కృత్రిమ పనీర్‌ ‌బంద్‌

-ఏ డాదిపాటు అనలాగ్‌ ‌పనీర్‌పై నిషేధం
– ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ

హైదారాబాద్‌,‌ ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11: ‌హోటళ్లు, దాబాలు, రోడ్డు పక్కన ఫాస్ట్‌ఫుడ్‌ ‌సెంటర్లలో పనీర్‌ ‌బట్టర్‌ ‌మసాలా, పన్నీర్‌ ‌టిక్కా అంటూ లొట్టలేసుకుని లాగించే భోజనప్రియలకు ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. మార్కెట్లో విచ్చలవిడిగా లభిస్తున్న కృత్రిమ, నాన్‌-‌డెయిరీ అనలాగ్‌  పనీర్‌ ‌దందాపై ప్రభుత్వం ఎట్టకేలకు ఉక్కుపాదం మోపింది. ప్రజారోగ్యాన్ని తీవ్రంగా ప్రమాదంలో పడేస్తున్న ఈ కృత్రిమ పనీర్‌ ‌తయారీ, నిల్వ, రవాణా, విక్రయాలపై రాష్ట్రవ్యాప్తంగా ఏడాది పాటు పూర్తి నిషేధం విధిస్తూ రాష్ట్ర ఆహార భద్రతా శాఖ కమిషనర్‌ ‌గురువారం  అధికారిక గెజిట్‌ ‌నోటిఫికేషన్‌ ‌విడుదల చేశారు. ఫుడ్‌ ‌సేఫ్టీ అండ్‌ ‌స్టాండర్డస్ ‌యాక్ట్-2006 లోని సెక్షన్‌ 30(2)(ఎ) ‌కింద ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. అసలైన పనీర్‌ను ఆవు లేదా గేదె పాలతో తయారు చేస్తారు. అయితే కొందరు కల్తీరాయుళ్లు అధిక లాభాల కోసం చుక్క పాలు కూడా వాడకుండా పామాయిల్‌, ‌చౌకైన వెజిటబుల్‌ ‌ఫ్యాట్స్,  ‌పిండి పదార్థాలు, రసాయనాలు కలిపి అచ్చం పనీర్‌లా ఉండే అనలాగ్‌ ‌పనీర్‌ ‌ను తయారు చేస్తున్నారు. చూడటానికి, రుచికి ఇది అసలు పన్నీర్‌లాగే ఉండటంతో సామాన్య ప్రజలు తేడాను గుర్తించలేకపోతున్నారు. మార్కెట్లో అసలు పన్నీర్‌ ‌ధరకు సగానికే ఇది లభిస్తుండటంతో హోటళ్లు, బేకరీలు, రోడ్‌ ‌సైడ్‌ ‌ఫుడ్‌ ‌సెంటర్లు వీటిని విచ్చలవిడిగా కొనుగోలు చేస్తున్నాయి. దీని వాడకంతో తీవ్రమైన ఆరోగ్య ముప్పు దాగి ఉందని ఆహార భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరంలో కొలెస్ట్రాల్‌ ‌విపరీతంగా పెరిగిపోయి గుండె జబ్బులు, కాలేయ సమస్యలు, జీర్ణకోశ వ్యాధులు తలెత్తుతాయి. దీర్ఘకాలంలో ఇది క్యాన్సర్‌ ‌వంటి ప్రాణాంతక వ్యాధులకు కూడా దారితీసే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు ఆహార భద్రతా టాస్క్‌ఫోర్స్ ‌బృందాలు క్షేత్రస్థాయిలో విస్తృత తనిఖీలకు దిగనున్నాయి. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి అనలాగ్‌ ‌పన్నీర్‌ను తయారు చేసినా, హోటళ్లకు సరఫరా చేసినా లేదా విక్రయించినా బాధ్యులపై ఆహార భద్రతా చట్టం కింద కఠినమైన క్రిమినల్‌ ‌కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని కమిషనర్‌ ‌తీవ్ర హెచ్చరిక చేశారు. తాము వాడుతున్న పనీర్‌ ‌నాణ్యతను నిరూపించుకోవాల్సిన బాధ్యత హోటళ్లు,  రెస్టారెంట్లపైనే ఉంటుందన్నారు. రసాయనాలతో పన్నీర్‌ ‌తయారు చేసే ముఠాల సమాచారం సేకరిస్తూ శాంపిళ్లను ల్యాబ్‌లకు పంపుతున్నారు. అనుమానాస్పద ఫుడ్‌ ‌సెంటర్లపై ఆహార భద్రతా శాఖకు టోల్‌ ‌ఫ్రీ నంబర్‌ ‌లేదా ఆన్‌లైన్‌ ‌ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *