ట్రాక్టర్లపై అసెంబ్లీకి వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యేలు

హైదారాబాద్‌, ‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 11: ‌రాష్ట్రంలోని రైతాంగాన్ని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన్‌ ‌మంత్రి ఫసల్‌ ‌బీమా యోజనను రాష్ట్రంలో వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ ‌చేస్తూ బీజేపీ శాసనసభాపక్షం నిరసన వ్యక్తం చేసింది. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ ‌నుంచి అసెంబ్లీ వరకు బీజేపీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు ట్రాక్టర్లతో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. రైతుల పంట నష్టపరిహారం, ఇన్సూరెన్స్ ‌విధానంపై రాష్ట్ర కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును ఎండగడుతూ ఈ వినూత్న నిరసనకు శ్రీకారం చుట్టారు. ఈ ర్యాలీకి బీజేపీ శాసనసభా పక్ష నేతలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు నేతృత్వం వహించారు. శాసనసభ సమావేశాలు జరుగుతున్న వేళ, రైతుల సమస్యలను సభ దృష్టికి, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఎమ్మెల్యే క్వార్టర్స్ ‌బయట ట్రాక్టర్లపై ఎక్కి నినాదాలు చేస్తూ అసెంబ్లీ వైపు దూసుకెళ్లారు. రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వీడాలని, ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయిన ప్రతీ రైతుకు ఫసల్‌ ‌బీమా యోజన ద్వారా వెంటనే నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. బీజేపీ ఎమ్మెల్యేల ట్రాక్టర్లను అసెంబ్లీ పరిసరాల్లో పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా బీజేపీ నేతలు పొరుగు రాష్ట్రాలు ఫసల్‌ ‌బీమా యోజనను సమర్థవంతంగా అమలు చేస్తూ రైతులను ఆదుకుంటుంటే తెలంగాణలో మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్ర పథకాన్ని పక్కనబెడుతున్నారని మండిపడ్డారు. ఇన్సూరెన్స్ ‌ప్రీమియం చెల్లించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఏటా వేలాదిమంది రైతులు పంటలు నష్టపోయి ఆర్థికంగా చితికిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే రైతులకు రూ.500 బోనస్‌, ‌పంటల భరోసా ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం, అధికారంలోకి వచ్చాక ఆ హామీలను గాలికొదిలేసిందని విమర్శించారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, ఫసల్‌ ‌బీమా యోజనలో రాష్ట్ర వాటాను చెల్లించి తక్షణమే ప్రీమియం నోటిఫికేషన్‌ ‌విడుదల చేయాలని డిమాండ్‌ ‌చేశారు. రైతుల పంట నష్టపరిహారాన్ని నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేయాలని, లేకపోతే రైతులతో కలిసి రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. రైతుల హక్కుల కోసం బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని నాయకులు స్పష్టం చేశారు. ఫసల్‌ ‌బీమా యోజన అమలే కాక రైతు రుణమాఫీ అరకొరగా అమలు చేయడంపై, రైతుబంధు జమ కాలేదనే అంశాలపై సభలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. ట్రాక్టర్ల ర్యాలీతో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్‌ ‌జామ్‌ ఏర్పడగా పోలీసులు నిరసనకారులను సర్దిచెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *