ప్రజలకు ఉపాధి క‌ల్ప‌నే నిజమైన అభివృద్ధి

– 200 మంది మహిళలకు ప్రత్యక్ష ఉపాధి క‌ల్ప‌న‌
– సిద్దిపేటను దేశంలో రెండో షోలాపూర్‌గా తీర్చిదిద్దే అవకాశం
– దుస్తుల తయారీ పరిశ్రమను ప్రారంభించిన హరీశ్ రావు
సిద్దిపేట, ప్రజాతంత్ర, జూన్ 5:  సిద్దిపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన అద్వితీయ ఎంటర్‌ప్రైజెస్ దుస్తుల తయారీ పరిశ్రమను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ అభివృద్ధి అంటే రోడ్లు, భవనాలు, కళాశాలలు నిర్మించడం మాత్రమే కాదని, ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించి వారి కాళ్లపై వారు నిలబడేలా చేయడమేన‌న్నారు. సిద్దిపేట మహిళలకు, గృహిణులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించాలనే తన కల టెక్ లైన్, అద్వితీయ సంస్థల సహకారంతో నేడు సాకారమవుతోందని ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల యూనిఫామ్‌ల తయారీ ద్వారా అనేకమందికి ఉపాధి కల్పిస్తున్న టెక్ లైన్ సంస్థ అధినేత్రి భువనేశ్వరి సేవలను కొనియాడారు. లాభాపేక్ష కంటే ఉపాధి కల్పనకే ప్రాధాన్యతనిస్తూ ప్రశాంత్ నగర్‌లో ఈ పరిశ్రమను ఏర్పాటు చేసిన కో-ఆపరేటివ్ చైర్మన్ తోట శ్రీకాంత్ రెడ్డి బృందాన్ని అభినందించారు. ఈ పరిశ్రమలో 70 మంది మహిళలు పనిచేస్తున్నారని, త్వరలోనే స్టిచ్చింగ్ విభాగంలో 100 మంది, ప్యాకింగ్ విభాగంలో మరో 100 మంది మహిళలకు ఉపాధి లభించనుందని తెలిపారు. సాధారణంగా నెల రోజుల సమయం పట్టే శిక్షణను సిద్దిపేట మహిళలు కేవలం నాలుగు రోజుల్లోనే నేర్చుకోవడం వారి ప్రతిభకు నిదర్శనమని అన్నారు. మహిళలంతా నాణ్యతతో కూడిన పనితీరును కనబరిస్తే మరిన్ని ఆర్డర్లు వస్తాయని, తద్వారా ఉపాధి అవకాశాలు 200 నుంచి 400, అనంతరం 800 మందికి విస్తరించే అవకాశం ఉందని వివరించారు.గతంలో సిద్దిపేటలో 6 వేల మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు అందించినప్పటికీ అవి గృహ స్థాయికే పరిమితమయ్యాయని, కానీ అంతర్జాతీయ స్థాయిలో పోటీపడాలంటే అద్వితీయ సంస్థలో ఏర్పాటు చేసిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన యంత్రాలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. మహిళల శ్రమ, క్రమశిక్షణ, నాణ్యత ఆధారంగానే భవిష్యత్తులో సిద్దిపేట దేశంలో రెండో షోలాపూర్‌గా ఎదిగే అవకాశం ఉందన్నారు. సంస్థ విస్తరణ కోసం ఇంజనీరింగ్ కళాశాలలు, విశ్వవిద్యాలయాలతో తానే స్వయంగా మాట్లాడి మరిన్ని ఆర్డర్లు వచ్చేలా సహకరిస్తానని హామీ ఇచ్చారు. దేశంలోని సుమారు రూ.60 వేల కోట్ల టెక్స్‌టైల్ పరిశ్రమలో 70 శాతం వాటా స్టిచ్చింగ్ రంగానిదేనని, ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
———————————————————————————————————————————————————————————–

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *