జపాన్-తెలంగాణ సహకారానికి కొత్త దిశ

– ఉపాధి, నైపుణ్యాభివృద్ధిలో భాగస్వామ్య అవకాశాలపై చర్చలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 5: ప్రపంచవ్యాప్తంగా ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా తెలంగాణ యువతను ప్రభుత్వం సిద్ధం చేస్తోందని కార్మిక, ఉపాధి, గనులు, భూగర్భ శాఖ మంత్రి డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. జపాన్‌లోని హిరోషిమా ప్రిఫెక్చర్‌కు చెందిన ప్రతినిధి బృందం సచివాలయంలో శుక్రవారం ఆయనతో సమావేశమైంది. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ రాష్ట్ర యువతకు విదేశీ ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో, వారి ఉపాధి సామర్థ్యాలను పెంపొందించడంలో టామ్‌కామ్ అత్యంత వృత్తిపరమైన, లక్ష్యబద్ధమైన కృషి చేస్తోందని తెలిపారు.  జపాన్ సాంకేతిక నైపుణ్యం, పని సంస్కృతి తనను ఎంతో ఆకట్టుకున్నాయన్నారు. జపాన్ యంత్రాల ఖచ్చితత్వంతోపాటు అక్కడి ప్రజల వినయం, క్రమశిక్షణ తనను ప్రభావితం చేశాయన్నారు. టామ్‌కామ్ సమన్వయతో జరిగిన ఈ సమావేశంలో జపాన్ ప్రతినిధులు వివిధ పరిశ్రమలు, రంగాల్లో భారత యువతకు అందుబాటులో ఉన్న ఉపాధి అవకాశాల గురించి మంత్రికి వివరించారు. తెలంగాణ-జపాన్ మధ్య నైపుణ్యాభివృద్ధి, అంతర్జాతీయ ఉపాధి అవకాశాల విస్తరణ, శిక్షణ పొందిన మానవ వనరుల అభివృద్ధి వంటి అంశాలపై పరస్పర సహకార అవకాశాలపై చర్చలు జరిగాయి. హైదరాబాద్‌తో జపాన్ నగరాల అనుబంధానికి రెండు దశాబ్దాల చరిత్ర ఉందని, ప్రస్తుతం ఆ భాగస్వామ్యం 20వ సంవత్సరాన్ని జరుపుకుంటోందని ప్రతినిధి బృందం తెలిపింది. సమావేశంలో లేబర్ ఎంప్లాయ్‌మెంట్ ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్ శాఖ కార్యదర్శి దాసరి హరిచందన  అభివృద్ధి అవకాశాలపై సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, ఉద్యోగ నైపుణ్యాల పెంపు, అంతర్జాతీయ ప్లేస్‌మెంట్ అవకాశాల గురించి వివరించారు. అలాగే తెలంగాణ-హిరోషిమా ప్రిఫెక్చర్ మధ్య సహకారం, ఉపాధి అవకాశాలను మరింత విస్తరించేందుకు సంయుక్త కార్యాచరణ బృందం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. హిరోషిమా ప్రిఫెక్చర్, నారా జపాన్ హబ్ ప్రతినిధుల ఆధ్వర్యంలో వచ్చిన బృందంలో ఫునైషి హిరోయోషి, డైరెక్టర్, ఇండస్ట్రియల్ హ్యూమన్ రిసోర్సెస్ డివిజన్, కోగా యుయా – సిబ్బంది, ఇండస్ట్రియల్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్‌మెంట్ డివిజన్, హరజోనో యోషిహిరో- సూపర్‌వైజర్, లోకల్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ డివిజన్, టోయి మారియా -సిబ్బంది, లోకల్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ డివిజన్‌తోపాటు ఇతర అధికారులు ఉన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *