– సెప్టెంబర్ 17 వేదికగా పార్టీల పోటాపోటీ కార్యక్రమాలు
– కాంగ్రెస్ ‘ప్రజాపాలన దినోత్సవంస-
– బీజేపీ ‘సేవా సంకల్ప్ అభియాన్’
– బీఆర్ఎస్ ‘సమైక్యతా దినోత్సవం’
– పేరు ఏదైనా విమోచన దినోత్సవంలో రాజకీయ లబ్దే ధ్యేయం
(మండువ రవీందర్రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, వరంగల్)
హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమై నేటికి డెబ్బైఎనిమిదేండ్లు పూర్తికావస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వేడుకలను నిర్వహించకపోవడం నిజంగా శోచనీయం. దశాబ్ధాల బానిస సంకెళ్ళను తుంచి తెలంగాణ ప్రాంత ప్రజలకు స్వేచ్ఛా వాయువులను అందించిన రోజును పురస్కరించుకుని స్థానికులు సంబరాలు చేసుకోవడమే కానీ రాష్ట్రంలో అధికారానికి వచ్చిన ఏ పార్టీకూడా అధికారికంగా వేడుకలను నిర్వహించలేదు. ఈ విషయంలో గత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసిన బీ(టి)ఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ గత ప్రభుత్వాల బాటనే పట్టింది. తెలంగాణ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మరోసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ పక్షాన వేడుకలను నిర్వహించకపోవడాన్ని భారతీయ జనతా పార్టీ నిలదీస్తున్నది. వాస్తవంగా బీజేపీ అయిదేళ్ళ క్రితమే ఈ వేడుకలను నిర్వహించాలని సంకల్పించింది. దానికి 2024లో శ్రీకారం చుట్టింది. అప్పటినుండి ప్రతీ సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వం పక్షాన కార్యక్రమాలను చేపడుతున్నది. సెప్టెంబర్ 17ను ఏ పేరుతో పిలువాలన్న విషయంలో ఏడు దశాబ్దాలుగా రాజకీయ పార్టీల మద్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఒకరు విమోచన అంటే మరొకరు విలీనమని, ఇంకొకరు విద్రోహమని ఇలా ఎవరికి తోచినట్లు వారు పిలిచినప్పటికీ రాష్ట్రంలో అధికారం చేపట్టిన పార్టీలు మాత్రం దానికి ఒక రూపాన్ని ఇవ్వలేకపోయాయి. విచిత్రమేమంటే హైదరాబాద్ సంస్థానానికి చెందిన కొన్ని ప్రాంతాలు అటు కర్ణాటక, ఇటు మహారాష్ట్రలో చేరినప్పటికీ ఆయా ప్రభుత్వాలు నాటి సంస్థాన విముక్తి పోరాటాలను గౌరవించి ఆ ప్రాంతాల్లో అధికారిక వేడుకలను నిర్వహిస్తుండడం గమనార్హం. కాని తెలంగాణలో మాత్రం కేవలం తెలంగాణ సెంటిమెంట్‌ను వాడుకునేందుకు రాజకీయ పార్టీలు మాత్రం ఏదో ఒక కార్యక్రమంతో ప్రజల మద్యకు వెళ్ళేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఈ విషయంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసింది. ఇంత ప్రాధాన్యతను సంతరించుకున్న రోజున అధికారికంగా వేడుకలను నిర్వహించాలని నిర్ణయించింది. ఈమేరకు 2024లో శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. కేంద్ర మంత్రి అమిత్‌షాను స్థానిక బీజేపీ నేతలు హైదరాబాద్‌కు ఆహ్వానించారు. మూడు రోజుల తమ పార్టీ కార్యక్రమాలతోపాటు ఈ వేడుకలను ఆనాడు ఘనంగా జరిపారు. అదే క్రమంలో ఈసారికూడా హైదరాబాద్ పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ అద్వర్యంలో నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమానికి భారత ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్‌ను ఆహ్వానించారు. అయితే ఈ రోజున బీజేపీ ‘సేవా సంకల్ప్ అభియాన్’పేర కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. తెలంగాణ విమోచన దినోత్సంతోపాటే ప్రధాని నరేంద్రమోదీ ప్రజాజీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం కూడా కలిసి రావడంతో బీజేపీ కార్యక్రమాలను విస్తరించింది. ప్రధానంగా విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజులపాటు ‘సేవా సంకల్ప్ అభియాన్’ పేర రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలను ఆ పార్టీ చేపట్టనుంది. అలాగే ప్రతీ బూత్‌స్థాయిలో జాతీయ జెంఢాలను ఆవిష్కరించడం, అమర వీరులకు నివాళులర్పించడంతోపాటు పరెడ్ గ్రౌండ్‌లో కేంద్ర బలగాలతో పరేడ్, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నది. దీనితోపాటు రాష్ట్ర వ్యాప్తంగా రక్తదాన శిబిరాలను నిర్వహించనుంది. పనిలోపనిగా కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఇండ్ల వద్ద ‘ఆశీర్వాద్ కా దియా (ఆశీర్వాద దీపం)’ పేరున దీపాలను వెలిగించే కార్యక్రమాన్ని చేపట్టనుంది. అలాగే పార్టీ ప్రజలతో మమేకం కావడంలో భాగంగా స్వచ్ఛ భారత్ వ్యాసరచన పోటీలు, వివిధ సామాజిక కార్యక్రమాలను పార్టీ చేపట్టనుంది. ఇదిలాఉంటే అధికార కాంగ్రెస్ ‘తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా జాతీయ పతాకావిష్కరణ చేపట్టాలని పిలుపునిచ్చింది. ఆ రోజున ప్రజా సమస్యలపై ‘ మీ సమస్య – మా బాధ్యత’ పేర వివిధ సమస్యలపై ప్రజలనుండి ఫిర్యాదులను స్వీకరించనుంది. ఉదయం11 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు గాంధీ భవన్‌లో ఈ కార్య్కమ్రాన్ని నిర్వహించే ఏర్పాటు చేసింది. అంతేగాక సెప్టెంబర్ 17నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు పదిహేను రోజులపాటు ‘స్వచ్చతాహీ సేవ-2026’ కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపట్టాలని చింది. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎస్టీల రిజర్వేషన్లు ఆరు శాతం నుండి పది శాతం పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి నాలుగేళ్ళు పూర్తి అయిన సందర్భంగా గిరిజన సంక్షేమంపై నాటి తమ ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్ళే కార్యక్రమాన్ని ఆ రోజున నిర్వహించాలని సంకల్పించింది. దీని కొనసాగింపుగా అక్టోబర్ 30న హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ చేపట్టాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది. ‘తెలంగాణ సమైక్యతా దినోత్సవం’పేర చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా తెలంగాణ భవన్‌తోపాటు, రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ కార్యాలయాల్లో జాతీయ జెంఢాను ఎగురవేసే కార్యక్రయాన్ని చేపట్టనుంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





