– మూడేళ్లలో రూ.1,64,431 కోట్లు నేరుగా ప్రజల ఖాతాల్లోకి జమ
– ఈ లెక్కలపై ఎలాంటి చర్చకైనా, సవాల్‌కైనా సిద్ధం
– రాష్ట్రంలో రహదారుల నిర్మాణానికి రూ.90 వేల కోట్లు
– జిల్లా వనరుల ఆధారంగా అభివృద్ధి ప్రణాళికలు
– అచ్చంపేటను ప్రధాన జంక్షన్‌గా తీర్చిదిద్దుతాం
– ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
అచ్చంపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 14 : రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా లబ్ది పొందని కుటుంబం లేదని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గత మూడేళ్లలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా రూ.1,64,431 కోట్లను నేరుగా ప్రజల ఖాతాల్లోకి జమ చేశామని వెల్లడించారు. ఈ లెక్కలపై ఎవరితోనైనా చర్చించేందుకు, ఎలాంటి సవాల్‌నైనా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రతి రూపాయిని వారి అభివృద్ధి, సంక్షేమం కోసమే ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేస్తున్నామని తెలిపారు. అచ్చంపేట నియోజకవర్గంలో రూ.74.82 కోట్ల వివిధ అభివృద్ధి పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు. మన్ననూరులో 220/33 కెవి సబ్ స్టేషన్‌కు శంకుస్థాపన చేసిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా రహదారుల నిర్మాణానికి రూ.90 వేల కోట్లు కేటాయించామని, జిల్లాల్లో అందుబాటులో ఉన్న సహజ వనరులు, నదులు, ఖనిజ సంపద, మానవ వనరుల ఆధారంగా ప్రత్యేక అభివృద్ధి ప్రణాళికలు రూపొందించి ముందుకు సాగుతామని చెప్పారు. అచ్చంపేట ప్రాంతాన్ని ప్రధాన రవాణా కూడలిగా అభివృద్ధి చేయడంతోపాటు పర్యాటక రంగం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు.
ప్రతి కుటుంబానికీ సంక్షేమ ఫలాలు
రాష్ట్రంలో కోటి 15 లక్షల కుటుంబాలు ఉండగా కోటి ఆరు లక్షల కుటుంబాలకు వివిధ సంక్షేమ పథకాల ద్వారా ప్రయోజనాలు అందుతున్నాయని భట్టి విక్రమార్క వివరించారు. పేదల ఆహార భద్రతకు ప్రాధాన్యమిస్తూ ప్రతి వ్యక్తికీ ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నామని, దాదాపు కోటి ఆరు లక్షల కుటుంబాలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం కల్పిస్తున్నామని, 43 లక్షల కుటుంబాలకు చేయూత పింఛన్లు అందిస్తున్నామని, 71.40 లక్షల మంది రైతులకు రైతు భరోసా కింద ఎకరానికి ప్రతి సీజన్లో రూ.6 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామని వివరించారు. రాష్ట్రంలోని 53 లక్షల కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని తెలిపారు. రైతు భరోసా, పంట రుణ మాఫీ, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాల ద్వారా అర్హులైన ప్రజలకు ప్రయోజనాలు అందిస్తున్నామన్నారు. ఇప్పటివరకు సుమారు 76 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగావకాశాలు కల్పించామని చెప్పారు. ఏడు లక్షల మంది పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్నామని వివరించారు. కేవలం ఈ నియోజకవర్గంలోనే 7,300 ఇళ్లను మంజూరు చేశామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 27 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నామని, వారంలో మూడు రోజులు పాలు, మరో మూడు రోజులు రాగి జావ ఇస్తున్నామని చెప్పారు. కళాశాలల్లో చదువుతున్న సుమారు 12 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అందించే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు. కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా రోడ్డున పడకూడదనే ఉద్దేశంతో నవంబర్ 19న ఇందిరమ్మ జయంతి సందర్భంగా కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా ప్రతి కుటుంబానికీ వర్తించేలా ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని వెల్లడించారు.
రహదారులకు రూ.90 వేల కోట్లు
రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో భారీగా మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రహదారుల నిర్మాణానికి రూ.90 వేల కోట్లు కేటాయించామని చెప్పారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రీజినల్ రింగ్ రోడ్డు, మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధి, క్లస్టర్ డెవలప్మెంట్ వంటి ప్రాజెక్టులపై దృష్టి సారించామని వివరించారు. రాష్ట్ర అభివృద్ధిని హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా ప్రతి జిల్లాలో అందుబాటులో ఉన్న వనరులను గుర్తించి వాటికి అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పారు. నదులు, ఖనిజ సంపద, వ్యవసాయం, పర్యాటకం, మానవ వనరులను సమర్థంగా వినియోగించుకొని జిల్లాలవారీగా ఆర్థిక ప్రగతిని సాధిస్తామని స్పష్టం చేశారు.
అచ్చంపేట అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం
నియోజకవర్గంతో తనకు 1980 నుంచి విడదీయలేని అనుబంధం ఉందని భట్టి విక్రమార్క గుర్తు చేసుకున్నారు. తన సోదరుడు స్వర్గీయ మల్లు అనంతరాములు ఈ ప్రాంతం నుంచి పార్లమెంటుకు పోటీ చేసిన రోజుల నుంచి ఇక్కడి గ్రామాలతో తనకు పరిచయం ఉందని చెప్పారు. విద్యార్థిగా ఉన్నప్పటినుంచి ఈ ప్రాంతంలోని అనేక గ్రామాల్లో పర్యటించానని, ప్రజల సమస్యలను దగ్గరగా చూశానని తెలిపారు. గతంలో ఈ ప్రాంత ప్రజలు ప్రధానంగా విద్యుత్ సమస్యలతో ఇబ్బందులు పడేవారని, ప్రస్తుతం విద్యుత్ శాఖ తన వద్ద ఉండటంతో సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నియోజకవర్గంలో ఇప్పటికే 1,219 కొత్త డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశామని, 403 కి.మీ మేర కొత్త విద్యుత్ పంపిణీ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేశామని, 5 వేల కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చామని వివరించారు. ఈ పనుల కోసం ఇప్పటికే సుమారు రూ.75 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. భవిష్యత్తులో ప్రజలకు, రైతులకు విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా మరిన్ని మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. రాబోయే 50 సంవత్సరాల భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేశామని వెల్లడించారు.
ఎకో టూరిజంతో స్థానికులకు ఉపాధి
అచ్చంపేట ప్రాంతంలో రహదారులు, ఎలివేటెడ్ కారిడార్లు, కృష్ణానదిపై వంతెనలు వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందుతున్నాయని తెలిపారు. వీటి ద్వారా అచ్చంపేటను ప్రధాన రవాణా కూడలిగా తీర్చిదిద్దే అవకాశం ఉందన్నారు. మన్ననూరు, నల్లమల అటవీ ప్రాంతాలకు ఉన్న సహజ సౌందర్యం, వన్యప్రాణుల సంపదను పర్యాటక అభివృద్ధికి అనుకూలంగా వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. ఎకో టూర్పుిం అభివృద్ధి ద్వారా స్థానిక గిరిజన కుటుంబాలు, రైతులు, నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వివరించారు. పర్యాటకులు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు స్థానికంగా వసతి, ఆతిథ్యం, రవాణా, ఇతర సేవల ద్వారా కుటుంబాలకు ఆదాయం లభిస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రాంతానికి ఉన్న ప్రత్యేకతలను గుర్తించి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన సహాయ సహకారాలు, నిధులు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు.
ప్రజల సమస్యలే ప్రభుత్వ ప్రాధాన్యాలు
గతంలో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సందర్భంగా ఈ నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో పర్యటించిన రోజులను భట్టి గుర్తు చేసుకున్నారు. 2023 మే 31న లింగాల మండలం అంబటపల్లి నుంచి ప్రారంభమైన పాదయాత్రలో భాగంగా నియోజకవర్గంలోని సుమారు 42 గ్రామాల్లో 130 కి.మీ మేర నడిచామని తెలిపారు. ఆ సమయంలో ప్రజలు పెన్షన్లు, గ్యాస్, పోడు భూములు, విద్యుత్ బిల్లులు, సాగునీరు వంటి సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. ఎసఎల్బీసీ ప్రాజెక్టును సందర్శించినప్పుడు పనులు పూర్తి చేసి నీటిని అందిస్తామని హామీ ఇచ్చామని గుర్తు చేశారు. నక్కలగండి ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేయాలనే అంశాన్ని కూడా ప్రభుత్వం ప్రాధాన్యంగా తీసుకుంటుందని తెలిపారు. ప్రజల సమస్యలను మరిచిపోకుండా, రాష్ట్ర ఆదాయానికి అనుగుణంగా ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





