– సీఎస్ సంజయ్ జాజు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 3: భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్న ప్రతిష్ఠాత్మక ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026కు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సూచించారు. హైదరాబాద్ నగరంలోని ప్రధాన కూడళ్లు, ముఖ్యమైన ప్రాంతాల్లో ఆకర్షణీయమైన హోర్డింగులు ఏర్పాటు చేయాలన్నారు. ‘సమ్మిట్’ ఏర్పాట్లు, ప్రచార కార్యక్రమాల పురోగతిపై సంజయ్ జాజు సచివాలయంలోని తన ఛాంబర్లో ఉన్నతాధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమ్మిట్‌కు విస్తృత ప్రచారం కల్పించేందుకు చేపడుతున్న కార్యక్రమాలు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అమలు చేస్తున్న ప్రచార వ్యూహాలు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులకు ఆహ్వానాలు పంపిన అంశాలపై సమీక్షించారు. సమ్మిట్‌పై ప్రజల్లో అవగాహన, భాగస్వామ్యాన్ని పెంపొందించేలా 10కె రన్, క్రీడా పోటీలు, ఇతర ప్రజా భాగస్వామ్య కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులకు సూచించారు. సమ్మిట్‌కు హాజరయ్యేందుకు ఆహ్వానాలు అందుకున్న ప్రతినిధులు, ప్రముఖులు, ఇతర ముఖ్య అతిథుల వివరాలను అధికారులు ప్రధాన కార్యదర్శికి వివరించారు. ఈ సందర్భంగా సంజయ్ జాజు మాట్లాడుతూ సమ్మిట్‌ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రచార కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపట్టి, రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలు, అనుకూల పారిశ్రామిక వాతావరణం, మౌలిక సదుపాయాలను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సమర్థవంతంగా చాటిచెప్పాలని అధికారులను ఆదేశించారు. సమీక్షా సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టల్, ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దురిశెట్టి, పరిశ్రమల శాఖ కార్యదర్శి కృష్ణ ఆదిత్య, ఇన్వెస్ట్ తెలంగాణ సీఈవో అజిత్ రెడ్డి, డిజిటల్ మీడియా డైరెక్టర్ కర్రి శ్రీరామ్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





