పార్ల‌మెంట్ ముందుకు రానున్న‌ 130వ రాజ్యాంగ స‌వ‌ర‌ణ బిల్లు!!

బీజేపీ ఎంపీ అపరాజిత సారంగి నేతృత్వంలోని  పార్లమెంటరీ సంయుక్త కమిటీ (జేపీసీ) కమిటీ, జూలై 17న సమావేశమై  130వ రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించి ముసాయిదా నివేదికను అధికారికంగా ఖరారు చేసిన త‌ర్వాత అదేరోజు లోక్‌స‌భ స్పీక‌ర్‌కు స‌మ‌ర్పించ‌నుంది. కమిటీ సిద్ధం చేసిన కొన్ని సిఫార్సులపై అసంతృప్తిగా ఉన్న కమిటీ సభ్యులు అసదుద్దీన్ ఒవైసీ, సుప్రియా సూలే వంటి ప్రతిపక్ష నేతలు తమ అభ్యంతరాలతో కూడిన ప్రత్యేక ‘డిసెంట్ నోట్’ను కూడా నివేదికతో పాటు సమర్పించనున్నారు. నిజానికి ఈ బిల్లును  కేంద్ర ప్రభుత్వం మొదటిసారిగా 2025 ఆగస్ట్  20న పార్లమెంటు (లోక్‌సభ) వర్షాకాల సమావేశాల్లో అధికారికంగా ప్రవేశపెట్టింది. ఈ కొత్త నిబంధనల‌ను అమలు చేయడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 75, 164 మరియు 239ఎఎ లకు సవరణలు ప్రతిపాదించారు. రాజకీయాల్లో అవినీతిని అరికట్టడం, మచ్చలేని నిష్కళంకమైన పాలనను అందించడం, ప్రజాప్రతినిధులలో నైతిక జవాబుదారీతనాన్ని పెంచడం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశమని ప్రభుత్వం పేర్కొంది. కానీ ప్రతిపక్షాల నుండి తీవ్ర నిరసనలు, ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమనే ఆరోపణలు రావడంతో, దీనిని మరింత లోతుగా పరిశీలించడానికి ఉభయ సభల సభ్యులతో కూడిన ఉమ్మడి పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) కి పంపారు. ఇప్పుడు ముసాయిదా సిద్ధ‌మైంది క‌నుక  ఈనెల 20నుండి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల  ప్రారంభంలోనే ఈ నివేదికను ఉభయ సభల ముందుంచనున్నారు.
కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ మరియు తెలంగాణ ప్రభుత్వం వంటి పలు ప్రతిపక్షాలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తూ పార్లమెంటరీ సంయుక్త కమిటీ (జేపీసీ) ముందు తమ అభ్యంతరాలను వ్యక్తం చేశాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలను (ఈడీ, సీబీఐ వంటివి) వాడుకుని ప్రతిపక్ష ముఖ్యమంత్రులు, మంత్రులపై తప్పుడు కేసులు పెట్టి, వారిని 30 రోజుల పాటు జైల్లో ఉంచి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను పడగొట్టేందుకు ఈ బిల్లును ఆయుధంగా వాడుకునే ప్రమాదం ఉందని ఆరోపించాయి. న్యాయశాస్త్రం ప్రకారం కోర్టులో నేరం నిరూపిత‌మ‌య్యేవరకు ఎవరైనా “నిర్దోషి”గానే పరిగణించబడతారు. కానీ ఈ బిల్లు ద్వారా కేవలం ఆరోపణలు, అరెస్టుల ఆధారంగానే (దోషిగా తేలకముందే) పదవి నుంచి తొలగించడం చట్టవిరుద్ధమని వాదిస్తున్నాయి.
ఈ బిల్లు రాష్ట్రాల సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తుందని, ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరచడానికి కేంద్రానికి విపరీతమైన అధికారాలు కట్టబెడుతుందంటూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కేవలం అరెస్టు, రిమాండ్ ఆధారంగానే ప్రజాప్రతినిధిని తొలగించే అధికారం రావడం వల్ల, పరోక్షంగా దర్యాప్తు సంస్థలు మరియు బ్యూరోక్రసీ (అధికార యంత్రాంగం) ప్రజాస్వామ్య వ్యవస్థలను శాసించే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాదు ఇది ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 నిబంధనలకు విరుద్ధంగా ఉందని, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కాలరాస్తోందని ప్రతిపక్ష నేతలు పార్లమెంట్లో గ‌ట్టిగా వాదించారు.
ఒక ముఖ్యమంత్రి లేదా మంత్రి తీవ్రమైన అవినీతి లేదా నేరపూరిత‌ కేసుల్లో ఇరుక్కుని నెలల తరబడి జైల్లో ఉన్నా, రాజీనామా చేయకుండా జైలు నుంచే ఫైళ్లపై సంతకాలు చేయడం వంటి ఉదంతాలను అడ్డుకోవడానికి ఇది ఉపయోగపడుతుంద‌ని ప్ర‌భుత్వం పేర్కొంటున్న‌ది. గ‌తంలో ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ ఒక  కేసుకు సంబంధించి  జైలుకు వెళ్ల‌గా, అక్క‌డినుంచే విధులు నిర్వ‌ర్తించిన సంగ‌తి ఈ సంద‌ర్భంగా ప్ర‌స్థావ‌నార్హం.  ప్రభుత్వ ఉద్యోగులు 48 గంటలు జైల్లో ఉంటే సస్పెండ్ అవుతారు. మరి కోట్ల మందిని శాసించే నాయకులు 30 రోజులు జైల్లో ఉన్నా పదవుల్లో కొనసాగడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న నైతిక పాలనకు దారితీస్తుంది. తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న వారిని కీలక నిర్ణయాత్మక పదవుల నుండి దూరంగా ఉంచడం ద్వారా వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుందనేది ప్ర‌భుత్వ వాద‌న‌.
గతంలో బిల్లులో ప్రతిపాదించిన శాశ్వత ‘తొలగింపు’  స్థానంలో, 30 రోజుల కస్టడీ దాటితే కేవలం ‘తాత్కాలిక సస్పెన్షన్’ విధించాలని జేపీసీ సిఫార్సు చేసింది. ఒకవేళ సదరు నాయకుడు కోర్టు ద్వారా నిర్దోషిగా విడుదలైనా లేదా కేసు వీగిపోయినా, తిరిగి అదే పదవిని చేపట్టేలా సన్‌సెట్ క్లాజ్ చేర్చారు. ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష పడే తీవ్రమైన నేరాల విషయంలోనే ఈ నిబంధన వర్తిస్తుంది. ఈ తరహా కేసులను వేగంగా విచారించడానికి ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని ప్యానెల్ సూచించింది. పీఎంఎల్‌ఏ , యూఏపీఏ  వంటి కఠిన చట్టాల ద్వారా ప్రతిపక్ష ముఖ్యమంత్రులను, మంత్రులను 30 రోజుల పాటు బెయిల్ రాకుండా జైల్లో ఉంచి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను పడగొట్టేందుకు కేంద్రం దీనిని ఆయుధంగా వాడుకునే ప్రమాదం ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కోర్టులో నేరం నిరూపితం కాకముందే, కేవలం అరెస్ట్ ప్రాతిపదికన చర్యలు తీసుకోవడం “నేరం నిరూపితమయ్యే వరకు నిరపరాధి” అనే ప్రాథమిక న్యాయ సూత్రానికి విరుద్ధం. రాష్ట్రాల మంత్రులను, ముఖ్యమంత్రులను నియంత్రించే అధికారం గవర్నర్లకు లేదా కేంద్ర దర్యాప్తు సంస్థల అరెస్టులకు కట్టబెట్టడం ద్వారా సమాఖ్య వ్యవస్థ దెబ్బతింటుందని ప్రతిపక్షాల వాదన. అందువ‌ల్ల  జేపీసీ కొన్ని కీలక మార్పులతో (సస్పెన్షన్ క్లాజ్, సన్‌సెట్ క్లాజ్) స‌భ‌కు స‌మ‌ర్పించ‌బోయే ఈ నివేదిక‌ను ప్రజాస్వామ్య విరుద్ధమైనదిగా పేర్కొంటూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
రాజకీయాల్లో అవినీతిని అంతం చేయడం, జైలు నుండి పాలన సాగించే సంస్కృతిని అడ్డుకోవడం అనే ప్రభుత్వ లక్ష్యం మంచిదే కావచ్చు. కానీ, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం జరుగుతోందని ఆరోపణలు వస్తున్న తరుణంలో, ఈ బిల్లు మరింత రాజకీయ అస్థిరతకు కారణం కాకూడదు. జేపీసీ చేసిన మార్పులు కొంత ఉపశమనం కలిగించినప్పటికీ, ప్రతిపక్షాల ఆందోళనలను పూర్తిగా పరిగణలోకి తీసుకోక  పోవడం గమనార్హం  .రాజ్యాంగ సవరణకు పార్లమెంటు ఉభయ సభల్లోనూ మూడింట రెండు వంతుల (2/3 వంతు) మెజారిటీ అవసరం. ఎన్డీయే కూటమికి ఆ సంఖ్యాబలం లేనందున, ప్రతిపక్షాలను ఒప్పించకుండా ఈ బిల్లును ఆమోదింపజేసుకోవడం కేంద్రానికి కత్తిమీద సామే అవుతుంది. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యంలో ఏకపక్ష చట్టాల కంటే, సంప్రదింపుల ద్వారా వచ్చే ఏకాభిప్రాయమే శాశ్వతమైనది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *