బీహార్ సీఎం పదవికి నితీష్ రాజీనామా

– కొత్త సీఎంగా సమ్రాట్ చౌధరి ఎంపిక
– రేపు ప్రమాణ స్వీకారం

పాట్నా, ఏప్రిల్ 14: బీహార్ కొత్త ముఖ్యమంత్రిగా సమ్రాట్ చౌధరి ఎంపికయ్యారు. దాదాపు రెండు దశాబ్దాలు పాటు బీహార్ ముఖ్యమంత్రిగా పాలించిన నితీష్ కుమార్ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. దీంతో బీహార్‌లో అత్యున్నత పదవిని అధిరోహించనున్న తొలి బీజేపీ నేతగా సమ్రాట్ చౌధరి నిలిచారు. కొత్త ముఖ్యమంత్రిగా సమ్రాట్ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటివరకు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న 57 ఏళ్ల సమ్రాట్ ఓబీసీ వర్గమైన కుష్వాహా కులానికి చెందినవారు. ఓబీసీ కులాలలో యాదవుల తర్వాత కుష్వాహా వర్గమే అతి పెద్దది. ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగిన నితీష్ కుష్వాహా కులానికి చెందిన వ్యక్తినే తదుపరి సీఎంగా ప్రకటించాలని షరతు విధించినట్టు సమాచారం. నితీష్ సలహా మేరకే బీజేపీ సమ్రాట్‌కు సీఎం పీఠం అప్పగించినట్టు తెలుస్తోంది. మధ్యలో కొన్నేళ్లు మినహా 2005 నుంచి బీజేపీ బీహార్ ప్రభుత్వంలో మైనర్ భాగస్వామిగా ఉంటూ వచ్చింది. ఇరవయ్యేళ్ల తర్వాత బీజేపీకి చెందిన నేత బిహార్ సీఎం అయ్యారు. 243మంది ఉన్న అసెంబ్లీలో నితీష్ కుమార్ పార్టీకి 85 మంది, బీజేపీకి 89 మంది ఉన్నారు. కాగా, కొత్త సీఎం సమ్రాట్ చౌధరి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. మొదట ఆర్జేడీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. తర్వాత జేడీ(యు)లో, ఆ తర్వాత బీజేపీలో చేరి కీలక నాయకుడిగా ఎదిగారు. కాగా, పట్నాలో మంగళవారం తన చివరి కేబినెట్ సమావేశానికి అధ్యక్షత వహించిన అనంతరం ముఖ్యమంత్రి పదవి నుంచి నితీష్ వైదొలగారు. దీంతో తమ నాయకుడిని ఎన్నుకోవడానికి ఎన్డీయే శాసనసభా పక్షం సమావేశం కాగా కేంద్ర పరిశీలకుడిగా మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హాజరైనట్లు సమాచారం.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *