– యూకే సంస్థలతో రెండు కీలక ఒప్పందాలు
– వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 14 : రాష్ట్రంలో చేనేత, జౌళి రంగాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానిస్తూ టెక్నికల్ టెక్స్టైల్స్ రంగాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా యునైటెడ్ కింగ్డమ్కు చెందిన ప్రముఖ విద్యా, పరిశ్రమ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం రెండు కీలక అవగాహన ఒప్పందాలను బుధవారం కుదుర్చుకుందని వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తద్వారా టెక్నికల్ టెక్స్టైల్స్ రంగంలో పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలను ప్రోత్సహించడంతోపాటు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడం, నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేయడం, పరిశ్రమలకు అవసరమైన శిక్షణను అందించడం, ఈ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు పేర్కొన్నారు.
హడర్స్ఫీల్డ్ విశ్వవిద్యాలయంతో తొలి ఎంవోయు
యునైటెడ్ కింగ్డమ్లోని యూనివర్సిటీ ఆఫ్ హడర్స్ఫీల్డ్, తెలంగాణ ప్రభుత్వ చేనేత, జౌళి శాఖ మధ్య కుదిరిన తొలి అవగాహన ఒప్పందం ద్వారా రాష్ట్రంలో టెక్నికల్ టెక్స్టైల్స్ రంగంలో పరిశోధన, అభివృద్ధికి సహకారం అందనుంది. ఉమ్మడి విద్యా కార్యక్రమాల నిర్వహణకు అవకాశాలను అన్వేషించడం, విజిటింగ్ అకడమిక్ సిబ్బంది నియామకం, అధ్యాపకులు, విద్యార్థుల పరస్పర మార్పిడిని ప్రోత్సహించడం వంటివి ఈ ఒప్పందం ముఖ్యోద్దేశం అని మంత్రి పేర్కొన్నారు. అలాగే టెక్నికల్ టెక్స్టైల్స్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక పురోగతికి అవసరమైన సమగ్ర వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ఈ భాగస్వామ్యం దోహదపడనుందన్నారు.
టెక్స్టైల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్తో రెండో ఒప్పందం
యునైటెడ్ కింగ్డమ్కు చెందిన టెక్స్టైల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్తో రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమలు, వాణిజ్య శాఖ పరిధిలోని చేనేత, జౌళి, హస్తకళల విభాగం రెండో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీని ద్వారా టెక్నికల్ టెక్స్టైల్స్ రంగంలో వృత్తి విద్య, శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రత్యేకంగా 3డి వీవింగ్, కాంపోజిట్ మెటీరియల్స్ వంటి ఆధునిక సాంకేతిక వస్త్రాల తయారీ, పరిశోధన, శిక్షణపై దృష్టి సారించనున్నారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను గుర్తించి, వాటికి అనుగుణంగా శిక్షణ కార్యక్రమాలను రూపొందించడం, అంతర్జాతీయ నైపుణ్య ప్రమాణాలకు అనుగుణంగా మానవ వనరులను తీర్చిదిద్దడం ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశం అన్నారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో నైపుణ్యాభివృద్ధి
టెక్నికల్ టెక్స్టైల్స్ రంగంలో ప్రపంచస్థాయి నైపుణ్య ప్రమాణాలను రాష్ట్రంలో అమలు చేసే అవకాశాలను పరిశీలించడంతోపాటు, పరిశ్రమలు, శిక్షణ సంస్థల మధ్య సమన్వయాన్ని పెంపొందించనున్నారు. తద్వారా పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ పొందిన నిపుణులను తయారు చేయడం, దేశానికి అంతర్జాతీయంగా పోటీతత్వం కలిగిన టెక్స్టైల్ కార్మిక శక్తిని అభివృద్ధి చేయడం సాధ్యమవుతుందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో టెక్నికల్ టెక్స్టైల్స్ రంగానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని, అంతర్జాతీయ విద్యా సంస్థలు, పరిశ్రమలతో భాగస్వామ్యాల ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధన, నైపుణ్యాభివృద్ధికి కొత్త మార్గాలు ఏర్పడతాయని పేర్కొన్నారు. ఈ భాగస్వామ్యాలను సమర్థంగా వినియోగించుకుని రాష్ట్రంలో టెక్నికల్ టెక్స్టైల్స్ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. సమావేశంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, జౌళి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సబ్యసాచి ఘోష్, యార్క్ షైర్ మేయర్ బిజినెస్ అడ్వైజర్ మాండీ రిడ్యార్డు, యాంటిచ్ అండ్ సన్స్ (హడర్స్ఫీల్డ్) లిమిటెడ్ ఎం అండ్ హెచ్ డేవిడ్ యాంటిచ్, టెక్నికల్ టెక్స్టైల్స్ ప్రొఫెసర్ గోస్వామి, టెక్స్టైల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎండీ అజీజ్, జౌళి శాఖ అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





