– ఆయన రాజ్యాంగబద్ధ ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్నారు
– ఆయనను సమ్మిట్‌కు ఆహ్వానిస్తే బీజేపీ నాయకులకు అక్కసు
– మీడియాతో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 13 : రాహుల్ గాంధీకి ప్రత్యేకంగా ప్రచారం కల్పించనవసరం లేదు.. ఆయన ప్రపంచ స్థాయి నాయకుడు అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. భారత్ సమ్మిట్ లాంటి కార్యక్రమాల ద్వారా ఆయనను మార్కెట్ చేయాలని చూస్తున్నామని బిజెపి నేతలు విమర్శలు చేయడం వారి అక్కసు, కడుపు మంటను బయటపెడుతోందన్నారు. ఎన్డీయే ప్రభుత్వం హయాంలో ధ్వంసమైన ప్రజాస్వామ్య విలువలను పునరుద్ధరించే నేతగా దేశమంతా రాహుల్ వైపు ఆశగా చూస్తోందని పేర్కొన్నారు.
• తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న రెండు రోజుల భారత్ సమ్మిట్ కు ఆయనను దేశ ప్రతిపక్ష నేతగా ఆహ్వానిస్తున్నాం.. ఆయన రాజ్యాంగా హోదాలో ఉన్నారు. దీనిని కూడా రాజకీయం చేయాలని చూడటం బీజేపీ నేతల దివాలాకోరుతనానికి నిదర్శనం అని విమర్శించారు. భారత్ సమ్మిట్ అంతర్జాతీయ స్థాయి సమ్మేళనం.. ప్రపంచంలోని వివిధ దేశాల పాలసీ మేకర్లు, పార్టీల నేతలు, పౌర సమాజ ప్రతినిధులు, ఆర్థిక నిపుణులు పాల్గొంటున్నారన్నారు. స్వాతంత్య్రం వచ్చి 80 సంవత్సరాలు పూర్తయిన సందర్భం, ప్రథమ ప్రదాని, నవ భారత నిర్మాణ దాత పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 137వ జయంతిని పురస్కరించుకుని ఈ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.
గిగ్ వర్కర్ల భద్రత కోసం చట్టం తెచ్చిన కొద్ది రాష్ట్రాల్లో తెలంగాణ ముందుందని తెలిపారు. వారి కార్యక్రమంలో పాల్గొని వారికి రాహుల్ గాంధీ మార్గనిర్దేశం చేస్తారన్నారు. స్వయంగా ఉపాధి కల్పించుకుని తమ సొంత కాళ్లపై నిలబడ్డ యువతే గిగ్ వర్కర్లు.. వారిని బీజేపీ నేతలు చిన్నచూపు చూడడం వారి దిగజారుడు మనస్తత్వాన్ని బయటపెడుతోందన్నారు. రాహుల్ గాంధీ ఈ దేశ ప్రధాని కావాలనుకుంటే నరేంద్ర మోదీ కంటే అత్యున్నత పీఠాన్ని అధిష్టించేవారని, వారికి పదవీ కాంక్ష లేదుని చెప్పారు. నెహ్రూ, గాంధీల కుటుంబానికి ఈ దేశ అభ్యున్నతే తప్ప పదవుల అలంకారాలు అవసరం లేదన్నారు. దేశం కోసం ఇందిరాజీ, రాజీవ్ జీ ప్రాణ త్యాగాలు చేశారని ఆయన గుర్తు చేశారు.
• అసలు స్వాతంత్య్ర పోరాటంలోనే పాల్గొనని బీజేపీ, దాని మాతృ సంస్థకు త్యాగాల గురించి ఏం తెలుస్తుందని ప్రశ్నించారు. ఒక్క రోజు జైలుకు వెళ్లిన చరిత్ర అప్పటి జనసంఘ్ నేతలకు గాని, ఆరెస్సెస్ పెద్దలకు గాని లేదన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ ఆధ్యర్యంలో కాంగ్రెస్ పోరాటం చేస్తోందని చెప్పారు. యువత ఆకాంక్షలను పట్టించుకోకుండా వారిని దేశద్రోహులుగా, సంఘ విద్రోహులుగా ముద్ర వేస్తున్న బీజేపీ అగ్ర నాయకులకు త్వరలోనే తెలుస్తుంది… యువత తన శక్తిని ప్రదర్శించి రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్న వారికి తగిన గుణపాఠం చెబుతుందని దుద్దిళ్ల హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో దేశంలో అధికార మార్పిడి తప్పక జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ ప్రజలు బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారన్నారు. హిందు- ముస్లిం కార్డు ఇకపై పనిచేయదని, ప్రజలు విభజన రాజకీయాలను ఇకపై ఏమాత్రం సహించరని అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





