హాస్టళ్లలో నిర్లక్ష్యానికి తావులేదు

– విద్యార్థుల భద్రత, భోజన నాణ్యతపై ప్రత్యేక నిఘా
– కలెక్టర్ల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి పర్యవేక్షణ
– సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి 

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబ్ 19 : సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, నాణ్యమైన ఆహారం, మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు భోజనం నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని, డైట్ అమలు పకడ్బందీగా జరిగేలా నిరంతర పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలని స్పష్టం చేశారు. వసతి గృహాలు, గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలపై జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. ఎస్సీ సంక్షేమ శాఖ పరిధిలోని వసతి గృహాలు, ఎస్సీ గురుకుల విద్యాలయాల సంస్థ టీజీఎస్ డబ్ల్యూఆర్ఐఎస్. ఎస్టీ గురుకుల విద్యాలయాల సంస్థ టీజీఎస్ డబ్ల్యూఆర్ ఈఐఎస్ ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లు, దివ్యాంగుల సంక్షేమ శాఖ పరిధిలోని వసతి సదుపాయాలపై ఉన్నతాధికారులతో సచివాలయంలో శనివారం సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. వసతి గృహాల్లో విద్యార్థులకు అందుతున్న భోజనం, డైట్ చార్జీల వినియోగం, నిత్యావసర సరుకుల సరఫరా, వాటి నాణ్యత, వంటశాలల పరిశుభ్రత, తాగునీటి వసతి, మరుగుదొడ్లు, విద్యుత్, భవనాల నిర్వహణ, బెడ్డింగ్ తదితర మౌలిక వసతులపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న ప్రతి సదుపాయం సక్రమంగా అందుతున్నదా లేదా అన్నది క్షేత్రస్థాయిలో నిర్ధా రించుకునేలా పర్యవేక్షణ వ్యవస్థ ఉండాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో వసతి గృహాలు, గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని, సంబంధిత శాఖల అధికారులు కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని మంత్రి సూచించారు. తనిఖీలు కేవలం రికార్డుల పరిశీలనకే పరిమితం కాకుండా, విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకునేలా ఉండాలని స్పష్టం చేశారు.

ఆహార నాణ్యతపై ప్రత్యేక దృష్టి

విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని మంత్రి స్పష్టం చేశారు. మెనూ, నాణ్యమైన వంటసరుకులు, వంటశాలల్లో పరిశుభ్రత పాటిస్తున్నారా? అనే అంశాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. నిత్యావసర సరుకుల కొనుగోలు, సరఫరా, నిల్వ, వినియోగ ప్రక్రియలను పర్యవే క్షించాలన్నారు.. నాణ్యతలో లోపాలు గుర్తించిన వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని, అనారోగ్యానికి గురయ్యే వారికి తక్షణ వైద్య సహాయం అందేలా సమీపం లోని ప్రభుత్వ వైద్య కేంద్రాలతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.

భద్రతపై ప్రత్యేక పర్యవేక్షణ

వసతి గృహాల్లో విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి సూచించారు. భవనాల స్థితిగతులు, విద్యుత్ వైరింగ్, అగ్నిమాపక భద్రత, తాగునీటి వసతులు, మరుగుదొడ్లు, వంటశాలలు తదితర అంశాలను క్రమం తప్పకుండా పరిశీలించాలని ఆదేశించారు. విద్యార్థుల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే నమోదు చేసి, వాటి పరిష్కా రానికి స్పష్టమైన బాధ్యతను అధికారులకు అప్పగించాలని సూచించారు.
సమావేశంలో దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యదర్శి శృతి ఓజా, ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్ (ఎఫ్ఎసీ) శ్రీధర్, టీజీ టీడబ్ల్యూఆర్ ఈఐఎస్ కార్యదర్శి సీతాలక్షి, టీజీఎస్ డబ్ల్యూఆ ఈఐఎస్ కార్యదర్శి (ఎస్ఏఏసీ) కంభంపాటి శారద, ఎస్సీ అభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *