– కరువు ఎదుర్కోవడంలో భాగస్వాములు కావాలి
– పార్టీ శ్రేణులకు సీఎం రేవంత్‌రెడ్డి పిలుపు
– ఎల్‌నినోపై టీపీసీసీ ఆధ్వర్యంలో పార్టీ ప్రజాప్రతినిధుల సమావేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 23 : రాష్ట్రంలో రానున్న రోజుల్లో ఎదురయ్యే ఎల్‌నినో కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు, ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేసేందుకు ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజాభవన్‌లో శుక్రవారం జరిగిన ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఎల్‌నినో అనేది భూతం కాదని, తీవ్రమైన కరువు పరిస్థితులని తెలిపారు. కేవలం మన రాష్ట్రమే కాక మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సహా ప్రపంచవ్యాప్తంగా దాదాపు వంద దేశాలు ఈ ఎల్‌నినో ప్రభావంతో కరువును ఎదుర్కొంటున్నాయని వివరించారు. ప్రజా భవన్‌లో టీపీసీసీ ఆధ్వర్యంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, డీసీసీ అధ్యక్షులు, ముఖ్య నాయకుల సమావేశం శుక్రవారం జరిగింది. సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు తదితరులు హాజరు కాగా ఎల్‌నినో, ఎమ్మెల్సీ ఎన్నికలపై సీఎం దిశా నిర్దేశం చేశారు. కరవు ప్రారంభమైనప్పుడు మొదట మనకు దాని ప్రభావం తెలియదు.. నెమ్మదినెమ్మదిగా కబళిస్తుంది.. ఆరు నెలల నుంచి ప్రజలను అప్రమత్తులను చేస్తున్నాం అని చెప్పారు. అక్టోబర్ నుండి జూలై వరకు ఎండ వేడి విపరీతంగా పెరిగి నీటి ఆవిరి ఎక్కువవుతుందని, ఫలితంగా నీటి అందుబాటు తగ్గుతుందని రేవంత్‌రెడ్డి చెప్పారు. ఉష్ణోగ్రతలు పెరిగి నీటి కొరత వల్ల విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతుందని హెచ్చరించారు. సాధారణంగా ఈ సీజన్‌లో 13 వేల మెగావాట్లకు మించని విద్యుత్ వినియోగం ప్రస్తుతం అనూహ్యంగా 20 శాతం పెరిగి 20వేల మెగావాట్లకు చేరుకుందని తెలిపారు. అయినప్పటికీ అధికారులు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 24 గంటలు కష్టపడి విద్యుత్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారని కొనియాడారు.
ప్రాజెక్టులలో నీటి నిల్వలు నిల్ – తాగేందుకే ప్రాధాన్యం
రాష్ట్రంలో ప్రాజెక్టుల నీటి నిల్వలు 20 శాతం కూడా లేవని, మొత్తం 200 టీఎంసీలు కూడా లేక డెడ్ స్టోరేజీకి చేరుకున్నాయని సీఎం పేర్కొన్నారు. 30 లక్షల పంప్‌సెట్లలో 15 లక్షలు ఎండిపోయాయని, సాగునీటి కంటే తాగునీటి సమస్యే తీవ్రంగా మారనుందని తెలిపారు. ఈ పరిస్థితిని దాచిపెడితే క్యాన్సర్‌లా మారుతుందని, అందువల్లే రాబోయే 8 నుండి 10 నెలలపాటు నిజాన్ని ప్రజలకు వివరించి సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. వ్యవసాయానికి పూర్తిస్థాయి నీరు ఇవ్వడం సాధ్యపడదని, అందువల్ల రైతులు వరి సాగుకు బదులు ఆరుతడి పంటలు, కూరగాయల సాగు మాత్రమే చేపట్టేలా రైతు వేదికల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో మూగజీవాల కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి పశుగ్రాసం, తాగునీరు అందించేందుకు ఉపాధి హామీ పథకాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.
సబ్ కమిటీ ఏర్పాటు – ప్రత్యేకాధికారి నియామకం
కరువు పరిణామాలను పర్యవేక్షించేందుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సబ్ కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే ప్రతిపక్షాలు చేసే తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టి ప్రజల్లో సరైన అవగాహన కల్పించడానికి ప్రభుత్వ మాజీ కార్యదర్శి రామకృష్ణారావును ఎల్‌నినో ప్రత్యేక అధికారిగా నియమించినట్లు వెల్లడించారు. కరోనా సమయంలో బాధ్యతారాహిత్యంగా మాట్లాడి ప్రజలను కేసీఆర్ మోసం చేశారని, అలాంటి తప్పుడు మాటలు నమ్మవద్దని కోరారు. కరోనా సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హెచ్చరిస్తే వాళ్లకు మాస్కులు ఇవ్వాలని, క్రోసిన్ వేసుకోండంటూ సీఎం హోదాలో కేసీఆర్ అవహేళన చేశారన్నారు. ఆయన మాటలు నమ్మి మాస్కులు పెట్టుకోని వారు కనుమరుగయ్యారని, ఆయన మాటలు నమ్మని మనం ఈ రోజు ఇక్కడ కూర్చున్నామని అన్నారు. సోనియా గాంధీ దూరదృష్టితో తెచ్చిన ఉపాధి హామీ నాడు ప్రజలకు ఉపాధి కల్పించిందన్నారు. గతంలో ఏడు రకాల సన్న వడ్లకు బోనస్ ఇస్తామంటే విమర్శలు చేశారని, కానీ రైతులు నమ్మి పండించడంతో ఈరోజు మార్కెట్‌లో రూ.3,400 నుండి రూ.4,000 వరకు మంచి ధర లభించిందని ఉదహరించారు.
‘సర్’కు వ్యతిరేకంగా రాహుల్ పోరాటం – దిల్లీ సభకు పిలుపు
అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్‌కు భంగం కలిగిస్తూ బీజేపీ ప్రభుత్వం దురుద్దేశంతో ‘సర్’ ప్రక్రియను ఉపయోగిస్తోందని సీఎం మండిపడ్డారు. దీనిద్వారా పేదల హక్కులను కాలరాసి అధికారాన్ని శాశ్వతం చేసుకోవాలని మోదీ చూస్తున్నారని, దీనికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ పోరాడుతున్నారని తెలిపారు. ఈ క్రమంలో నవంబర్ 1న దిల్లీలో రాహుల్ గాంధీ నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు రాష్ట్రం నుంచి పదివేల నుండి 15వేల మంది తరలివెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌కు ఎన్నికలు, ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం కొత్త కాదని, ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రజాప్రతినిధులకు మార్గదర్శనం చేశారు.
తాగునీటిపై ప్రత్యేక దృష్టి సారించాలి
కేబినెట్ సబ్ కమిటీతోపాటు అన్ని స్థాయిల్లో అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేసి తాగునీటిని అందించాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా టోల్ ఫ్రీ నంబర్ ఇవ్వాలని సూచించారు. పార్టీ కార్యకర్తలు, ఎనఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ కూడా ఈ కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలన్నారు. విద్యుత్‌ను ఎంత ఖర్చు పెట్టి అయినా కొనడానికి సిద్ధంగా ఉన్నా మార్కెట్‌లో అందుబాటులో లేదని తెలిపారు. అవసరం లేకుండా విద్యుత్ వాడొద్దని ప్రజలకు సూచించారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిని పెంచుకోవాలన్నారు. కొండారెడ్డిపల్లిలో గ్రామస్తులు సోలార్ విద్యుత్‌ను అమ్మడం ద్వారా లబ్ధి పొందారని గుర్తు చేశారు. బీఆరఎస్ హయాంలో నాలుగు వేల మెగావాట్ల యాదాద్రి పవర్ ప్లాంట్‌కు రూ.8 వేల కోట్లు అదనంగా ఖర్చు అయిందని, యూనిట్ విద్యుత్ ఉత్పత్తి ఖర్చు రూ.6కు పైగా పెరిగిందని, సింగరేణిలో లభ్యం కాని జీ-9 బొగ్గుతో యాదాద్రిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తామని చెప్పారని, విదేశాల నుంచి కృష్ణపట్నం పోర్టు ద్వారా బొగ్గును దిగుమతి చేసుకుని యాదాద్రిలో విద్యుత్ ఉత్పత్తి చేయాలని చూశారని విమర్శించారు. రామగుండం, కొత్తగూడెం, మంచిర్యాల వంటి ప్రాంతాల్లో యాదాద్రిని నిర్మిస్తే రూ.28 వేల కోట్లతో 2019 నాటికి పూర్తి అయ్యేదని, ఏటా రూ.2 వేల కోట్ల బొగ్గు రవాణా భారం తగ్గేదని చెప్పారు. నైని ప్రాంతానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెళ్లి స్థానికులతో మాట్లాడి బొగ్గు తీసుకువస్తున్నామన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో మాట్లాడి మహానది కోల్‌ఫీల్డ్స్ నుంచి కూడా యాదాద్రికి బొగ్గు తీసుకొస్తున్నామని, యాదాద్రిలో ఒక్కొక్క యూనిట్‌ను పట్టాలెక్కిస్తున్నామని చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాలు అన్నీ కేసీఆర్ కుటుంబానికే పోయాయని ఆరోపించారు. బీఆరఎస్ ఖాతాల్లో రూ.1,500 కోట్లు ఉన్నాయంటూ ఎన్ని ఏళ్లు అధికారంలో ఉన్నా కాంగ్రెస్ పార్టీ నిధుల కోసం ప్రతి నెలా వెతుక్కుంటోందన్నారు. సింగరేణిలో ఒక్క టెండర్ కూడా వేయకుండా బీఆరఎస్ ప్రభుత్వం అడ్డుకుందని తెలిపారు.
