– కాంగ్రెస్, ఇండి కూటమిపై కేంద్ర మంత్రి బండి నిప్పులు
– నిర్మల్లో బీజేపీ మహా పాదయాత్ర
నిర్మల్, ప్రజాతంత్ర, నవంబర్ 3 : బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో నిర్మల్లో మంగళవారం నిర్వహించిన బీజేపీ మహా పాదయాత్ర బహిరంగ సభలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్, ఇండి కూటమి, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ గడ్డపై రంగురంగుల జెండాలకు ఇకపై తావు లేదని, భవిష్యత్తులో ఎగిరేది కాషాయ జెండా మాత్రమేనని ధీమా వ్యక్తం చేశారు. 2004లో చనిపోయిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, ఎమ్మెస్సార్ వంటి అగ్రనేతల పేర్లు ఇప్పటికీ ఓటర్ల జాబితాలో ఉన్నాయని, అలాంటి చనిపోయిన వారి వోట్లను, డూప్లికేట్ వోట్లను తొలగించాల్సిందేనని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీకి ‘సర్’పై అవగాహన లేదన్నారు. సీఏఏ, ఎన్ఆర్సీలను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ నాయకులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కరెంట్, నీళ్లు లేక, వృద్ధులకు పెన్షన్లు, యువతకు ఉద్యోగాలు రాక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కాంగ్రెస్ నేతలు ప్రజా సమస్యలను వదిలేసి దిల్లీకి వెళ్లి నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. రైతులు, ప్రజా సమస్యలపై పోరాటమే బీజేపీ లక్ష్యమన్నారు. రైతు రుణ మాఫీ, నిరుద్యోగ భృతి, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనపై ఇచ్చిన హామీలను ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అమిత్ షాకు వందనం చేసినందుకు తనను, రామచందర్రావును సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని, తమకు గ్లాసులో మందు పోసే కల్చర్, దిల్లీకి డబ్బు సంచులు పంపే సంస్కృతి లేవని మండిపడ్డారు. కాంగ్రెస్ ఇలాగే వ్యవహరిస్తే త్వరలోనే దేశంలో ఎన్ఆర్సీ తీసుకొచ్చి తీరుతామని హెచ్చరించారు. రామచంద్రరావు నాయకత్వంలో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు. కాగా, ప్రసంగం కొనసాగుతున్న సమయంలో కార్యకర్తలు సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేయగా బండి సంజయ్ వారించారు. ఇలా నినాదాలు చేస్తే మైక్ బంద్ చేస్తానని హెచ్చరించారు. అంతకుముందు నిర్మల్ చేరుకున్న బండి సంజయ్ కు గంజాల్ టోల్ ప్లాజా వద్ద ఘన స్వాగతం లబించింది. కార్యకర్తలు, పార్టీ శ్రేణులతో కలిసి సంజయ్ పాదయాత్రగా బయల్దేరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





