– మంత్రి వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 5 : ప్రపంచ ఉద్యోగ విపణిలో చోటుచేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా తెలంగాణ యువతను సిద్ధం చేయాలనే లక్ష్యంతో సంప్రదాయ పారిశ్రామిక శిక్షణ సంస్థల(ఐటీఐలు)ను అత్యాధునిక అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా (ఏటీసీలు) ప్రభుత్వం తీర్చిదిద్దిందని కార్మిక, ఉపాధి, గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. ఈ కేంద్రాలు కేవలం శిక్షణ సంస్థలుగానే కాక నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు మరియు అంతర్జాతీయ కెరీర్‌లకు ద్వారాలుగా మారుతున్నాయని పేర్కొన్నారు. మల్లేపల్లి ఏటీసిని మీడియా ప్రతినిధులతో కలిసి శుక్రవారం సందర్శించిన అనంతరం మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ట్రైనర్లు ఏటీసీల్లో అత్యాధునిక మౌలిక సదుపాయాలు, ఆధునిక యంత్రాలు, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా అందిస్తున్న శిక్షణ కార్యక్రమాలను ప్రదర్శించారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ (టీటీఎల్) భాగస్వామ్యంతో ఏటీసీల ఏర్పాటుకు సుమారు రూ.4,000 కోట్ల విలువైన అత్యాధునిక సాంకేతిక మౌలిక సదుపాయాలు, శిక్షణ వనరులను సమకూర్చిందన్నారు. ఏటీసీల్లో విద్యార్థులకు ప్రభుత్వం స్టయిఫండ్ కూడా అందజేస్తోందని, ఆర్థిక ఇబ్బందులు ఆధునిక నైపుణ్యాల సాధనకు అడ్డంకిగా మారకుండా చర్యలు తీసుకుంటోందని మంత్రి పేర్కొన్నారు. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాలకు అనుగుణంగా శిక్షణ సంస్థలను ఆధునీకరించడం ద్వారా భవిష్యత్ పరిశ్రమల అవసరాలను తీర్చగల అత్యున్నత నైపుణ్యాలున్న మానవ వనరులు సిద్ధమవుతారని తెలిపారు. ఈ కార్యక్రమం తెలంగాణ యువత ఉపాధి అవకాశాలను పెంపొందించడమేకాక రాష్ట్రాన్ని దేశంలోనే నైపుణ్యాభివృద్ధి రంగంలో అగ్రగామిగా నిలబెడుతుందన్నారు. ఏటీసీలను యువతకు లభించిన సువర్ణావకాశంగా అభివర్ణించిన మంత్రి అందుబాటులో ఉన్న సదుపాయాలను పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు. నేటి పోటీ ప్రపంచంలో విజయం సాధించాలంటే క్రమశిక్షణ, అంకితభావం, నిరంతర అభ్యాసం ఎంతో అవసరమని చెప్పారు. ఈ ఏటీసీలు రాష్ట్రంలో భవిష్యత్ ఉపాధి వ్యవస్థకు పునాదులు వేస్తున్నాయని, ఇవి మన యువతను దేశవ్యాప్తంగా మాత్రమే కాక ప్రపంచస్థాయి అవకాశాలను అందిపుచ్చుకునేలా తీర్చిదిద్దుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. వీటి మౌలిక సదుపాయాల అభివృద్ధితోపాటు శిక్షకులు, బోధకులకు కూడా విస్తృత స్థాయిలో శిక్షణలు నిర్వహిస్తున్నామని, తద్వారా విద్యార్థులకు పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన నాణ్యమైన విద్య, ప్రాక్టికల్ శిక్షణ అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ప్రత్యేక ఫోటో ప్రదర్శన
ఈ సందర్భంగా మల్లేపల్లి ఐటీఐ ప్రాంగణంలో ప్రత్యేక ఫోటో ప్రదర్శనతో పాటు సాంకేతిక ప్రదర్శనను నిర్వహించారు. శిక్షణ పూర్తి చేసి ఉద్యోగాలు సాధించిన విద్యార్థులు మంత్రి, మీడియా ప్రతినిధులతో తమ అనుభవాలను పంచుకున్నారు. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్‌గా రూపాంతరం చెందడం వల్ల తమ నైపుణ్యాలు పెరిగాయని, ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని, తమ జీవితాల్లో సానుకూల మార్పులు వచ్చాయని వివరించారు. శాఖ అధికారులు, ట్రైనర్లు, సిబ్బంది కృషిని అభినందించిన మంత్రి వెంకటస్వామి యువతకు నాణ్యమైన శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో వారు చూపుతున్న అంకితభావాన్ని ప్రశంసించారు. ఇదే నిబద్ధతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