రైతులకు విద్యుత్ ఇవ్వడంలో అద్భుతమైన విజయం
విద్యుత్ విషయంలో ప్రభుత్వం బాగా పనిచేసిందని, రైతులకు విద్యుత్ ఇవ్వడంలో అద్భుతమైన విజయం సాధించామని రేవంత్‌రెడ్డి చెప్పారు. మోదీ ఎన్ని పేర్లు మార్చినా అది ఎప్పటికీ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకమేనన్నారు. సంక్రాంతి తర్వాత మే వరకు నాలుగు నెల పాటు ప్రత్యేక పథకాన్ని తీసుకువస్తామని, కేంద్రం నుంచి వచ్చే నిధులతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ఈ పథకం కోసం ఖర్చు పెట్టబోతోందని తెలిపారు. ప్రతి ప్రజాప్రతినిధి గ్రామాలకు వెళ్లాల్సిందేనని, అందరి ఫోన్లలో ప్రత్యేక యాప్ పెట్టి పర్యవేక్షణ చేస్తామంటూ వ్యవసాయ పొలాలకు వెళ్లే దారులు, కాలువలు, చెరువులు, కుంటలను పునరుద్ధరించుకోవడానికి ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని సూచించారు. రైతులను ఉత్తేజపరచడానికి కళాజాతాలను సిద్ధం చేయాలన్నారు. గాంధీభవన్‌లో ఎంపీ చామల కిరణ్ నేతృత్వంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలన్నారు. హరీశ్‌రావు అసూయ, ద్వేషంతో ఏ మాటలు మాట్లాడినా పట్టించుకోవద్దు అని ప్రజలకు, పార్టీ శ్రేణులకు సూచించారు. చేతినిండా పని.. కడుపు నిండా భోజనం.. ఇదే మన కార్యాచరణ. విద్యుత్ ఇచ్చినా బోర్లలో నీళ్లు లేవు. పెట్టుబడి కూడా పోతుందన్నారు. వచ్చే వానాకాలంలో బ్రహ్మాండమైన పంటలు పండించుకోవచ్చునని చెప్పారు.
ఎమ్మెల్సీ ఎన్నికలపై అప్రమత్తంగా ఉండాలి
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై అందరూ అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సీఎం పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఎన్నికల్లో ప్రతిసారీ ఓటు హక్కును నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ నియోజకవర్గాల్లో గతంతో పోల్చితే ఇప్పటివరకు 36 శాతం ఓట్లు మాత్రమే నమోదయ్యాయి. ఇంకా 64 శాతం ఓట్లు నమోదు కావాలి. యువకులు సామా రామ్మోహన్ రెడ్డి, రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని పార్టీ ఎంపిక చేసింది. బెస్ట్ క్యాండిడేట్స్‌ను ఎంపిక చేసింది. అందరం కలిసి గెలిపించుకోవాలి అని పిలుపునిచ్చారు. బీఆరఎస్, బీజేపీ దొంగదెబ్బ తీయాలని ప్రయత్నిస్తున్నాయి. వెనుక అలాయ్ బలాయ్ చేసుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు అభ్యర్థులకు మాత్రమే సంబంధించినవి కావు.. పార్టీకి కూడా సంబంధించినవి. గెలిపించి తీరాలి.. ఎన్నికలు లేని జిల్లాలకు చెందిన నాయకులకు బాధ్యతలు అప్పగించాలి అని సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




