వానలు పడేట్లులేవు.. కుదేలవుతున్న రైతాంగం

వానాకాలంలో ఎండలు కాస్తున్నాయి. ప్రాజెక్టుల్లో నీళ్ళు అడుగంటాయి. వేసిన పంటలు ఎండిపోతున్నాయి. దిక్కుతోచని స్థితిలో ఆకాశంవైపు చూస్తూ దిగాలుపడుతున్న ప్రజలు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి పరిస్థితి ఇది. నైరుతి రుతుపవనాల ప్రభావం ఆశించిన స్థాయిలో లేకపోవడం, లెనినో ప్రభావం కారణంగా వర్షాభావ పరిస్థితి నెలకొందని శాస్త్రవేత్తలు చెబుతున్న తీరు చూస్తే వర్షాలపైన ఆశవదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జూన్‌లో తొలకరి జల్లులు కాస్తా మురిపించినా, జూలైలో నేటివరకు మబ్బులు ముఖం చాటేశాయి. పైగా ఎండకాలాన్ని తలపిస్తున్న రీతిలో కాస్తున్న ఎండల కారణంగా 30 నుంచి 40 డిగ్రీల వరకు ఊష్ణోగ్రత నామోద అవుతున్నది. బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం ఏర్పడితే తప్ప వాతావరణంలో పెద్దగా మార్పు జరిగే అవకాశాలు లేవు. ఈ పరిస్తితి ఇలానే మరో వారం రోజులు కొనసాగితే ఇక వర్షాలపై ఆశ వదులుకోవాల్సిందే నంటున్నారు శాస్త్రవేత్తలు.

వాస్తవానికి దేశవ్యాప్తంగా వర్షపాతం ఇప్పటికే సగటుకన్నా తక్కువ నామోదవుతున్నది. జూలై 18వరకు ఇదే పరిస్థితి ఉంటుందంటున్నారు వాతావరణ నిపుణులు. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సాగునీరుతోపాటు, తాగునీటికి కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని కాళేశ్వరం నీటిని ప్రాజెక్టులకు తరలించాలని విపక్షాలతో పాటు రైతులు, ప్రజలు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారు. ప్రభుత్వం కూడా చాలా ఆలస్యంగా దీనిపై స్పందిస్తున్నది. ఒక విధంగా తమ ఒత్తిడితోనే రాష్ట్ర ప్రభుత్వం కదిలిందని బిఆర్‌ఎస్‌ ‌చెప్పుకుంటున్నది. దానిపై తాజాగా మంత్రులు ప్రాజెక్టుబాట పట్టడం ప్రజలకు కొంతవరకు ఉపషమనాన్ని కలిగించే అంశం.

దేవాదుల ప్రాజెక్టు పరిధిలోని సుమారు 22 ప్రాజెక్టులను నీటితో నింపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తాజాగా ఆ ప్రాజెక్టును సందర్శించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. రాబోయే రెండు ఏళ్ళలో ఈ ప్రాజెక్టు పెండింగ్‌ ‌పనులను పూర్తి చేసి ఆరు లక్షల ఎకరాలకు నీరు అందిస్తామని ఈ సందర్భంగా భట్టి చెప్పారు. గోదావరి నీటిని గరిష్టస్థాయిలో వినియోగించు కోవడానికి ఖర్చుకు ఏమాత్రం వెనుకాడమన్న భట్టి, ప్రాజెక్టుల్లోని పది పంపుల్లో ఏడు మాత్రమే ప్రస్తుతం పనిచేస్తున్నాయని, మరో రెండు రోజుల్లో మిగతా పంపులను మరమ్మతు చేసి మోటర్లును వినియోగించనున్నట్లు పేర్కొన్నారు. ఈ పనులకు సంబంధించి పెండింగ్‌ ‌బిల్లుల చెల్లింపులకుగాను 194 కోట్లు విడుదల చేస్తున్నట్లు చెప్పారు.

వాస్తవానికి తెలంగాణలో అనేక ప్రాజెక్టులు అసంపూర్తిగానే ఉన్నాయి. నిధులు లేక కొన్ని, స్థల సేకరణలో ఆలస్యం వల్ల కొన్ని, కేంద్ర సంస్థల అనుమతులకోసం మరికొన్ని ప్రాజెక్టులు నిరీక్షిస్తున్నాయి. వీటన్నిటిలో అత్యంత ప్రధానమైనది దేవాదుల. ఈ ప్రాజెక్టు 38.16 టిఎంసీల సామర్ధానికి డిజైన్‌ ‌చేయబడింది. ఇది పూర్తి స్థాయిలో పూర్తి అయితే ఉత్తర, దక్షిణ తెలంగాణలోని 5.57 లక్షల ఎకరాలకు నీరందిస్తుంది. వరంగల్‌, ‌జనగామ, యాదగిరి బోనగిరి, సూర్యాపేట, సిద్ధిపేట, మహబూబాబాద్‌, ‌ములుగు, జయశంకర్‌ ‌భూపాలపల్లి, కరీంనగర్‌ ‌ప్రాంతాలు సశ్యశ్యామలమవుతాయి. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి 87శాతం పనులు తామే పూర్తి చేశామని మిగతా పనులకు రెండేళ్ళ సమయం వృధా చేసారంటున్నది బిఆర్‌ఎస్‌. ఇప్పటికైన యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆ పార్టీ డిమాండ్‌ ‌చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *