నా వ్యాఖ్యలు స్పీకర్‌ను ఉద్దేశించి చేసినవి కావు

– శాసనసభ ఘటనపై తాతా మధు వివరణ

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 7: ‌ శాసనసభ బడ్జెట్‌ ‌సమావేశాల సందర్భంగా సోమవారం చోటుచేసుకున్న పరిణామాలపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధు వివరణ ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించి తాను మాట్లాడని మాటలను తనకు ఆపాదిస్తున్నారని పేర్కొంటూ ఈ విషయంపై తన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక కీలక ప్రకటన చేశారు. శాసనసభలోకి వెళ్లే సమయంలో మహిళా శాసనసభ్యులతో పాటు తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో తోపులాట, ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఈ క్రమంలో తనపై కూడా దాడి జరిగిందని, తన షర్టు, ఫ్యాంటు లాగేందుకు, గొంతు నొక్కేందుకు ప్రయత్నించినట్లు అనిపించిందని పేర్కొన్నారు. కొంతమంది తనను దుర్భాషలాడినట్లు తెలిపారు. ఈ పరిణామాలతో తీవ్ర ఆవేదనకు గురై తనపై దాడి చేసింది ఎవరు.. తన షర్టు లాగేందుకు ఎవరు ప్రయత్నించారు.. అలా చేయమని ఎవరు ఆదేశించారు అంటూ తాను ప్రశ్నించాన‌న్నారు. అయితే ఈ వ్యాఖ్యలను స్పీకర్‌ను ఉద్దేశించి చేసినవిగా భావించడం సరికాదని స్పష్టం చేశారు. స్పీకర్‌ ‌వ్యవస్థ పట్ల, వ్యక్తిగతంగా స్పీకర్‌ ‌పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని మధు చెప్పారు. స్పీకర్‌ను ఉద్దేశించి తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఒకవేళ తన వ్యాఖ్యల్లో ఏదైనా స్పీకర్‌ను ఉద్దేశించినట్లు భావిస్తే ఆ మాటలను ఉపసంహరించుకుంటున్నానని, అందుకు విచారం వ్యక్తం చేస్తున్నానని అన్నారు. శాసనసభలోకి వచ్చే సమయంలో తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యంగా మహిళా శాసనసభ్యులతో పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆయ‌న‌ ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా శాసనసభ్యులతో తోపులాట జరిగిందని, వారి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా తమ సీనియర్‌ ‌నాయకులను పోలీసులు అక్కడి నుంచి తీసుకెళ్లారని తెలిపారు. ప్రజాప్రతినిధులతో వ్యవహరించే విషయంలో ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. శాసనసభ్యులపై జరిగినట్లు పేర్కొన్న పరిణామాలపై ప్రభుత్వం స్పందించాలని మధు డిమాండ్‌ ‌చేశారు. ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి రేవంత్‌ ‌రెడ్డి ఈ ఘటనపై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తాను మాట్లాడిన వ్యాఖ్యలపై ఏర్పడిన వివాదం కంటే శాసనసభలో చోటుచేసుకున్న అసలు పరిణామాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని మధు వ్యాఖ్యానించారు. ప్రజాప్రతినిధుల పట్ల జరిగిన ఘటనలపై సమగ్రంగా పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *