పర్యాటకానికి ప్రత్యేక గుర్తింపు తేవాలి

– ఏఐ, డిజిటల్ టెక్నాలజీతో టూరిజం రంగానికి కొత్త ఊపు
– పీపీపీ విధానంలో మౌలిక వసతులు, పెట్టుబడుల ప్రోత్సాహం:
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26 : తెలంగాణ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు డిజిటల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లను విస్తృతంగా వినియోగించుకోవాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ప్రకృతి, చారిత్రక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంపదకు నిలయమైన తెలంగాణను ప్రపంచ పర్యాటక పటంలో అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని స్పష్టం చేశారు. డిజిటల్ అజెండా-ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పర్యాటక రంగానికి కొత్త రూపు అనే ఇతివృత్తంతో ప్రపంచ పర్యాటక దినోత్సవం-2026 వేడుకలు శిల్పారామంలో శనివారం ఘనంగా జరిగాయి. వేడుకలకు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ ఏడాది పర్యాటక దినోత్సవ ఇతివృత్తమైన డిజిటల్ అజెండా-ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పర్యాటక రంగానికి కొత్త రూపు ప్రాధాన్యతను భట్టి విక్రమార్క వివరిస్తూ ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా మన పర్యాటక రంగాన్ని పునర్నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర పర్యాటకాన్ని గ్లోబల్ వేదికపై ఆవిష్కరించే నూతన వెబ్‌సైట్‌ను, అద్భుత చిత్రాలతో రూపొందించిన కాఫీ టేబుల్ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. రాష్ట్రంలో హెల్త్, ఆలయ, గ్రామీణ, ప్రకృతి పర్యాటక రంగాలకు అపారమైన అవకాశాలున్నాయని తెలిపారు. వికారాబాద్‌లో వెల్‌నెస్ కేంద్రాల ఏర్పాటు పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు. టైగర్ రిజర్వులు, అడవులు, జలపాతాలు, ప్రాచీన ఆలయాలు, నగరంలోని చారిత్రక కట్టడాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయని, ప్రశాంతతను కోరుకునే వారికి తెలంగాణ సరైన వేదిక అని పేర్కొన్నారు. వీటిని అంతర్జాతీయంగా సరైన రీతిలో మార్కెటింగ్ చేయాలని అధికారులకు సూచించారు.

పీపీపీ విధానంలో ప్రాజెక్టులు, బడ్జెట్ పెంపు

గతంతో పోలిస్తే ఈసారి పర్యాటక రంగానికి బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. సందర్శకుల భద్రత, నాణ్యమైన వసతులకు తమ పాలసీలో పెద్దపీట వేసినట్లు చెప్పారు. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో అంతర్జాతీయ స్థాయి హోటళ్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించి పెట్టుబడులను భారీగా ఆకర్షించాలని స్పష్టం చేశారు. వారంలో ఐదు రోజులు తీవ్ర ఒత్తిడితో పనిచేసే హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను పర్యాటకం వైపు మళ్లించేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఇందుకోసం పర్యాటక శాఖ మంత్రి, కార్యదర్శి కలిసి ప్రముఖ ఐటీ కంపెనీల సీఈవోలు, పర్యాటక ప్రాజెక్టుల నిర్వాహకులతో త్వరలోనే సమావేశం కావాలని ఆదేశించారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు టూరిజం కూపన్లు అందించి వారాంతాల్లో ప్రకృతి ప్రాంతాలను సందర్శించేలా ప్రోత్సహించాలని సూచించారు. పర్యాటక శాఖ చేపడుతున్న నూతన కార్యక్రమాలను అభినందిసూ రాష్ట్ర పర్యాటక కీర్తి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాలని ఆకాంక్షించారు.

నూతన కార్యక్రమాలకు శ్రీకారం

పునర్ రూపకల్పన(రీడిజైన్) చేసిన తెలంగాణ టూరిజం వెబ్‌సైట్, ఆన్‌లైన్ హోమ్‌స్టే రిజిస్ట్రేషన్ విధానం, కొత్త టూరిజం ట్రైలర్లు, ఇంటరాక్టివ్ ఏఆర్/వీఆర్ ఆధారిత లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, తెలంగాణ పర్యాటక ప్రాంతాలపై కాఫీ టేబుల్ బుక్, మై తెలంగాణ, మై స్టోరీ, మై డెస్టినేషన్ అంశంపై వీడియో/పోస్టర్, ఎకో టూరిజంపై వీడియోను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి సమక్షంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సూపరింటెండెంట్ నిఖిల్ దాస్, పర్యాటక శాఖ స్పెషల్ సీఎస్ వాణిప్రసాద్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ పురావస్తు శాఖ మధ్య అవగాహన ఒప్పందం(ఎంవోయÖ) కుదుర్చుకున్నారు. ‘ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ అండ్ డిజిటల్ టెక్నాలజీ -ది ఫ్యూచర్ ఆఫ్ టూరిజం’, ఎకో టూరిజం, ఫిల్మ్ టూరిజం, స్పోర్ట్స్ టూరిజం, హెరిటేజ్ టూరిజం తదితర రంగాల్లో వస్తున్న మార్పులు, అవకాశాలపై ప్యానెల్ చర్చ జరిగింది. ఈ సదస్సులో యువ టూరిజం క్లబ్‌ల విద్యార్థులు, టూరిస్ట్ పోలీస్, తెలంగాణ దర్శిని, శిక్షణ పొందిన గైడ్స్, హోమ్‌స్టేపై పలువురు తమ అనుభవాలను పంచుకున్నారు. తర్వాత ఎక్సలెన్స్ అవార్డులు, సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ వేడుకల్లో పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ గౌతమి, పర్యాటక శాఖ డైరెక్టర్ లక్ష్మణ్ రంజిత్ నాయక్, టీజీఏ డైరెక్టర్ లక్ష్మి, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డి, నిథమ్ డైరెక్టర్ వెంకటరమణ, సాహిత్య అకాడమీ సెక్రటరీ బాలాచారి, సినీ నటులు తిరువరూర్, ఫరియా అబ్దుల్లా, తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *