పథకాల అమలులో వెనక్కి తగ్గేది లేదు

-మధిర అభివృద్ధికి భట్టి విక్రమార్క నిరంతర కృషి 
– ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్ చార్జి మంత్రి వాకిటి 
– మధిర పట్టణంలో చేయూత పింఛన్ల పంపిణీ

ఖమ్మం, ప్రజాతంత్ర, నవంబర్ 18: పేద, బలహీనవర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పశు సంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో నిర్వహించిన చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు. గతంలో నియోజకవర్గంలో 37,477 పింఛన్లు ఉండగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కొత్తగా 5,317 పింఛన్లు మంజూరు చేయడంతో మొత్తం 42,794కు చేరిందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సవాలుగా ఉన్నప్పటికీ పేదలకు అందించే సంక్షేమ పథకాల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాజీపడటం లేదని, వెనక్కి తగ్గేది లేదని అన్నారు. రాష్ట్రంలో కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే మహత్తర లక్ష్యంతో ప్రభుత్వం ముందు కు సాగుతోందని మంత్రి తెలిపారు. మహిళల చేతుల్లో ఆర్థిక వనరులు ఉంటే కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని, పిల్లల చదువులు, ఆరోగ్యం, కుటుంబ అవసరాలకు ప్రాధాన్యత లభిస్తుందని అన్నారు.

మక్తల్ నుంచి మధిరకు ప్రత్యేక అనుబంధం

కృష్ణానది కర్ణాటక నుంచి తెలంగాణాలోకి ప్రవేశించే ప్రాంతంలో తన మక్తల్ నియోజకవర్గం ఉందని, అదే కృష్ణానది మధిర ప్రాంతం మీదుగా ఆంధ్రప్రదేశ్ వైపు ప్రవహిస్తుందని మంత్రి శ్రీహరి గుర్తు చేశారు. కృష్ణా నది ద్వారా మక్తల్, మధిర ప్రాంతాలకు ప్రత్యేక అనుబంధం ఉందని, అదేవిధంగా తనకు భట్టి విక్రమార్కతో ఆత్మీయ అనుబంధం ఉందని అన్నారు. మక్తల్ నుంచి ప్రత్యేకంగా మధిరకు వచ్చి చేయూత పింఛన్ల
పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తనకు మంత్రి పదవి ద్వారా లభించిన అవకాశాన్ని ప్రజా సేవకు అంకితం చేస్తానని, ఐదు శాఖల బాధ్య తలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపా రు. మధిర నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళలు, పింఛన్ లబ్దిదారుల కు మంత్రి వాకిటి శ్రీహరి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు నిరంతరం కృషి చేస్తున్నారని మంత్రి ప్రశంసించారు. రాష్ట్రమంతా పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను తెలుసుకున్న ఆయ‌న‌కు మధిర ప్రజలు అండగా నిలిచి భారీ మెజార్టీతో గెలిపించారని గుర్తు చేశారు. భట్టి రాష్ట్ర ఆర్థిక మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న నేపథ్యంలో మధిర నియోజకవర్గంలోని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఒక భట్టి విక్రమార్కలా పనిచేయాలని పిలుపు నిచ్చారు. ప్రతి గ్రామంలో పేదల సమస్యలను తెలుసుకొని ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడాలని సూచించారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్- 2026 లోగో, మస్కట్, బ్రోచర్ లను మంత్రి ఆవిష్కరించి డిసెంబర్ 11 నుంచి 22 వరకు తెలంగాణలో జరగనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ పై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర టిఎస్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీజ, ఇంచార్జ్ డీఆర్డీవో శిరీష, జిల్లా పశు సంవర్ధక అధికారి డా. పురందర, జిల్లా మత్స్య శాఖ అధికారి మల్లేశం, జిల్లా క్రీడల అధికారి టి.సునీల్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ సాధినేని సుజాత, మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నర్సింహా రావు, మత్కేపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ సామ్యూల్ పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *