– విద్యుత్ డిమాండ్ 20,018 మెగావాట్లకు పెరుగుదల
– నీటి సంరక్షణే కీలకం.. తాగునీటికి ప్రాధాన్యమివ్వాలి
– భూగర్భ జలాలు లేని చోట్ల వ్యవసాయ మోటార్లు ఆన్ చేయొద్దు
– గ్రామీణ ఉపాధి కోసం 17 లక్షలకుపైగా పనుల గుర్తింపు
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 24 : ప్రకృతి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో ప్రభుత్వంపై విమర్శలు చేయడం కాదు.. ప్రజలకు అండగా నిలవడమే రాజకీయ పార్టీల బాధ్యత కావాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. కరోనా సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపులకు స్పందించి ప్రజలు చప్పట్లు కొట్టడం, గంటలు మోగించడం, దీపాలు వెలిగించడం ద్వారా ప్రభుత్వాలకు మద్దతుగా నిలిచారని గుర్తు చేశారు. ఇప్పుడు ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రం వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్న వేళ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు చేయడం విచారకరమని వ్యాఖ్యానించారు. ప్రజలకు మేలు చేసే సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన ప్రతిపక్షాలు విమర్శలకే పరిమితం కావడం సమంజసం కాదని హితవు పలికారు. సూపర్ ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో అందుబాటులో ఉన్న నీటిని ప్రతి ఒక్కరూ పొదుపుగా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాబోయే నెలల్లో తాగునీటి అవసరాలకు ఇబ్బందులు తలెత్తకుండా చెరువులు, కుంటలు, జలాశయాల్లో మిగిలి ఉన్న నీటిని జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. నీటి కొరత వ్యవసాయంతోపాటు విద్యుత్ రంగంపైనా తీవ్ర ప్రభావం చూపుతోందని, పెరిగిన విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి, ప్రసారం, పంపిణీ వ్యవస్థలను నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలం కొదుమూరులో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
విద్యుత్ డిమాండ్ 20,018 మెగావాట్లకు..
రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిందని భట్టి విక్రమార్క తెలిపారు. 2014లో రాష్ట్ర విభజన సమయంలో గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 6,648 మెగావాట్లు ఉండగా, ప్రస్తుతం 20,018 మెగావాట్లకు చేరిందని వివరించారు. 2023లో 15,497 మెగావాట్లుగా ఉన్న గరిష్ఠ డిమాండ్ 2025లో 17,162 మెగావాట్లకు పెరిగిందని, ప్రస్తుతం మరింత అధిక స్థాయికి చేరిందని చెప్పారు. సాధారణంగా విద్యుత్ డిమాండ్ ఏటా 6 నుంచి 6.5 శాతం పెరుగుతుండగా, ఈ ఏడాది అక్టోబర్‌లో దాదాపు 25 శాతం పెరుగుదల నమోదైందన్నారు. గత ఏడాది అక్టోబర్‌లో రోజువారీ విద్యుత్ వినియోగం 245.35 మిలియన్ యూనిట్లు ఉండగా ఈ ఏడాది అక్టోబర్‌లో 335.05 మిలియన్ యూనిట్లకు చేరిందని తెలిపారు. ఇది సుమారు 37 శాతం పెరుగుదల అని వివరించారు. అక్టోబర్‌కు సంబంధించిన మరో విద్యుత్ వినియోగ గణాంకంలో 5,108 నుంచి 9,577కు పెరుగుదల నమోదైందని, ఇది 87.50 శాతమని పేర్కొన్నారు. ఎండల తీవ్రతతో ఇళ్లలో విద్యుత్ వినియోగం పెరగడంతోపాటు వ్యవసాయ పంపుసెట్లు, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల అవసరాలు పెరుగుతున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తి పెంచడం ఒకవైపు, ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను అంతరాయం లేకుండా ప్రజలకు చేరవేయడం మరోవైపు కీలకమని వివరించారు.
విద్యుత్ మౌలిక సదుపాయాల విస్తరణ
పెరిగిన విద్యుత్ డిమాండ్‌ను తట్టుకునేందుకు ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో విద్యుత్ మౌలిక సదుపాయాలను విస్తరిస్తోందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ పరిధిలో కొత్త సబ్స్టేషన్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చామని, వాటిలో ఇప్పటికే 177 సబ్స్టేషన్ల నిర్మాణం పూర్తయిందని చెప్పారు. మరో 267 నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని వివరించారు. ట్రాన్స్‌కో పరిధిలో 24 సబ్స్టేషన్లకు అనుమతులు ఇవ్వగా 11 సబ్స్టేషన్ల నిర్మాణం పూర్తయిందని, మరో తొమ్మిదింటి పనులు నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. 400/220 కేవీ, 220/132 కేవీ, 132/33 కేవీ స్థాయిల్లో విద్యుత్ ప్రసార మౌలిక సదుపాయాలను విస్తరించడం వల్ల అధిక డిమాండ్ ఉన్నప్పటికీ సరఫరా వ్యవస్థను నిర్వహించగలుగుతున్నామని పేర్కొన్నారు.
