– రాష్ట్రంలో 1.06 కోట్ల రేషన్ కార్డులు
– మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి
– 27, 28 లలో హుజూర్‌నగర్, మిర్యాలగూడ, సూర్యాపేటలో మంత్రి పర్యటన
సూర్యాపేట, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 25: : పదేళ్లపాటు అధికారంలో ఉన్న గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా మంజూరు చేయకుండా పేద, మధ్యతరగతి కుటుంబాలను ఇబ్బందులకు గురిచేసిందని నీటిపారుదల, ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఆరోపించారు. కొత్త కుటుంబాలు ఏర్పడినా, కుటుంబ సభ్యుల సంఖ్య పెరిగినా, అర్హులు దరఖాస్తు చేసుకున్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన అనంతరం ఆహార భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి తెలిపారు. 2025 జనవరి 1 నాటికి రాష్ట్రంలో 89,95,282 రేషన్ కార్డులు ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 16,32,810 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశామని చెప్పారు. వీటి ద్వారా మరో 61,09,544 మందికి ఆహార భద్రత కల్పించామన్నారు. పాత, కొత్త కార్డులు కలిపి ప్రస్తుతం రాష్ట్రంలో 1,06,28,092 ఉండగా 3,42,57,109 మంది ప్రయోజనం పొందుతున్నారని వివరించారు. ప్రతి అర్హత కలిగిన కుటుంబానికీ రేషన్ కార్డు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రేషన్ కార్డు బియ్యం పొందే పత్రం మాత్రమే కాదని, పేద కుటుంబాలకు ఆహార భద్రతతోపాటు వివిధ సంక్షేమ పథకాలకు కీలక ఆధారమని పేర్కొన్నారు. రేషన్ కార్డుదారులందరికీ ప్రతి వ్యక్తికి నెలకు ఆరు కిలోల చొప్పున నాణ్యమైన సన్న బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నెలా సుమారు 2.16 లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నామని చెప్పారు. కాగా, తన సొంత నియోజకవర్గమైన హుజూర్‌నగర్‌తోపాటు మిర్యాలగూడ నియోజకవర్గంలో మంత్రి రెండు రోజులు పర్యటించనున్నారు. నేరేడుచర్లలో పాలకీడు, నేరేడుచర్ల, గరిడేపల్లి మండలాలకు సంబంధించిన లబ్ధిదారులకు మంత్రి ఉత్తమ్ రేషన్ కార్డులు సోమవారం పంపిణీ చేస్తారు. అనంతరం ముసిఒడ్డు సింగారం-రోళ్లవారిగూడెం బీటీ రోడ్డును ప్రారంభిస్తారు. హుజూర్‌నగర్‌లో రేషన్ కార్డులు, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేయనున్నారు. మేళ్లచెరువు మండలం కందిబండలో రూ.2.80 కోట్లతో నిర్మించిన వంతెన, కప్పలకుంట తండా, వెల్లటూరు ఆర్‌అండ్‌ఆర్ కాలనీ, వేపల మాధవరం గ్రామాల్లో నిర్మించిన వివిధ భవనాలను ప్రారంభిస్తారు. మేళ్లచెరువులో నాగార్జునసాగర్ ప్రాజెక్టు కాలువపై రూ.3 కోట్లతో నిర్మించిన మూడు వంతెనలను ప్రారంభించి మేళ్లచెరువు, చింతలపాలెం మండలాల లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేస్తారు. 28న గరిడేపల్లి మండలం కొండాయిగూడెం, రెగ్యులగడ్డ తండాల్లో నిర్మించిన మహిళా స్వయం సహాయక సంఘాలు, గ్రామ పంచాయతీ భవనాలను ప్రారంభిస్తారు. అనంతరం మిర్యాలగూడ పట్టణంలో రేషన్ కార్డులు పంపిణీ చేస్తారు. ఈ రెండు రోజుల పర్యటనలో మొత్తం రూ.8.90 కోట్ల విలువైన రహదారులు, వంతెనలు, గ్రామ పంచాయతీ, విలేజ్ ఆర్గనైజేషన్, స్వయం సహాయక సంఘాల భవనాలను మంత్రి ప్రారంభించనున్నారు.
మిర్యాలగూడ కార్యక్రమం అనంతరం మంత్రి సూర్యాపేటకు చేరుకుని భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వ్యవహార శైలికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించే నిరసన కార్యక్రమంలో పాల్గొంటారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం ఉండాలంటే ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రజల ఓటు హక్కును, ఎన్నికల ప్రక్రియ పవిత్రతను కాపాడటం ప్రతి ప్రజాస్వామ్యవాది బాధ్యత అని పేర్కొన్నారు. రాజ్యాంగ సంస్థలు ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





