కల్యాణలక్ష్మి–షాదీ ముబారక్ అమలుపై స్టేను హైకోర్టు డివిజన్ బెంచ్ నిలిపివేయడంతో ఈ పథకాల అమలును కొనసాగించడానికి ఏర్పడిన అడ్డంకి తొలగిపోయింది. సెప్టెంబర్ 1న తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్‌ల డివిజన్ బెంచ్, కల్యాణలక్ష్మి–షాదీ ముబారక్ పథకాలకు సంబంధించిన ఎనిమిది జీఓల అమలును నిలిపివేసిన సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వుపై స్టే ఇచ్చింది. ఇది పథకాల అమలుకు తాత్కాలిక ఉపశమనం కలిగించినప్పటికీ పెద్ద మొత్తంలో ప్రజాధనం ఖర్చయ్యే సంక్షేమ పథకాలను కేవలం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తో కొనసాగించవొచ్చా అని ఆగస్టు 12న సింగిల్ జడ్జి ఈ పథకాలకు సంబంధించిన జీఓలను నిలిపివేసినప్పుడు లేవనెత్తిన మౌలిక రాజ్యాంగ–ఆర్థిక ప్రశ్నకు ఇంకా తుది సమాధానం రాలేదు. అంతేకాదు ఈ పథకాల ఖర్చుపై కాగ్ ఏవైనా అవకతవకల ను గుర్తించిందా అని కూడా సింగల్ జడ్జి ప్రశ్నించారు. వాస్తవానికి ఈ ఏడాది కాగ్ ఆడిట్‌లో కల్యాణలక్ష్మి అమలులో డేటాబేస్ క్రాస్ చెకింగ్ లోపాలు, అనర్హులకు ప్రయోజనాలు వెళ్లిన కేసులు సహా ₹72.91 కోట్లకు సంబంధించిన అవకతవకలను గుర్తించినట్లు వెల్లడైంది.
రాష్ట్రంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుపై హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తాత్కాలిక స్టే, ఒకే సమయంలో అటు లబ్ధిదారులకు ఊరటనిస్తూనే, ఇటు సంక్షేమ పాలనపై ఒక ప్రాథమిక రాజ్యాంగ చర్చను రాజేసింది. సింగిల్ జడ్జి తీర్పుతో నిలిచిపోయే ప్రమాదంలో పడిన ఈ పథకాలు ప్రస్తుతానికి కొనసాగేందుకు మార్గం సుగమమైంది. ఆడపిల్లల పెళ్లి భారాన్ని మోయలేక సతమతమయ్యే లక్షలాది నిరుపేద కుటుంబాలకు ఇది కొండంత అండ. అయితే, న్యాయస్థానం ఇచ్చిన ఈ తాత్కాలిక ఉపశమనం వెనుక ఒక మౌలికమైన, శాశ్వతమైన ప్రశ్న దాగి ఉంది. కేవలం ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా వందల, వేల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేసే సంక్షేమ పథకాలకు రాజ్యాంగబద్ధమైన, చట్టబద్ధమైన రక్షణ ఏదనేదే అ ప్రశ్న. భారత రాజ్యాంగంలోని నాల్గవ భాగంలో పొందుపరిచిన ఆదేశిక సూత్రాలు స్పష్టమైన సంక్షేమ రాజ్య స్థాపనను ఆకాంక్షిస్తున్నాయి.
రాజ్యాంగంలోని 38వ అధికరణ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయంతో కూడిన సామాజిక వ్యవస్థను పెంపొందించడం ద్వారా ప్రజల శ్రేయస్సును కాపాడాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నది. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయంతో కూడిన సామాజిక వ్యవస్థను పెంపొందించడం ద్వారా ప్రజల శ్రేయస్సును కాపాడాలని 39వ అధికరణం స్పష్టం చేస్తున్నది . ఆర్థిక సామర్థ్యానికి లోబడి విద్యా, ఉపాధి మరియు ప్రజా సహాయం పొందే హక్కును కల్పించాలని 41వ అధికరణం చెబుతున్నది . ఈ అధికరణల ఆధారంగా ఈ ఆర్టికల్స్ ఆధారంగానే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాకుండా, బాల్య వివాహాలను అరికట్టడానికి మరియు సామాజిక సమానత్వాన్ని సాధించడానికి దోహదపడే సాధనాలుగా మారాయి. అందువల్ల, పేదలకు అందే ఈ సాయం ఎట్టిపరిస్థితుల్లోనూ ఆగకూడదు.
ఇదే సమయంలో పన్ను చెల్లింపుదారుల సొమ్ముకు లెక్క తప్పకూడదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 266(3) ప్రకారం, చట్టబద్ధమైన నిబంధనలు లేదా బడ్జెట్ ఆమోదం లేకుండా భారత సంచిత నిధి నుండి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడానికి వీలులేదు.గతంలో సుప్రీంకోర్టు “రామ్ జవాయా కపూర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ (1955)” కేసులో కీలక తీర్పునిచ్చింది. శాసనసభ చట్టం లేకపోయినా కార్యనిర్వాహక వ్యవస్థ కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చని పేర్కొంటూనే, పౌరుల హక్కులను ప్రభావితం చేసే లేదా భారీ ఆర్థిక భారంతో కూడిన నిర్ణయాలకు ఖచ్చితంగా శాసనసభ చట్టబద్ధత అవసరమని స్పష్టం చేసింది. నిర్దిష్టమైన చట్టపరమైన నిబంధనలు, పటిష్టమైన ఆడిటింగ్ వ్యవస్థ లేనప్పుడు సంక్షేమ పథకాలు నిధుల దుర్వినియోగానికి, రాజకీయ పక్షపాతానికి, అర్హత లేని వారి చేతుల్లోకి వెళ్లే ప్రమాదానికి గురవుతాయి.
ప్రస్తుతం దేశంలో మెజారిటీ సంక్షేమ పథకాలు కేవలం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ లేదా ప్రభుత్వ ఉత్తర్వుల ఆధారంగానే నడుస్తున్నాయి. ప్రభుత్వాలు మారినప్పుడు లేదా బడ్జెట్ అంచనాలు తారుమారైనప్పుడు ఈ ఉత్తర్వులు మారుతుంటాయి. మరీ ముఖ్యంగా, ఇవి కోర్టుల న్యాయ సమీక్షకు గురైనప్పుడు చట్టబద్ధమైన పునాది లేక కుప్పకూలిపోయే ప్రమాదం ఉంటుంది. కార్యనిర్వాహక వ్యవస్థ తీసుకునే తాత్కాలిక నిర్ణయాలు, శాసనసభ పరిధిలో సమగ్రమైన చట్టాలుగా మారినప్పుడే వాటికి శాశ్వత రక్షణ లభిస్తుంది. ఉదాహరణకు, గతంలో ఎస్సీ, ఎస్టీ సబ్-ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించడం ద్వారా నిధుల మళ్లింపును అడ్డుకోగలిగారు. అదే విధంగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి భారీ బడ్జెట్ సంక్షేమ పథకాలకు కూడా అసెంబ్లీలో ప్రత్యేక చట్టాలు రూపొందించాలి. చట్టబద్ధత కల్పించినప్పుడు పథకం నిబంధనలు, అర్హతలు, నిధుల కేటాయింపులు స్థిరంగా ఉంటాయి. ఏ ప్రభుత్వమూ వాటిని అంత సులభంగా నిలిపివేయలేదు.
కోర్టులు లేవనెత్తిన రాజ్యాంగ, ఆర్థిక ప్రశ్నలకు తాత్కాలిక జీవోలు శాశ్వత సమాధానం కాలేవు. ఇకనైనా ప్రభుత్వాలు కోర్టు స్టేలతో సరిపెట్టుకోకుండా, సంక్షేమ పథకాల నిర్వహణలో పూర్తి జవాబుదారీతనాన్ని తీసుకురావాలి. లబ్ధిదారుల ఎంపికలో డిజిటల్ ఆడిటింగ్, పారదర్శకమైన నిబంధనలు అమలు చేయాలి. సంక్షేమం నిరంతరాయంగా సాగాలి, అదే సమయంలో చట్టబద్ధత-జవాబుదారీతనం కాపాడబడాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ రెండింటి సమతుల్యతను సాధించడమే ఇప్పుడు ప్రభుత్వం ముందున్న తక్షణ కర్తవ్యం.