నీటి కొరతతో జలవిద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం
ఎల్‌నినో కారణంగా విద్యుత్ డిమాండ్ పెరుగుతుండటంతోపాటు జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గడం వల్ల జలవిద్యుత్ ఉత్పత్తి కూడా తగ్గుతోందని భట్టి విక్రమార్క తెలిపారు. సాధారణంగా రాత్రి వేళల్లో గరిష్ఠ డిమాండ్‌ను తట్టుకునేందుకు అందుబాటులో ఉండే సుమారు 3,500 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తి నీటి కొరతతో ప్రభావితమవుతోందని చెప్పారు. ఒకవైపు 4,000 నుంచి 5,000 మెగావాట్ల మేర అదనపు డిమాండ్ పెరుగుతుండగా, మరోవైపు జలవిద్యుత్ ఉత్పత్తి తగ్గడం విద్యుత్ రంగానికి సవాలుగా మారిందన్నారు. అయినప్పటికీ ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రభుత్వం, విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలపై ఒత్తిడి పెరుగుతున్నందున ప్రజలు కూడా అవసరమైన మేరకే విద్యుత్‌ను వినియోగించాలని కోరారు.
15 లక్షల పంపుసెట్లకు భూగర్భ జలాల కొరత
రాష్ట్రంలో సుమారు 30 లక్షల వ్యవసాయ పంపుసెట్లు ఉండగా వాటిలో దాదాపు 15 లక్షల పంపుసెట్ల పరిధిలో భూగర్భ జలాల కొరత ఏర్పడిందని ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు. బోర్లలో నీరు లేకపోయినా మోటార్లు ఆన్ చేయడం వల్ల అవి కాలిపోవడమే కాకుండా విద్యుత్ లోడ్ పెరిగి ట్రాన్స్‌ఫార్మర్లపైనా ప్రభావం పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. భూగర్భ జలాలు అందుబాటులో లేని ప్రాంతాల్లో రైతులు వ్యవసాయ మోటార్లను ఆన్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఇది విద్యుత్ సరఫరాలో నాణ్యతా లోపం వల్ల తలెత్తే సమస్య కాదని, నీరు లేకుండా మోటార్లు నడపడానికి ప్రయత్నించడం వల్ల ఏర్పడే నష్టమని స్పష్టం చేశారు.
తాగునీటి అవసరాలకే ప్రాధాన్యం ఇవ్వాలి
ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గాయని భట్టి విక్రమార్క తెలిపారు. మొత్తం 470.22 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి సంబంధించి ప్రస్తుతం 178.60 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 44,034 చెరువుల్లో దాదాపు 40 శాతం చెరువుల్లో పావు వంతు కంటే తక్కువ నీరు ఉందని చెప్పారు. వర్షాలు లేకపోవడం, ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో ఉన్న నీరు ఆవిరైపోయే ప్రమాదం ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో ఉన్న నీటిని విచ్చలవిడిగా వినియోగించకుండా తాగునీటి అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మనుషులతోపాటు పశువులు, పక్షులు, వన్యప్రాణుల అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని నీటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. రాష్ట్రంలో సుమారు 53 లక్షల కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, ఇందుకోసం డిస్కంలకు ఏటా సుమారు రూ.5,000 కోట్లు చెల్లిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ పంపుసెట్లకు ఉచిత విద్యుత్ సరఫరా కోసం ఏటా సుమారు రూ.14,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు.
ప్రజలకు అండగా గ్రామీణ ఉపాధి పనులు
ఎల్‌నినోతో వ్యవసాయ పనులు తగ్గే పరిస్థితి ఏర్పడితే గ్రామీణ కూలీలు, రైతులకు ఉపాధి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోందని భట్టి తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద ఇప్పటికే 9.1 లక్షల పనులను గుర్తించామని, అదనంగా మరో ఎనిమిది లక్షల పనులను గుర్తించేలా చర్యలు చేపట్టామని చెప్పారు. వ్యవసాయ కుంటలు, ఇంకుడు గుంతలు, సోక్ పిట్లు, బోర్ల రీచార్జి పనులు, పశువుల షెడ్లు, కోళ్ల షెడ్లు, నర్సరీలు, ఉద్యానవన ఆస్తుల అభివృద్ధి, నీటి తొట్లు, గ్రామీణ రహదారుల నిర్మాణం, చెరువులు, కాల్వలకు సంబంధించిన పనులను విస్తృతంగా చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు నిరంతరం ఉపాధి లభించేలా అవసరమైన పనులను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఉపాధి హామీ పథకానికి కేంద్రం నుంచి ప్రస్తుతం 60:40 నిష్పత్తిలో నిధులు అందుతున్నప్పటికీ రాష్ట్ర వాటాగా చెల్లించాల్సిన నిధులను సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు నీటి సంరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని భరోసా ఇచ్చారు.
విపత్తును ఎదుర్కొనేందుకు సమష్టి కృషి అవసరం
సూపర్ ఎల్‌నినో ప్రభావం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారని భట్టి విక్రమార్క తెలిపారు. శాస్త్రీయ సమాచారాన్ని అర్థం చేసుకొని ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు సమష్టిగా పనిచేయాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులతో సమీక్ష నిర్వహించి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారని చెప్పారు. కరోనా సమయంలో మాదిరిగానే విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాజకీయాలకతీతంగా సహకరించాలని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. నీరు, విద్యుత్ వంటి కీలక వనరులను పొదుపుగా వినియోగిస్తూ, రైతులు, కూలీలు, గ్రామీణ ప్రజల జీవనోపాధిని కాపాడేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





