– 12 అంశాలలో ఇప్పటికే రెండింటికి జీవో జారీ
– మరికొన్ని అంశాలపై తీపి కబురు
– రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19 : భూ సమస్యల పరిష్కారానికి శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన మేరకు త్వరలో ప్రజలకు తీపికబురు అందుతుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. దీనిలో భాగంగా అసెంబ్లీలో ప్రకటించిన 12 అంశాలపై దృష్టి సారించి దశల వారీగా వాటిని నెరవేరుస్తున్నామని, ఈ మేరకు కాలనీల సమస్యపై జీవో 118, సింగరేణి ప్రాంతంలో ఇళ్ల స్దలాల రెగ్యులరైజేషన్కు సంబంధించిన జీవో 76ను విడుదల చేశామని చెప్పారు. ఎల్.బి.నగర్ నియోజకవర్గంలోని 44 కాలనీల్లో ఇళ్ల క్రమబద్దీకరణకు సంబంధించి సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో ధ్రువ పత్రాలను సహచర మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి పొంగులేటి లబ్దిదారులకు శనివారం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భూ సమస్యలపై ఇటీవల శాసనసభలో సుదీర్ఘంగా చెప్పామని గుర్తు చేశారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ పార్టీ వారు ప్రాతినిధ్యం వహిస్తున్నా తాము భేషజాలకు పోకుండా ఇక్కడి 44 కాలనీల సమస్యలపై కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. గత ప్రభుత్వం నుంచి నిషేధిత ఉత్తర్వులున్నా ఇప్పుడు వాటిని నెలలోగా పరిష్కరించి ఇళ్లను రెగ్యులరైజ్ చేస్తామని, ఎవరి ఇళ్లు కూల్చదని స్పష్టం చేశారు. జీవో 118 సహకారంతో మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలోని మరికొంతమందికి కూడా నెలలోగా సమస్య పరిష్కరిస్తామని ప్రకటించారు. ఈ ప్రాంత కాలనీలు చాలాకాలంగా 22ఎలో ఉన్నాయని వివరిస్తూ మరో వారం రోజుల్లో సమస్య పరిష్కరించే విధంగా ప్రభుత్వ ఆదేశాలు రానున్నాయని తెలిపారు. ఈ ప్రాంతంలో రిజిస్ట్రేషన్ సమస్య, దరఖాస్తు చేసుకోని వారి సమస్యను పరిష్కరించేందుకు ఈ వేదికగా ఆదేశాలు ఇస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎల్.బి.నగర్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేలు డి.సుధీర్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎల్.బి.నగర్ ఇన్చార్జి మధు యాష్కీ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
సింగరేణి కార్మికుల నిరీక్షణకు త్వరలో ముగింపు
సింగరేణి కుటుంబాలు దశాబ్దాలుగా నివసిస్తున్న తమ ఇళ్ల స్థలాలపై హక్కు పత్రాల కోసం నిరీక్షిస్తున్నాయని, వారి సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలికేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి పొంగులేటి తెలిపారు. అర్హులైన కుటుంబాలకు హక్కు కల్పించే ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని చెప్పారు. సింగరేణి కార్మికుల ఇండ్ల స్థలాల సమస్యపై సచివాలయంలో అధికారులతో శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమయంలో జారీ చేసిన జీవో 76ను పరిగణనలోకి తీసుకుని భూముల స్వభావం, ప్రభుత్వ/సింగరేణి హక్కులు, ప్రస్తుత నివాస పరిస్థితులు, చట్టపరమైన అంశాలను పరిశీలించి సమస్యను పరిష్కరిస్తున్నామని చెప్పారు. సింగరేణి బొగ్గు బెల్ట్ పరిధిలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, కొమురం భీమ్ ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను హైకోర్టు ఆదేశాలకు లోబడి 45 రోజుల్లోపు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ దరఖాస్తుల పరిశీలన, పరిష్కారం కోసం ప్రతి జిల్లాలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. జిల్లా కలెక్టర్ చైర్మన్గా, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ప్రతినిధి, జిల్లా రిజిస్ట్రార్ సభ్యులుగా ఈ కమిటీలు పనిచేస్తాయని తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





