‘బతుకమ్మ’ను ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు

– అధికారులు, సర్పంచ్‌లు సమన్వయంతో ముందస్తు ఏర్పాట్లు చేయాలి
– పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 8 : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా, ఆనందంగా, సురక్షితంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. బతుకమ్మ పండుగ సందర్భంగా గ్రామాల్లో పారిశుధ్యం, విద్యుత్, రహదారులు, తాగునీరు, భద్రత తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సౌత్ ఆఫ్రికా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో దక్షిణాఫ్రికాలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా బతుకమ్మ పండుగ విశిష్టతను, తెలంగాణ సంస్కృతితో దానికి ఉన్న అనుబంధాన్ని వీడియో సందేశంలో వివరించారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో తెలంగాణ బిడ్డలు బతుకమ్మను ఘనంగా జరుపుకోవడం గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ పూల పండుగ బతుకమ్మ సందర్భంగా రాష్ట్రంలోని ఆడబిడ్డలందరికీ ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, ప్రకృతిని, పూలను, ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని కలిపి జరుపుకునే ప్రత్యేకమైన పండుగ అని పేర్కొన్నారు. బతుకమ్మ అంటే పూల పండుగ మాత్రమే కాదు.. తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక. మన సంస్కృతి, మన సంప్రదాయం, మన ప్రకృతితో ముడిపడిన పండుగ.. ప్రతి ఆడబిడ్డ ఆనందంగా.. ప్రతి కుటుంబం సంతోషంగా.. ప్రతి గ్రామం సురక్షితంగా బతుకమ్మ జరుపుకునేలా ప్రజా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది’ అని మంత్రి సీతక్క తెలిపారు. బతుకమ్మ పండుగ రోజుల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని గ్రామాల్లో ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. పంచాయతీ సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, జిల్లా పంచాయతీ అధికారులు, కలెక్టర్లు సమన్వయంతో పనిచేసి పండగకు ముందే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. బతుకమ్మ ఆడే ప్రదేశాలు, చెరువులు, కుంటలు, ఘాట్‌ల పరిసరాల్లో చెత్తాచెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. ప్రజలకు సౌకర్యవంతమైన రాకపోకలు ఉండేలా అవసరమైనచోట్ల రోడ్ల మరమ్మతులు చేపట్టాలని, వీబీజీ రామ్ జీ పథకం కింద మట్టి రోడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బతుకమ్మ వేదికలను ముందుగానే శుభ్రం చేసి సిద్ధం చేయాలని, అవసరమైనచోట్ల విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. వేడుకల్లో పాల్గొనే మహిళలు, వృద్ధులు, చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అవసరమైనచోట్ల మెట్లు, ర్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ సంస్కృతి 

తెలంగాణలో పుట్టిన బతుకమ్మ పండుగ నేడు ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ఆడబిడ్డల ఐక్యతకు, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తోందని మంత్రి సీతక్క అన్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్, మధ్యప్రాచ్యం, దక్షిణాఫ్రికా తదితర దేశాల్లో తెలంగాణ ప్రజలు బతుకమ్మను జరుపుకోవడం మన సంస్కృతి గొప్పతనానికి నిదర్శనమని పేర్కొన్నారు. ‘ఎక్కడ ఉన్నా తెలంగాణ బిడ్డల గుండెల్లో బతుకమ్మ ఉంటుంది.. పూలను పేర్చి బతుకమ్మను నిలబెట్టినట్టే మన సంస్కృతి, సంప్రదాయాలను కూడా తరతరాలకు నిలబెట్టుకోవాలి.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఆడబిడ్డలంతా ఐక్యంగా, ఆనందంగా బతుకమ్మను జరుపుకోవాలి’ అని అన్నారు. పూల పండుగ బతుకమ్మ ప్రతి ఇంటా ఆనందాన్ని, ప్రతి కుటుంబంలో సంతోషాన్ని, ప్రతి గ్రామంలో ఐక్యతను నింపాలని మంత్రి సీతక్క ఆకాంక్షిస్తూ మహిళలందరికీ ముందస్తు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *