– క్యూర్ పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణమే లక్ష్యం
– నెలాఖరులోగా డబుల్ బెడ్రూమ్ లబ్దిదారుల ఎంపిక పూర్తి
– రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 23 : పేదల ఉపాధికి ఎలాంటి ఆటంకం కలగకుండా వారు నివసిస్తున్న ప్రాంతాలకు సమీపంలోనే ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ నిర్మించి ఇవ్వాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఒకవైపు ప్రభుత్వ భూములను పరిరక్షిస్తూనే మరోవైపు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి అవసరమైన భూములను యుద్ధప్రాతిపదికన గుర్తించాలని అధికారులను ఆదేశించారు. క్యూర్ పరిధిలోని నియోజకవర్గాల వారీగా మొదటి విడత నిర్మాణాలకు అవసరమైన స్థలాల గుర్తింపును పూర్తిచేయడంతోపాటు, రెండో, మూడో విడతల్లో చేపట్టనున్న నిర్మాణాలకు కూడా ముందుగానే భూములను సిద్ధం చేయాలని కలెక్టర్లకు సూచించారు. సచివాలయంలోని తన ఛాంబర్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు, ఆర్డీవోలు, హౌసింగ్ శాఖ అధికారులతో మంత్రి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం, రెండో, మూడో విడతలకు అవసరమైన భూముల గుర్తింపు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు.
పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం
క్యూర్ పరిధిలోని పేదలు నివసిస్తున్న ప్రాంతాలకు సమీపంలోనే ఇళ్లు నిర్మించి అందించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని మంత్రి పొంగులేటి తెలిపారు. నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. పేదవాడికి సొంత ఇంటిని అందించడం కంటే తమ ప్రభుత్వానికి మరే అంశమూ ప్రాధాన్యం కాదని మంత్రి స్పష్టం చేశారు. భూముల గుర్తింపు నుంచి నిర్మాణాల ప్రారంభం వరకు ప్రతి దశలోనూ నిర్దిష్ట కార్యాచరణతో ముందుకు సాగాలని, స్థలాల ఎంపికలో ప్రభుత్వ భూముల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.
క్యూర్ పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణమే లక్ష్యం
క్యూర్ పరిధిలో మొత్తం లక్ష ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు. మొదటి విడతలో ప్రతి నియోజకవర్గంలో సుమారు 500 ఇళ్ల చొప్పున నిర్మాణాలు చేపడుతున్నామని వెల్లడించారు. మొదటి విడతకు సంబంధించి రెండు, మూడు నియోజకవర్గాలకు అవసరమైన స్థలాల గుర్తింపును వేగవంతం చేయాలని, మిగిలిన నియోజకవర్గాల్లో రెండో, మూడో విడతల నిర్మాణాలకు అవసరమైన భూములను కూడా ముందుగానే గుర్తించి సిద్ధంగా ఉంచాలని కలెక్టర్లను ఆదేశించారు. భూముల లభ్యత, స్థలాల అనుకూలత, ఇతర అవసరమైన అంశాలపై అధికారులు నిరంతరం పర్యyక్షించాలని సూచించారు.
డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ఎంపికలో పారదర్శకతకు పెద్దపీట
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. హౌసింగ్ కార్పొరేషన్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి లబ్దిదారుల ఎంపికకు డ్రా నిర్వహించాలని సూచించారు. లబ్దిదారుల వివరాలన్నింటినీ సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేసి ఆన్లైన్ విధానంలో డ్రా నిర్వహించడం ద్వారా ఎంపిక ప్రక్రియలో పారదర్శకతను మరింత పెంచవచ్చని, డ్రా ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేసేలా ఏర్పాట్లు చేయాలని, ప్రత్యక్షంగా వీక్షించలేని వారు కూడా డ్రాకు సంబంధించిన వివరాలను యూట్యూబ్‌లో తమ వివరాలు ఎంపిక జాబితాలో ఉన్నాయో లేదో ఎప్పుడైనా పరిశీలించుకునే అవకాశం ఉంటుందని వివరించారు. సమావేశంలో రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్.లోకేష్ కుమార్, హౌసింగ్ శాఖ కార్యదర్శి వి.పి.గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





