ప్రతి పంచాయతీకి సొంత భవనం

– రూ.1000 కోట్లతో 5,118 భవనాల నిర్మాణం
– 8,000 గ్రామాల్లో మహిళా ప్రాంగణాలు
– తొలిసారిగా గ్రామీణ ప్రాంతాల్లో ‘హ్యామ్’ రోడ్ల ప్రాజెక్టు
– డ్రింకింగ్ వాటర్ మేనేజ్‌మెంట్ కమిటీలు ఏర్పాటు చేయాలి
– పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క

రంగారెడ్డి, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 26 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీకి సొంత భవనం ఉండేలా నిర్మాణ పనులు చేపడుతున్నామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ (సీతక్క) తెలిపారు.  రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో శనివారం జ‌రిగిన‌ ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల ప్రాంతీయ సమీక్షా సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని అభివృద్ధి పనులపై సుదీర్ఘంగా సమీక్షించారు. రాష్ట్రంలో సొంత భవనాలు లేని 5,118 గ్రామ పంచాయతీలకు రూ.1,000 కోట్ల నిధులు మంజూరు చేశామ‌ని, వీటిలో ఇప్పటికే 3,269 భవనాల నిర్మాణాలు 70 శాతం పూర్తి కావచ్చాయ‌ని తెలిపారు. మిగిలిన భవనాలను కూడా ఈ ఏడాది చివరి నాటికి పూర్తిచేసి ప్రతి గ్రామానికి ఒక సొంత భవనాన్ని అందుబాటులోకి తెస్తామ‌న్నారు. మహిళలు తమ ఆర్థిక, సామాజిక కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించుకోవడానికి వీలుగా 8,000 గ్రామాల్లో రూ.800 కోట్ల అంచనా వ్యయంతో మహిళా సంఘాల భవనాలను నిర్మిస్తున్నామ‌ని, ఈ పనులు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయ‌ని మంత్రి చెప్పారు.

‘హ్యామ్’ విధానంలో గ్రామీణ రహదారులు

దేశంలోనే తొలిసారిగా గ్రామీణ రహదారుల నిర్మాణానికి హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ విధానాన్ని అమలు చేస్తున్నామ‌న్నారు. మొదటి విడతలో నాలుగు జిల్లాల్లో 3,861 కిలోమీటర్ల మేర రహదారుల కోసం రూ.3,382 కోట్లు వెచ్చిస్తున్నామ‌ని, అక్టోబర్ నుంచి జూన్ వరకు పనులకు అనువైన సమయం కాబట్టి నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత వ్యవధిలోగా రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు.

వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు ప్రణాళిక

ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని వచ్చే వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా ఇప్పటినుంచే అప్రమత్తంగా ఉండాలన్నారు. సింగూరు రిజర్వాయర్‌లో నీటి మట్టం తగ్గినందున ప్రత్యేక అధికారిని నియమించి నిజాంసాగర్ నుంచి నీటిని తరలించే చర్యలను వేగవంతం చేయాలన్నారు. నీటి నిర్వహణ, లభ్యతపై పర్యవేక్షణకు ప్రతి మండలానికి ముగ్గురు సభ్యులతో డ్రింకింగ్ వాటర్ మేనేజ్‌మెంట్ కమిటీ ఏర్పాటు చేయాల‌ని సూచించారు. గిరిజన, ఆదివాసీ, చెంచు పెంట ప్రాంతాల్లో తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాల‌ని అధికారుల‌ను మంత్రి ఆదేశించారు.

రూ.6,000 కోట్లతో ఉపాధి హామీ – జలసిరి పనులు

వర్షాభావ పరిస్థితుల కారణంగా వ్యవసాయ పనులు తగ్గే అవకాశం ఉన్నందున అర్హులైన ప్రతి కుటుంబానికి ఉపాధి హామీ పనులు కల్పించాల‌ని,  అందుబాటులో ఉన్న రూ.6,000 కోట్ల బడ్జెట్‌ను వినియోగించి గ్రామాల్లో శాశ్వత ఆస్తులు, మౌలిక వసతులు, ‘జలసిరి’ కింద నీటి సంరక్షణ పనులను వేగవంతం చేయాల‌ని మంత్రి ఆదేశించారు.

బాధ్యతారాహిత్యంగా వ్య‌వ‌హ‌రిస్తే కఠిన చర్యలు

అభివృద్ధి పనులలో అధికారులు, కాంట్రాక్టర్లు చిత్తశుద్ధితో వ్యవహరించాలన్నారు. పనుల నాణ్యతలో రాజీ పడితే సహించేది లేదని, విధుల పట్ల నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని మంత్రి సీత‌క్క హెచ్చ‌రించారు. అద్భుతమైన పనితీరు కనబరిచే అధికారులను ప్రభుత్వం గౌరవించి సన్మానిస్తుందని స్ప‌ష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *