– ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో
– నివాసం సహా 13చోట్ల సుదీర్ఘ సోదాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిమ్స్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్‌ను ఏసీబీ అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. హైదరాబాద్ ఎర్రగడ్డలోని ఆయన నివాసం సహా 13 చోట్ల మంగళవారం నిర్వహించిన సుదీర్ఘ సోదాల అనంతరం ఈ చర్య తీసుకున్నారు. బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం ఆయన కూడబెట్టిన అక్రమాస్తుల విలువ రూ.80 కోట్లకు పైగా ఉంటుందని ఏసీబీ అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. డాక్టర్ లక్ష్మీభాస్కర్ వద్ద రూ.6.13 కోట్ల ప్రభుత్వ డాక్యుమెంట్ విలువ(రిజిస్ట్రేషన్ వాల్యూ) కలిగిన భారీ అక్రమాస్తులను అధికారులు గుర్తించారు. వాటిలో కూకట్‌పల్లి నుంచి విశాఖపట్నం వరకు వివిధ ప్రాంతాల్లో పది లగ్జరీ ఫ్లాట్లు, 800 చదరపు గజాల ఒక పెద్ద ప్లాట్‌తోపాటు మరో నాలుగు ఓపెన్ ప్లాట్లు (యాదాద్రి, నందిగామ, శామీర్‌పేట్‌లో) ఉన్నాయి. వివిధ బ్యాంకుల్లో రూ.1.41 కోట్ల బ్యాలెన్స్, ప్రైవేట్ ఫైనాన్షియల్ సంస్థల్లో రూ.35 లక్షల పెట్టుబడులు, రూ.29.55 లక్షల విలువైన మ్యూచువల్ ఫండ్స్ కనుగొన్నారు. ఒక వివాదాస్పద ఫ్లాట్‌లో రూ.1.30 కోట్ల పెట్టుబడి పెట్టడంతోపాటు, ఇతరులకు రూ.1.33 కోట్లు చేబదులుగా(అప్పుగా) ఇచ్చినట్లు ఆధారాలు లభించాయి. 517.8 గ్రాముల బంగారం, నాలుగు విలాసవంతమైన కార్లు, నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
నియామకాల అక్రమాలపై కూడా నిఘా
ఆదాయానికి మించిన ఆస్తులతోపాటు నిమ్స్ హాస్పిటల్‌లో దాదాపు 90 మంది స్కిల్డ్, అన్‌స్కిల్డ్ కార్మికుల నియామక ప్రక్రియలో డాక్టర్ లక్ష్మీభాస్కర్ భారీగా డబ్బులు వసూలు చేసి అక్రమాలకు పాల్పడినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. అరెస్టు చేసిన లక్ష్మీభాస్కర్‌ను వైద్య పరీక్షల అనంతరం ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





