హైదరాబాద్‌ను రక్షణ రంగ హబ్‌గా తీర్చిదిద్దుతాం

– ‘రక్షా ఎక్స్‌పో’ కర్టెన్‌రైజర్ కార్యక్రమంలో సీఎం రేవంత్
– త్వరలోనే ‘ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 2.0’ విడుదల

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 24: భారతదేశాన్ని రక్షణ రంగంలో ప్రపంచ స్థాయి అగ్రగామిగా, స్వయంసమృద్ధి సాధించిన దేశంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తోందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రక్షణ రంగానికి చెందిన భాగస్వాములందరితో కలిసి చర్చించేందుకు ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన రక్షా ఎక్స్‌పో – కర్టెన్ రైజర్ శనివారంనాటి కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరుకావాల్సిందిగా పారిశ్రామిక దిగ్గజాలను ఆయన ఆహ్వానించారు. గతేడాది నిర్వహించిన మొదటి సదస్సు విజయవంతం కాగా రెండో సదస్సును మరింత భారీ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

వ్యూహాత్మక కేంద్రంగా భాగ్యనగరం

దేశంలో హైదరాబాద్ అత్యంత సురక్షితమైన నగరంగా ఉండటంతోపాటు అనేక ప్రముఖ పరిశోధనా సంస్థలు, భారత సైన్యం, వైమానిక దళాలకు సంబంధించిన స్ట్రాటజిక్ కేంద్రాలకు నిలయంగా ఉందని సీఎం గుర్తు చేశారు. దక్షిణ భారతదేశంలో సముద్రతీరం లేకపోయినప్పటికీ వికారాబాద్ జిల్లా దామగుండం రిజర్వ్ ఫారెస్టులో నౌకా దళానికి అత్యంత కీలకమైన వెరీ లో ఫ్రీక్వెన్సీ రాడార్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సదస్సుకు డీఆర్‌డీఓ, హెచ్‌ఏఎల్, బీడీఎల్, మిధాని, టాటా సంస్థలు, ఎయిర్‌బస్, సాఫ్రాన్, స్కైరూట్, లాక్‌హీడ్ మార్టిన్, భారత్ ఫోర్జ్ వంటి దిగ్గజ సంస్థల ప్రతినిధులు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్‌బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్, రక్షణరంగ నిపుణులు, భారత సాయుధ దళాల అధికారులు, కేంద్ర ప్రభుత్వ అధికారులు, వివిధ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.

యువతకు నైపుణ్యాలు – అగ్రగామిగా తెలంగాణ

రక్షణ, స్పేస్, ఏరోస్పేస్ రంగాలకు కావలసిన నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేసేందుకు రాష్ట్రంలో ఐఐటీ, ఐఐఐటీ, ఎనఐటీ, ఐఎస్‌బీ వంటి సంస్థలతో పాటు ప్రతిష్ఠాత్మకంగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని నిర్మిస్తున్నామని, ఐటీఐలను అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్లుగా తీర్చిదిద్దామని తెలిపారు.

తెలంగాణ రైజింగ్ విజన్ 2047 లక్ష్యాలు

2034 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా మార్చడం, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చడం, దేశ జీడీపీలో తెలంగాణ వాటాను ప్రస్తుతం ఉన్న 5 శాతం నుండి 10 శాతానికి పెంచడం తెలంగాణ రైజింగ్ విజన్ 2047 లక్ష్యాలుగా వివరించారు. ఈ లక్ష్యాలను సాధించడంలో భాగంగా త్వరలోనే నూతన ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 2.0ను విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
రాష్ట్రంలో పాలసీ పెరాలసిస్ లేదని, రాజకీయంగా భేదాభిప్రాయాలు ఉన్నా పెట్టుబడులు, అభివృద్ధి విషయంలో అందరం ఒక్కటేనని భరోసా ఇచ్చారు. రక్షణ ఉత్పత్తుల తయారీ రంగంలో తెలంగాణను దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు పారిశ్రామిక వర్గాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *