆర్ గారు వలసపోయినోళ్లను వాపస్ తెస్తే, నువ్వు మాత్రం పాలమూరు బిడ్డలను మళ్లీ వలసలపాలు చేశావు.దీనికి ముమ్మాటికీ కరెంట్ ఇవ్వకపోవడం, నీళ్లు ఇవ్వకపోవడమే కారణం. నెట్టంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టుల్లో 24 గంటలు నడపాల్సిన మోటార్లను 8-9 గంటలే నడిపి నీళ్లు ఎత్తకపోవడం వల్ల చివరి ఆయకట్టుకు నీళ్లందక పంటలు ఎండిపోయి జనం వలసబాట పట్టారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక పాలమూరు జిల్లాలో ఒక్క ఎకరానికైనా కొత్తగా సాగునీరు ఇచ్చారా? ఒక్క చెక్ డ్యామ్ కట్టారా? ఒక్క చెరువునైనా బాగుచేశారా?కేసీఆర్ గారు కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యి లాంటి ప్రాజెక్టులను, వాటి మోటార్లను కూడా నడపడం చేతకావడం లేదు. కల్వకుర్తి, నెట్టంపాడు, భీమాల్లో 24 గంటలు నడవాల్సిన మోటార్లను 7-8 గంటలే ఎందుకు నడుపుతున్నారు?ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ అసమర్థత తెచ్చిన కరువు. నీళ్లు ఎత్తకపోవడం, కరెంట్ ఇవ్వకపోవడం వల్ల పాలమూరుకు రేవంత్ రెడ్డి రూపంలో గ్రహణం పట్టింది.శ్రీశైలంలో నీళ్లున్నా ఐదు మోటార్లు నడపాల్సిన చోట రెండే మోటార్లు నడుపుతున్నారు. లో-వోల్టేజీతో రైతుల మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయి, బోర్ల నుంచి నీళ్లు రావడం లేదు.మంత్రులు తుమ్మల, పొంగులేటి ప్రజలను భయపెడుతూ ‘ఎల్‌నినో’ వల్ల కరువు వచ్చిందని సాకులు చెబుతున్నారు. ఎల్‌నినోకు బొగ్గు కొరతకు ఏం సంబంధం?బొగ్గు లేక కరెంట్ ఉత్పత్తి ఆగిపోయింది మీ చేతగానితనం వల్ల కాదా? ఇది ఎల్‌నినో కాదు.. ముమ్మాటికీ కాంగ్రెస్ వైఫల్యం తెచ్చిన ‘ఎల్-కాంగో’ కరువు. పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృష్ణా నది నీళ్లను 700 కిలోమీటర్లు తీసుకెళ్లి కుప్పంలో పారిస్తున్నాడు. వెలిగొండ ప్రాజెక్టును మొదలుపెట్టి రాయలసీమలో నీళ్లు పారిస్తూ జలహారతులు పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో క్రాప్ హాలిడే లేదు.. కానీ తెలంగాణలో క్రాప్ హాలిడే ఎందుకు వచ్చింది? గోదావరి, కృష్ణా నదులు తెలంగాణ నుంచే కదా కిందికి పోవాలి.. తెలంగాణలో నీళ్లను ఒడిసిపట్టకుండా రేవంత్ రెడ్డి విడిచిపెట్టడం వల్లే కదా చంద్రబాబు ఒడిసిపట్టిడు.. పక్కనే కృష్ణమ్మ పారుతున్నా మన ఇందువాసిలో నీళ్లు లేవు. కరెంట్ లేక మిరప, పత్తి పంటలు ఎక్కడికక్కడ ఎండిపోయి రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 80 శాతం పూర్తి చేసి, 50 టీఎంసీలు నింపుకునే రిజర్వాయర్లు, టన్నెళ్లు, పంప్‌హౌస్‌లు, సబ్‌స్టేషన్లు నిర్మించి సిద్ధం చేశారు.ప్యాకేజీ-3 లో మూడు నెలలు గట్టిగా పనిచేస్తే పూర్తయ్యే చిన్న పనిని మూడేళ్లయినా ఈ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది. ఆ పని పూర్తి చేసుంటే శ్రీశైలం నుంచి 50 టీఎంసీల నీళ్లు ఎత్తిపోసి పాలమూరు నెత్తిమీద కుండలా పెట్టుకునేవాళ్లం.. జిల్లాలో అసలు కరువు అనే మాటే ఉండేది కాదు.మీ చేతగానితనం, నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి వచ్చింది. కేసీఆర్ ఉన్నప్పుడు కరోనా మహమ్మారి వచ్చినా నీళ్లు ఆగలేదు, కరెంట్ ఆగలేదు, రైతుబంధు ఆగలేదు.రైతును కేంద్రంగా చేసుకుని పాలన సాగింది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దేవుడి మీద ఒట్లు పెట్టి రుణమాఫీ ఎగ్గొట్టింది, మూడు పంటల రైతుబంధు ఎగ్గొట్టింది, రైతుబీమాను రద్దు చేసింది.నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 17తో ఒక విషయం స్పష్టమైంది. 24 గంటల ఉచిత కరెంటుకు కాంగ్రెస్ పార్టీ ఉరివేసింది.ఆ ఉరే జీవో 17. వ్యవసాయం కోసం ప్రత్యేకంగా ‘రైతు డిస్కం’ పెట్టి, దానికి కేవలం సోలార్ పవర్‌ను మాత్రమే కేటాయించారు. సోలార్ పవర్ అంటే ఉదయం 7-8 గంటలకు వచ్చి సాయంత్రం 4 గంటలకే పోతుంది.అంటే రైతులకు 6-7 గంటల కరెంటుకు మించి ఇచ్చేది లేదని జీవో 17 ద్వారా ప్రభుత్వం అధికారికంగా తేల్చేసింది. ఇకపై రైతులకు రాత్రిపూట కరెంట్ రాదు, కేసీఆర్ ఇచ్చినట్లు 24 గంటల కరెంటూ రాదు.
ఇదే జిల్లాలో తిరుగుతున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను, సీఎం రేవంత్ రెడ్డిని సూటిగా అడుగుతున్నా.. 24 గంటల కరెంట్ ఇస్తారా ఇవ్వరా? రైతులంటే ఎందుకంత చిన్నచూపు? రైతు అనగానే మీ చేతులకు కోతలు ఎందుకు పడుతున్నాయి..ఎన్నికల మేనిఫెస్టోలో, అసెంబ్లీ బడ్జెట్లో పెట్టి బల్లలు చరిచి మరీ వ్యవసాయ కూలీలకు ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ కింద ఏటా రూ. 12,000 ఇస్తామని చెప్పారు.
ఆ హామీని ఎందుకు అమలు చేయలేదు? ఈ దళిత బిడ్డలకు ఏటా రూ. 12 వేల సాయం అంది ఉంటే వాళ్లు పొట్టచేతపట్టుకుని కర్ణాటకకు పోయి ప్రాణాలు కోల్పోయేవారా?వాళ్ల కాళ్లు చేతులు విరిగేవా? అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ దళిత, గిరిజన, బలహీన వర్గాల కూలీలను దగా చేశారు.బడా కాంట్రాక్టర్ల బిల్లులకు, ఫ్యూచర్ సిటీకి, మూసీ సుందరీకరణకు, ఢిల్లీకి కప్పం కట్టడానికి వేల కోట్లుంటాయి కానీ.. పేద కూలీలకు రూ. 12 వేలు ఇవ్వడానికి పైసలు లేవా?ఇది నిధుల కొరత కాదు, పేదలంటే ప్రభుత్వానికి ఉన్న చిన్నచూపు. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క గారు.. మీ సొంత జాతి బిడ్డలకు మీరే ఇంత ద్రోహం చేయడం తగునా అని ప్రశ్నిస్తున్నా.మంత్రులు తుమ్మల, పొంగులేటి 50 డిగ్రీల ఎండలొస్తాయి, తాగడానికి నీళ్లుండవు అని ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ప్రభుత్వం భయపెట్టడం కాదు, భరోసా కల్పించాలి.ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవడానికి ఉచితంగా విత్తనాలు ఇవ్వాలి, పెట్టుబడి కోసం ముందస్తుగా రైతుబంధు నిధులు విడుదల చేయాలి. కరువు వస్తే కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇచ్చి, ఉపాధి హామీ పనిదినాలు పెంచి ఆదుకోవాలి. దిశానిర్దేశం లేకుండా ప్రజలను ఆందోళనకు గురిచేస్తే వలసలు పోక ఏం చేస్తారు? దసరా పండుగ పూట రేవంత్ సర్కార్ ప్రజల ఉసురు పోసుకుంటోంది. విద్యుత్ ఛార్జీలు యూనిట్‌కు 50 పైసలు పెంచారు. మార్కెట్లో వంట నూనె ధర కిలో రూ. 210, కందిపప్పు రూ. 180, పెసరపప్పు రూ. 135, ఉల్లిగడ్డ రూ. 70కి చేరి నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి.ఒకవైపు కరెంట్ లేక పంటలు ఎండిపోతుంటే, మరోవైపు కరెంట్, బస్సు ఛార్జీలు, నిత్యావసరాల ధరలు పెంచి ప్రజలను నానా ఇబ్బందులు పెడుతున్నారు. నాది మహబూబ్‌నగర్ జిల్లా అని గొప్పలు చెప్పుకునే రేవంత్ రెడ్డి పాలమూరు పులి కాదు, పాలమూరు పిల్లి. సొంత గడ్డకే తీరని ద్రోహం చేసిన పాలమూరు ద్రోహి. కొడంగల్‌లో భూములు ఇవ్వమన్న రైతుల చేతులకు బేడీలు వేయించాడు. మక్తల్‌లో పంట ఎండిపోతోందని జూరాల నుంచి సాగునీరు అడిగినందుకు 14 మంది రైతులపై నాన్-బెయిలబుల్ కేసులు పెట్టించాడు. కళ్లముందు నీళ్లున్నా పంటకు ఇవ్వకపోతే నిలదీసిన రైతులపై అక్రమ కేసులు పెట్టడమేనా సొంత జిల్లాకు రేవంత్ ఇచ్చే బహుమానం? పాలమూరు ప్రజలకు కన్నీళ్లు, కరువు, వలసలు, రైతులకు బేడీలు, నాన్-బెయిలబుల్ కేసులే కాంగ్రెస్ ఇచ్చిన కానుకలు. కేసీఆర్  పోరాడి కృష్ణా జలాల ట్రిబ్యునల్ సాధిస్తే మూడేళ్లు గడిచినా ట్రిబ్యునల్ ముందు సమర్థవంతంగా వాదనలు వినిపించడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు . వాదనలు వినిపించకుండా కాలయాపన చేయడం వల్లే కృష్ణా నదిలో తెలంగాణ వాటా తేలడం లేదు. చివరకు కృష్ణా జలాల్లో తాత్కాలిక వాటాగా ఉన్న 34 శాతం నీటిని కూడా పొలాలకు మళ్లించలేకపోయారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎన్నడూ ఇంత తక్కువ నీళ్లు వాడలేదు. కొత్తగా ప్రాజెక్టులు, చెక్ డ్యామ్‌లు కట్టడం చేతకాదు కానీ ఉన్న ప్రాజెక్టుల నీళ్లను కూడా వాడుకోలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ప్రమాదంలో మృతిచెందిన వలసకూలీల కుటుంబాలకు రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చి, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి.ఎండిపోతున్న పంటలకు తక్షణమే సాగునీరు, 24 గంటల విద్యుత్ ఇచ్చి ఆదుకోకపోతే రైతులు, బాధిత కుటుంబాల పక్షాన బీఆర్ఎస్ పార్టీ తీవ్రస్థాయిలో పోరాటం చేస్తుందని హెచ్చరించారు.  ఈ పర్యటనలో హరీశ్ రావు వెంట మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, స్థానిక సీనియర్ నాయకులు హన్మంతు నాయుడు, మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల ఆవేదన

జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం ఇందువాసి గ్రామంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు కాన్వాయ్‌ను స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆపి తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు.పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో ప్రతిరోజూ నాసిరకం పురుగుల అన్నం, ప్రతిరోజు వంకాయ కూర పెడుతున్నారని హరీశ్ రావు ఎదుట విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
పాఠశాలలో సబ్జెక్ట్ టీచర్లు లేకపోవడంతో చదువుకు తీవ్ర ఆటంకం కలుగుతోందని, కనీస వసతులు కరువై ఇబ్బందులు పడుతున్నామని దీనివల్ల స్కూల్ డ్రాపౌట్స్ అధికంగా పెరిగాయని వాపోయారు.అంతేకాకుండా, గ్రామంలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితుల వల్ల చదువులు మధ్యలోనే మానేసి, తల్లిదండ్రులతో కలిసి కూలీ పనుల కోసం వలస వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.విద్యార్థుల సమస్యలను ఓపిగ్గా విన్న హరీశ్ రావు.. పాఠశాల దుస్థితిని విద్యార్థుల ఆవేదనను స్వయంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *