– తాము హెచ్చరించాకనే తాళాలు తీశారు
– గురుకులాల్లో మరణ మ దంగం
– ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌తో మోసం
– కాంగ్రెస్ మోసాలను ఎండగడదాం
– శ్రేణులకు బీఆర్ఎస్ నేత కేటీఆర్ పిలుపు
– తెలంగాణ భవన్‌లో అంబేడ్కర్‌కు నివాళులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14: ప్రపంచంలోనే అతిపెద్దదైన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని కేసీఆర్ ఆవిష్కరించారన్న దుర్బుద్ధితో కాంగ్రెస్ పార్టీ 2024 ఏప్రిల్ 14 నాడు బందీ చేసిందని, 125 అడుగుల ఎత్తులో ఆ మహానుభావుణ్ణి సంకెళ్లలో పెట్టి ఎవరినీ దర్శించుకోనీయకుండా చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. 2025లో కూడా అదే అక్కసుతో మళ్ళీ బంధించి అవమానించిందన్నారు. అందుకే మొన్న విద్యార్థి విభాగం నాయకత్వంలో ఒక నిర్ణయం తీసుకున్నామని, ఒకవేళ ఈసారి కూడా బాబాసాహెబ్‌ను మళ్ళీ బందీ చేస్తే తామే వందలాదిగా వేలాదిగా వచ్చి ఆ సంకెళ్లు బద్దలు కొడతామని చేసిన హెచ్చరిక ఇవాళ ఫలించి రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఏర్పాట్లు చేసిందని వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్‌లో అంబేడŠ్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించగా ముఖ్య అతిథిగా కేటీఆర్ హాజరయ్యారు. అనంతరం తెలంగాణ భవన్ నుండి భారీ కాన్వాయ్‌తో కేటీఆర్, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు 125 అడుగుల భారీ అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేడŠ్కర్ ఆశయాలను స్మరించుకుంటూ పార్టీ శ్రేణులు నినాదాలు చేశారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ అంబేడŠ్కర్ విగ్రహం సాక్షిగా కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ అంబేద్కర్ విగ్రహాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. బోధించు, సమీకరించు, పోరాడు అనే అంబేడ్కర్ మాటల స్ఫూర్తితో కేసీఆర్ లక్షలమందితో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాడి చివరకు చావు నోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని సాధించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్‌ని రాజకీయ అవసరాల కోసం వాడుకుందే తప్ప గౌరవించలేదని ఆయన విమర్శించారు. 1952, 1954లో ఆయన పార్లమెంటుకు రాకుండా కుట్రలు చేసి ఓడించిందన్నారు. హిందూ కోడ్ బిల్లు విషయంలో మహిళలకు హక్కులు కల్పించాలని ఆయన చూస్తే దాన్ని అడ్డుకున్నందుకు నిరసనగా ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారని చెప్పారు. నెహ్రూ, ఇందిర, రాజీవ్ గాంధీ కాలంలో ఆయనకు భారతరత్న ఇవ్వలేదని, కాంగ్రెసేతర ప్రభుత్వం వచ్చినప్పుడే ఆయనకు ఆ గౌరవం దక్కిందని అన్నారు.. చివరకు పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఆయన ఫోటో పెట్టడానికి కూడా కాంగ్రెస్ ఒప్పుకోలేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం వెయ్యి గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి దాదాపు 6.5 లక్షల మంది పిల్లలకు, ఏడాదికి ఒక్కొక్కరిపై రూ.1.25 లక్షల చొప్పున ఖర్చు చేస్తూ ప్రపంచంతో పోటీపడే పౌరులుగా తయారు చేయాలని సంకల్పించిందన్నారు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాటిని సరిగా నిర్వహించలేకపోతోందని, గురుకులాల్లో మరణ మృదంగం మోగుతోందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆహార కల్తీ వల్ల, ఆత్మహత్యల వల్ల 130 మందికిపైగా విద్యార్థులు మరణించడం దౌర్భాగ్యమన్నారు. కేసీఆర్ దళిత బంధు కింద రూ.10 లక్షల ఇస్తే తాము రూ.12 లక్షలు ఇస్తామని చెప్పి ఆ స్కీమ్‌కు ‘అంబేద్కర్ అభయహస్తం’ అని పేరు పెట్టారు కానీ దాన్ని అమలు చేయకుండా దళితులను, అంబేడ్కర్‌ను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అవమానిస్తోందన్నారు. నాడు కేసీఆర్ కంటే మించిన పథకం తెస్తామని ‘అంబేద్కర్ అభయహస్తం’ అని చెప్పి చేవెళ్ళలో మల్లికార్జున ఖర్గేని పిలిచి ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. ఆ మూడు వర్గాలకు ‘అభయ హస్తం’ పేరిట మేనిఫెస్టోలో 72 శాతం ప్రభుత్వ కాంట్రాక్టులు ఇస్తామని చెప్పిందని, రెండున్నరేళ్ల పాలనలో రూ.లక్ష, లక్షన్నర కోట్ల కాంట్రాక్టులు రేవంత్ రెడ్డి పిలిచిండు అని, 72 శాతం వాటా ఇవ్వలేదని, రేపోమాపో మూసీ కాంట్రాక్టు పిలుస్తారట.. మరి ఆ కాంట్రాక్టులు ఇస్తాడా రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు. ఓవర్సీస్ స్కాలర్‌షిప్ కూడా పెంచుతా అన్న రేవంత్ రెడ్డి ఇవ్వాళ రూపాయి ఇవ్వడంలేదన్నారు.వాళ్ల విద్య మధ్యలోనే ఆగిపోయేలా అన్యాయం చేస్తున్నాడన్నారు. కాంగ్రెస్ మోసాన్ని ప్రతి గిరిజన తండాకు, ప్రతి దళిత వాడకు తెలిసేలా చేయాల్సిన బాధ్యత మన మీద ఉందన్నారు. ఏప్రిల్ 27 నాడు మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం, జగిత్యాలలో బహిరంగ సభ రెండు కార్యక్రమాల తర్వాత మే, జూన్‌ల్లో ఎస్సీ, ఎస్టీల కోసం సభలు పెడదామని కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ చేసిన హామీల మీద మనం పకడ్బందీగా పోరాడాలన్నారు. చేవెళ్ళ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌తో పాటు బీసీ, రైతు డిక్లరేషన్లను అమలు చేసే వరకు అంబేడŠ్కర్ స్ఫూర్తితో తమ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. నివాళులు అర్పించిన అనంతరం కేటీఆర్, ఇతర ప్రజాప్రతినిధులు విగ్రహం కింది భాగంలో ఉన్న భవనంలోని మ్యూజియంను సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన అంబేడŠ్కర్ జీవిత విశేషాలను, చారిత్రక ఘట్టాలను ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో మండలిలో ప్రతిపక్ష నాయకుడు మధుసూదన చారి, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, ప్రశాంత్ రె&్డి, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్, ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





