వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉండదు

– దామాషా ప్రకారం సీట్లు పెంచితే డీలిమిటేషన్‌కు మద్దతు
– జిందాల్ వర్సిటీలో బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఉపన్యాసం

సోనిపట్(హర్యానా), ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16 : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో (2028) బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో ఎలాంటి పొత్తు పెట్టుకోదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. సోనిపట్ (హర్యానా)లోని ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో ఇన్నోవేషన్ ఇన్ గవర్నెన్స్: ది స్టోరీ ఆఫ్ ఎ స్టార్టప్ స్టేట్ అనే అంశంపై ఆయన బుధవారం ప్రత్యేక ఉపన్యాసం ఇచ్చారు. అనంతరం విద్యార్థులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని రాజకీయాలు, పాలన, సాంకేతికత తదితర అంశాలపై వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా అని ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు కేటీఆర్ పైవిధంగా స్పందించారు. డీలిమిటేషన్ పై మాట్లాడుతూ మొత్తం లోక్‌సభ స్థానాల సంఖ్యను దేశవ్యాప్తంగా దామాషా ప్రకారం పెంచితే డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వడంలో త‌మ‌ పార్టీకి ఎలాంటి అభ్యంతరం ఉండదని కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాలకు 24 శాతం ప్రాతినిధ్యం ఉందని తెలిపారు. కృత్రిమ మేధస్సు(ఏఐ), సాంకేతిక మార్పులపై ప్రశ్నకు సమాధానమిస్తూ ప్రతి పెద్ద సాంకేతిక పరివర్తన సమయంలోనూ ఆందోళనలు వ్యక్తమయ్యాయని కేటీఆర్ అన్నారు. ప్రతి సాంకేతిక మార్పును ప్రశ్నించారు.. ఏఐ విషయంలోనూ అదే జరుగుతోంది. మనం దాన్ని స్వీకరించి ముందుకు సాగాలి అని సూచించారు. నిర్దిష్టత, అవకాశాలు అనే రెండు కాన్సెప్ట్‌ల ద్వారా తెలంగాణ అభివృద్ధి నమూనాను ఆయన వివరించారు. మౌలిక వసతులు, విశ్వసనీయమైన ప్రజా సేవల ద్వారా ప్రభుత్వం ప్రజలకు ఒక నిర్దిష్టమైన వాతావరణం కల్పించడంతోపాటు ఇన్నోవేషన్, వ్యవస్థాపకతను ప్రోత్సహిస్తూ ఒక ఇకోసిస్టమ్‌ను సృష్టించి, కొత్త అవకాశాలకు అనుకూలమైన వాతావరణాన్ని కూడా నిర్మించాలని అన్నారు. ఈ సందర్భంగా సాగునీరు, వ్యవసాయం, తాగునీరు, విద్యుత్ రంగాల్లో తెలంగాణ చేపట్టిన వివిధ కార్యక్రమాల గురించి కేటీఆర్ వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రస్తావిస్తూ కరవు ప్రభావిత తెలంగాణ ప్రాంతాలకు గోదావరి జలాలను ఎలా తరలించాలనే చారిత్రక సవాలుకు ఇంజినీరింగ్ పరిష్కారం ఈ ప్రాజెక్టు అని అభివర్ణించారు. తెలంగాణలో  ధాన్యం(వరి) ఉత్పత్తి 2014-15లో సుమారు 44.4 లక్షల టన్నులు ఉంటే 2023-24లో అది 168.8 లక్షల టన్నులకు పెరిగిందని కేటీఆర్ తెలిపారు. ఇన్నోవేషన్ ఇకోసిస్టం గురించి మాట్లాడుతూ టీ-హబ్, వీ-హబ్, టీ-వర్క్స్, టాస్క్ వంటి సంస్థల పాత్రను వివరించారు. వ్యవస్థాపకతను ప్రోత్సహించడం, మహిళలకు అవకాశాలు కల్పించడం, నమూనా రూపకల్పన, హార్డ్‌వేర్ ఇన్నోవేషన్‌ను ప్రోత్సహించడం, యువతను పరిశ్రమలతో అనుసంధానం చేయడంలో వీటి పాత్రను వివరించారు. ఇంక్యుబేషన్, నమూనా రూపకల్పన నుంచి మార్కెట్‌కు సిద్ధమైన సంస్థగా ఎదిగిన స్కైరూట్‌ను తెలంగాణ ఇన్నోవేషన్ వ్యవస్థకు ఉదాహరణగా కేటీఆర్ ప్రస్తావించారు. పరిమితులను సమస్యలుగా చూడకుండా నిరంతరం నేర్చుకోవడం, మెరుగుపడటం, వాటిని అమలు చేయడంపై దృష్టి పెట్టాలని విద్యార్థులకు సూచించారు. ముఖాముఖిలో రాజకీయాలు, ప్రజా విధానాలు, డీలిమిటేషన్, కృత్రిమ మేధస్సు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై విద్యార్థులు పలు ప్రశ్నలు అడిగారు.. వాటికి కేటీఆర్ ఇచ్చిన సమాధానాలకు ప్రశంసలు వెల్లువెత్తాయి. తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని వివరించే అవకాశం కల్పించినందుకు ఓ.పీ. జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీకి, విద్యార్థులు, అధ్యాపకులతో ముచ్చటించే అవకాశం కల్పించినందుకు యూనివర్సిటీ యాజమాన్యానికి, వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ సి.రాజ్ కుమార్‌కు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *