– గ్రామాలు, పట్టణాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి
– ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 23: ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులపై ఎల్‌నినో చూపే ప్రభావం, వాటి వల్ల తలెత్తే పరిణామాలపై ప్రజలను చైతన్యపర్చాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు పేర్కొన్నారు. వాతావరణ మార్పులు, అధిక ఉష్ణోగ్రతలు, వర్షపాతంలో మార్పులు, తాగునీటి సమస్యలు వంటి అంశాలపై ఎల్-నినో చూపే ప్రభావాలను ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు ముందస్తు జాగ్రత్తలపై విస్తృత ప్రచారం చేపట్టాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో సమాచార శాఖ అధికారులు, సాంస్కృతిక సారథి కళాకారులకు శుక్రవారం నిర్వహించిన ఒక రోజు చైతన్య సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎల్‌నినో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులను ప్రభావితం చేస్తోందని, దాని ప్రభావాలను ఎదుర్కొనేందుకు ప్రజలకు సమయానుకూలంగా సరైన సమాచారం అందించడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ఎల్-నినో ప్రభావంతో రాష్ట్రంలో 20 శాతానికిపైగా వర్షపాతం తక్కువగా నమోదయిందని, దీనితో దాదాపు 20 శాతం పంట విస్తీర్ణం తగ్గిందని, తద్వారా ధాన్యం, పశుగ్రాసం తగ్గిందని తెలిపారు. ప్రస్తుతం రిజర్వాయర్లలో 30 నుండి 40 శాతం నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయని, ఈ పరిస్థితుల్లో రానున్న జూలై వరకు తాగు నీటికి అత్యంత ప్రాధాన్యనిస్తున్నామని వివరించారు. గత మూడు నెలలుగా రాష్ట్రంలో అత్యధిక విద్యుత్ వినియోగం పెరుగుతోందని, అత్యధికంగా 20 వేల మెగావాట్ల విద్యుత్ వినియోగం జరుగుతోందని సీఎస్ వెల్లడించారు.
రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు అవగాహన కార్యక్రమాలు
సమాచార, పౌరసంబంధాల శాఖ, తెలంగాణ సాంస్కృతిక శాఖ సమన్వయంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రజా అవగాహన ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు. ప్రతి గ్రామం, పట్టణానికి ఈ ప్రచారాన్ని విస్తరించి ప్రజలందరికీ ఎల్‌నినో ప్రభావాలు, వాటిని ఎదుర్కొనే ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, అవుట్ డోర్ మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నప్పటికీ జానపద కళారూపాల ప్రభావం గ్రామీణ ప్రజలపై గణనీయంగా ఉంటుందన్నారు. కావున సాంస్కృతిక శాఖ సహకారంతో జానపద కళారూపాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, ఇతర ప్రజా అవగాహన కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోనూ సందేశాలను ప్రజలకు చేరవేయాలని సూచించారు. ప్రతి గ్రామంలో ప్రజలకు అర్థమయ్యే రీతిలో సమాచారాన్ని చేరవేసి ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కల్పించాలి
నీటిని, విద్యుత్‌ను అత్యంత పొదుపుగా వాడడం, ఎండల సమయంలో తగినంత నీరు తాగడం, అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్లకుండా ఉండడం, వృద్ధులు, చిన్నారులు, ఇతర సున్నిత వర్గాల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం వంటి జాగ్రత్తలను ప్రజలకు తెలియజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు. తాగునీటిని పొదుపుగా వినియోగించడం, నీటి వనరులను సమర్థంగా నిర్వహించడం, నీటి కొరతను ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపట్టడం కూడా ముఖ్యమని తెలిపారు. ప్రజలకు అవసరమైన సూచనలు, హెచ్చరికలు నిరంతరం చేరేలా వ్యవసాయ, విద్యుత్, పశు సంవర్ధక, రెవెన్యూ, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సంబంధిత శాఖల సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఎల్‌నినో ప్రభావాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ శాఖలతోపాటు ప్రజలు కూడా భాగస్వాములు కావాలని, సమాచార, పౌరసంబంధాల శాఖ, తెలంగాణ సాంస్కృతిక శాఖ సంయుక్తంగా రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర ప్రచార కార్యాచరణను అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు. కార్యక్రమంలో సమాచార, పౌరసంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ డాక్టర్ జి. ముకుంద రెడ్డి, తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకుడు డాక్టర్ ఎ.నరసింహా రెడ్డి, సమాచార, పౌరసంబంధాల శాఖ అదనపు సంచాలకుడు డి.ఎస్.జగన్, సంయుక్త సంచాలకులు కె.వెంకటరమణ, శ్రీనివాస్, మధుసూదన్‌తో పాటు వ్యవసాయ, విద్యుత్, పశు సంవర్ధక శాఖల అధికారులు, అన్ని జిల్లాల పౌర సంబంధాల అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





