– రాష్ట్రవ్యాప్తంగా అడుగంటిన భూగర్భ జలాలు
– 320 మండలాల్లో ఎండిపోతున్న పంటలు
– తాగు, సాగు నీటికి ఇక్కట్లు
– రబీ సాగు వద్దన్న సర్కారు
– ఎకరానికి పంట నష్టంపై రైతన్నల ఆవేదన
– ముందస్తు ప్రణాళిక లోపమే కరువుకు కారణమని ప్రతిపక్షాల మండిపాటు
(మండువ రవీందర్రావు , ప్రజాతంత్ర, ప్రత్యేక ప్రతినిధి)
ఇప్పటికే జలాశయాలు ఎండిపోయే పరిస్థితికి వస్తే వేసవి పరిస్థితి ఏమిటన్నది ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నది. ఎల్‌నినో ప్రభావం రాష్ట్రంలో ఇప్పటికే తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది. దాదాపు రాష్ట్రమంతటా భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. సాగు నీరు లేక ఒకపక్క పంటలు ఎండిపోతుంటే అసలు తాగునీటి పరిస్థితేమిటన్నది ఇప్పుడు అందరినీ కలిచివేస్తున్నది. ఇప్పటికే రాష్ట్రంలోని సగం మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. అంటే దాదాపు 320 మండలాలు అత్యంత కరువు మండలాలుగా గుర్తించింది. అయితే మిగతా మండలాల్లో కరువులేదని కాదు. కాకపోతే భూగర్భ జలాల పరిస్థితి కాస్త హెచ్చు తగ్గులో ఉన్నాయి. వాస్తవానికి ఈ ఎల్‌నినో అన్నది కేవలం మన రాష్ట్రమో లేక దేశానికో పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా సుమారు వంద దేశాల్లో దీని ప్రభావం ఉంది. మన దేశానికి వస్తే 60శాతం రాష్ట్రాలు దీని ప్రభావానికి గురైనాయి. వర్షాకాలంలో పడాల్సినంతగా వర్షం కురవకపోవడం, ఎల్‌నినో ప్రభావం కారణంగా మన రాష్ట్రంలో సుమారు 17శాతం వర్షపాత లోటు నమోదు అయింది. ఆదిలాబాద్ లాంటి ప్రాంతాల్లో 35శాతం వరకు లోటు వర్షపాతం ఉన్నట్లు చెబుతున్నారు. వర్షాలు సకాలంలో పడకపోవడంతో సాగునీటి లభ్యత తగ్గి ఈసారి పంటల విస్తీర్ణంకూడా గణనీయంగా పడిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా 11.18 లక్షల ఎకరాలకుపైగా నీటి కొరతను ఎదుర్కుంటున్నట్లు అనధికార అంచనా. ఈ కాలం పంట నష్టం కనీసం 20 కోట్ల వరకు ఉంటుందని ఇప్పటికే పొఫ్రెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం అంచనా వేసింది. ప్రధానంగా రైతులు దుర్బర పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తున్నది. అయితే పంట నష్టం, రైతు నష్టంతోనే కాకుండా ఈ రంగంపైన ఆధారపడిన అనేకమంది ఆర్థిక ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఏర్పడింది.
ముందుగా మనకు కనిపించేది వ్యవసాయ కార్మికులు. తర్వాత ఆ రంగానికి చెందిన విత్తన, ఎరువుల వ్యాపారులు. ఫలితంగా ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గటం వల్ల ఇతర వ్యాపార రంగాలపైనకూడా దీని ప్రభావం పడనుంది. పంటల దిగుబడి తగ్గడంతో నిత్యావసర ఆహార పదార్ధాల ధరలకు రెక్కలు రానున్నాయి. ఇప్పటికే బియ్యం, నూనెల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వీటన్నిటికీ తగినట్లుగా తాగునీటి సమస్యకూడా ఎదురవుతున్నది. ఇప్పటికే కృష్ణా, గోదావరిలో నీటి సామర్థ్యం తగ్గిందని చెబుతున్నారు. కృష్ణా నదిపై ప్రాజెక్టుల నిల్వ సామర్థ్యం 270 టిఎంసీలుగా ఉంటే ప్రస్తుతం 78.5 టిఎంసీల నీరు మాత్రమే ఉందంటున్నారు. అలాగే గోదావరిలో ఇప్పటికే 34శాతం నీటిలోటు ఉందంటున్నారు. సింగూరులో 29.95 టిఎంసీలకు గాను 4 టిఎంసిల నీరు మాత్రమే లభ్యత ఉందని చెబుతున్నారు. ఇలాచూస్తే రాష్ట్రంలోని దాదాపు అన్ని నీటి జలాశయాల్లో దాదాపుగా నాల్గవ వంతుకన్నా తక్కువ నీటి లభ్యత ఉన్నట్లు తెలుస్తున్నది. ఫలితంగా దాదాపు రాష్ట్రవ్యాప్తంగా భూ ఉపరితలంనుంచి 7.87 మీటర్ల లోతుకు నీటి మట్టం చేరుకుంది. వికారాబాద్ జిల్లాలోనైతే 11.96 మీటర్ల కిందకు నీటి మట్టం పడిపోయింది. హైదరాబాద్‌లో కొన్ని ప్రాంతాల్లో అత్యంత ఎక్కువగా 37 మీటర్ల లోతుకు నీటి మట్టం చేరుకోవడంద్వారా ఆ ప్రాంతాలు రెడ్ జోన్‌కు చేరుకున్నాయి.
రానున్న కాలంలో రాష్ట్ర రాజధాని ప్రజల మంచినీటి పరిస్థితేమిటన్న విషయం ఆందోళన కలిగిస్తున్న అంశం. మళ్ళీ వర్షాలు పడేవరకు ఉన్న నీటిని ఎలా జాగ్రత్తగా వినియోగించాలన్న దానిపైనే ప్రభుత్వ యంత్రాంగం కుస్తీ పడుతున్నది. వాస్తవంగా ఇప్పటికే హైదారాబాద్ ప్రజల్లో 70శాతం మంది బోర్లు, బావులపై ఆధారపడి ఉన్నారు. ఇప్పుడు వాటిల్లోకూడా నీరు పాతాళానికి చేరుకుంటున్నాయి. కాగా, నీటి ఎద్దడి కారణంగా ప్రజలు మరికొన్ని బోర్లు వేస్తున్నారు. రోజుకు దాదాపు వంద వరకు కొత్త బోర్లు వేస్తున్నట్లు ఒక అంచనా. అయితే భూగర్భ జలాలు అడుగంటిన నేపథ్యంలో తమ అవసరార్థం విచ్చలవిడిగా బోర్లు వేయకుండా నిషేధాజ్ఞలు జారీ చేసింది ప్రభుత్వం. బోరు వేయాలంటే తప్పనిసరిగా వెన్యూ అధికారుల అనుమతి తీసుకోవాలంటున్నది. అయితే రాష్ట్రంలో ఇంతటి దుర్బర పరిస్థితి ఎదురుకావడానికి ఎల్‌నినో కారణంగా చూపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని విపక్షాలు తప్పుపడుతున్నాయి. ఎల్‌నినో ప్రభావాన్ని ముందస్తుగానే వాతావరణ శాఖ అలర్ట్ చేసినా ప్రభుత్వం సకాలంలో చర్యలు తీసుకోకపోవడమే ఇబ్బందులకు కారణంగా ఆ పక్షాలు పేర్కొంటున్నాయి.
సహజంగా విపత్కర పరిస్థితులు ఏర్పడుతున్నప్పుడు ప్రజలను ముందస్తుగా ప్రభుత్వం అప్రమత్తం చేయడంతోపాటు, ప్రభుత్వంకూడా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉండింది. కానీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్షం చేసిందన్నది ఆ పక్షాల వాదన. ముందస్తుగా ఆనేక జలాశయాల్లో నీటిని నింపి ఉంటే ఇవ్వాళ ఖరీఫ్ చివరి దశలో రైతులు నీటి చుక్కకోసం వెంపర్లాడేవారే కాదన్నది వారి వాదన. కేవలం గత ప్రభుత్వ లోపాలన్నీ ఎత్తిచూపే క్రమంలో కావల్సిన నీటిని సకాలంలో ఎత్తిపోయకుండా జాప్యం చేసిన కారణంగా కృత్రిమ కరువు ఏర్పడిందంటున్నారు. పంట చేతికివచ్చే సమయానికి నీళ్ళు అందక రైతులు ట్యాంకర్లనుండి నీరు తెచ్చి పొలాల్లో పోసుకుంటున్న దురదృష్ట వాతావరణం ఏర్పడిందని వారు ఆక్రోశిస్తున్నారు. జనరేటర్ల వాడకం, బోరు బావుల నీరు తోడటం వల్ల కరెంటు వాడకం కూడా పెరిగింది. కానీ ప్రభుత్వం ఏడు ఎనిమిది గంటల కరెంటు మాత్రమే ఇవ్వడం కూడా రైతుకు ఇబ్బందికి గురిచేస్తున్నది. కరెంటు ఉత్పత్తి విషయంలో కూడా ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహిరంచలేదని ప్రతిపక్షాలు ఇప్పటికే ఆరోపిస్తున్నాయి. కొందామంటే మార్కెట్లో యూనిట్‌కు పదిహేను రూపాయలు పెట్టినా దొరకటం లేదని సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పడాన్ని వారు తీవ్రంగా తప్పుపడుతున్నారు. దీనికంతటికీ ప్రభుత్వ ముందు చూపు లోపమేనంటున్నాయి ఆ పక్షాలు. కరెంటు, నీటి కొరత కేవలం వ్యవసాయ రంగంపైనే కాకుండా అనేక రంగాలపై భవిష్యత్‌లో ప్రభావాన్ని చూపిస్తుందంటున్నారు. ఈ పరిస్థితిని అదిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.20వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానైతే కోరింది. కానీ, నష్టపోయిన తమ పరిస్థితి ఏమిటంటున్నారు రైతులు. లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి పంటలేసుకుంటే ప్రభుత్వం నీటిని సకాలంలో అందించకపోవడం వల్ల తమ పంటలు ఎండిపోయాయంటున్నారు. అంతేగాక రబీ పంటలు వేసుకోవద్దని ప్రభుత్వం చెబుతున్నదని, దానికి ప్రత్యమ్నాయం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. తక్కువ నీటితో పండించే పంటలకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, పండిన పంటకు గిట్టుబాటు ధర, మార్కెటింగ్ తదితర అంశాలపైన వివరణ ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





