– టీటీఏ మెగా కన్వెన్షన్‌లో పంచాయతీరాజ్ మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 20 : ప్రపంచంలో తెలంగాణ వారు ఎక్కడ ఉన్నా తమ ప్రాంత మూలాలను, తెలుగు భాషను, సంస్కృతిని గర్వంగా నిలబెట్టుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క పిలుపునిచ్చారు. అమెరికాలో నిర్వహించిన తెలుగు అమెరికా తెలంగాణ అసోసియేషన్(టీటీఏ) మెగా కన్వెన్షన్‌లో ఆమె ప్రవాస తెలంగాణవారిని ఉద్దేశించి ప్రసంగించారు. స్థానిక మÖలాలను మరువకుండా ప్రపంచస్థాయి విజయాలను అందుకోవడమే నిజమైన ప్రగతి అని పేర్కొన్నారు. అమెరికాలోని తెలంగాణ కుటుంబాలు ఐక్యంగా ఉండి భావితరాలకు తెలంగాణ చరిత్ర, సంప్రదాయాలను పరిచయం చేయాలని మంత్రి సూచించారు. ప్రవాస భారతీయులు అక్కడ నేర్చుకున్న సాంకేతికత, నిర్వహణ, పని సంస్కృతి, ఆవిష్కరణలను తెలంగాణ అభివృద్ధికి ఉపయోగించాలని కోరారు. ఒక విద్యార్థికి మార్గదర్శకత్వం, ఒక ప్రభుత్వ పాఠశాలకు చేయూత, ఒక మహిళా సంఘానికి మార్కెట్ అవకాశాలు, ఒక రైతుకు కొత్త సాంకేతికతను పరిచయం చేయడం వంటి సామాజిక బాధ్యతలను స్వీకరించాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. స్వయం సహాయక సంఘాలను ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దుతూ మహిళలకు ఉపాధి, వ్యాపార అవకాశాలను విస్తృతంగా కల్పిస్తున్నట్లు చెప్పారు. మహిళల అభివృద్ధికి ప్రవాస తెలంగాణవారు కూడా భాగస్వాములు కావాలని, వారి సహకారంతో గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక ఆస్తుల సృష్టికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండూ అభివృద్ధి పథంలో కలిసి ముందుకు సాగాలని, ప్రపంచవ్యాప్తంగా తెలుగు కీర్తిని మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. ఆదివాసి సంప్రదాయం ప్రకారం వనదేవతలైన సమ్మక్క-సారలమ్మ తల్లుల గద్దెల ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొని మంత్రి సీతక్క ప్రత్యేక పూజలు చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





