డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న కాంగ్రెస్

– దేవాదుల నుంచి నీరెందుకు ఎత్తలేదు?
– వరంగల్ జిల్లాకు కావాలనే కరువు రుద్దారు
– మనకే క్రాప్ హాలిడే ఎందుకు?
– తమ్మిడిహెట్టి దగ్గర అవసరమైన నీళ్లు లేవన్న సీడ‌బ్ల్యూసీ
– మేడిగడ్డ నుంచి అన్ని అనుమతులున్నాయి
– కాంగ్రెస్ పై హరీష్ రావు  విమర్శల దాడి

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 26 : డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కాంగ్రెస్ కు అలవాటుగా మారిందని బీఆర్ఎస్ ఎల్ పి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు విమర్శించారు. తెలంగాణ భవన్ లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పట్టిసీమ మోటార్ల ద్వారా చంద్రబాబు నీళ్లు ఎత్తితే దేవాదుల నుంచి ఎందుకు నీళ్లు ఎత్తలేదని ప్రశ్నించారు. చిత్తశుద్ది ఉంటే దేవాదుల నుంచి మోటార్లు ఎన్ని రోజులు, ఎన్ని గంటలు నడిచాయో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ‌రంగల్ జిల్లా ప్రజలకు కరువు రుద్దింద దేవాదుల నడిపి ఉంటే కరీంనగర్ కొంత భాగం, వరంగల్ జిల్లా సస్యశ్యామలం అయ్యేది. కల్వకుర్తిలో ఎన్ని రోజులు నడిపారు? ఈరోజుకు కూడా 5 మోటార్లలో రెండు మాత్రమే నడుస్తున్నాయి. 12 గంటలు ఆన్, 12 గంటలు ఆప్ చేస్తున్నారు. కరువు కరువు అని భయపెడుతున్నారు.  శ్రీశైలంలో నీళ్లు ఉండి ఎందుకు ఎత్తడం లేదు? మీ చేతగానితనంతో నీళ్లన్నీ కిందకు పోతున్నాయి. నీళ్లు ఎప్పుడు వచ్చినయి, ఎన్ని మోటార్లు నడిపనవు, ఎన్ని నీళ్లు లిఫ్టు చేశారన్న అంశాలను ఆధారాలతో బయటపెడుతున్నామన్నారు. పక్క రాష్ట్రంలో ఎందుకు క్రాప్ హాలిడే లేదు? తెలంగాణలో ఎందుకు క్రాప్ హాలిడే ఉంది అని ప్ర‌శ్నించారు. కల్వకుర్తి, దేవాదుల ఎన్ని గంటలు, ఎన్ని మోటార్లు నడిపారో వైట్ పేపర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కన్నెపల్లి మోటార్లు  నీళ్లు ఎత్తాలని రిటైర్డ్ ఇంజినీర్లు అంటే బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తామని బెదిరించారు. జైల్లో పెట్టాలి అంటవు. ఎత్తగలిగే అవకాశం ఉన్నా రాజకీయ కారణంతో నీళ్లు లిఫ్ట్ చేయలేదన్నారు. 2014లో అధికారంలోకి వస్తే మేం 42 రోజుల్లో కేసీఆర్ ఆదేశాలతో జులై 23 నాడు మహారాష్ట్రకు పోయినం. నాటి కాంగ్రెస్ మంత్రి హసన్ ముష్రఫ్ ని కలిసినం. 152 మీటర్లకు తమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు ఒప్పుకోవాలని కోరినం. 2014 ఆగస్టు 8న, అదే ఏడాది డిసెంబర్ 23న మహారాష్ట్రతో చర్చలు జరిపినం. 2015 ఫిబ్రవరి 17న కేసీఆర్ పుట్టిన రోజు కూడా మహారాష్ట్ర వెళ్లి చర్చ జరిపిండు. మీరు మాత్రం 1054 రోజుల తర్వాత మొదటి మీటింగ్ వెళ్లారు. మేం మొదటి ఆరు నెలల్లో ఆరడజను మీటింగ్స్ జరిపినం. మీరు చర్చలు జరపడానికే 1054 రోజులు పట్టింది. మీకున్న చిత్తశుద్దికి ఇది నిదర్శనం అన్నారు. నాడు ఏడేళ్లు, నేడు మూడేళ్లు నిర్లక్ష్యం వహించి మీరు 2007లో ప్రారంభమైన ప్రాజెక్టుకు 2014 దాకా ఏం చేసారు? మూడుచోట్ల కాంగ్రెస్ అధికారంలో ఉన్నా 152 మీటర్లకు ఒప్పించలేదు. నాడు ఏడు ఏళ్లు, నేడు మూడేళ్లు ఆలస్యం చేసారు. తల దగ్గర కాకుండా తోక దగ్గర పనులు చేసి మొబిలైజ్ అడ్వాన్సుల పేరిట బిల్లులు లేపారు. అడ్డగోలుగా అంచనాలు పెంచి ప్రాజెక్టును ఆగం చేసారు. బిఆర్ఎస్ ఆనాడు చిత్తశుద్దితో పని చేసింది. 2014 ఆగస్టు 16న జరిగిన మీటింగ్ లో 160 టీఎంసీలు కావాలంటే 152 మీటర్లకు ఒప్పుకోవాలని ఆర్.విద్యాసాగర్ రావు, మురళీధర్, రామకృష్ణ ఇతర ఇంజినీర్లు వెళ్లి అడిగారు. ఎంత అంటే అంత భూమి, డబ్బులు ఇస్తామని చెప్పారు. ఆనాడు ను, జోగు రామన్న ఇతర మంత్రులం కలిసి వెళ్లి అడిగినం. కేసీఆర్ తన పుట్టిన రోజున మహారాష్ట్ర వెళ్లి 152 మీటర్లకు ఒప్పుకోవాలని అడిగారు. మొదటి మీటింగ్ లో ఏమన్నారంటే ఇండిపెండెంట్ సంస్థతో సర్వే చేయిస్తాం అన్నరు. అన్ని రిపోర్టులు ఇచ్చినం. 152 మీటర్లకు ఒప్పుకోవాలని అడిగినం. 2015 ఫిబ్రవరి 4న ఈ విషయం స్పష్టంగా ఉంది. కమిటీ అనేది మొదటినుంచి ఉంది. జనవరి 21, 2013 నాడు జరిగిన కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ మినట్స్ లో ఎత్తు తగ్గించడానికి నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకున్నది అని స్పష్టంగా ఉంది. మేము వెళ్లి అన్ని ప్రయత్నాలు చేసినం అంటున్నరు. తాము అప్పటికే అన్ని ప్రయత్నాలు చేసినం. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే అడిగినం, బిజేపీ ప్రభుత్వం ఉంటే వెళ్లి అడిగినం. ఆరోజు బిజేపీ ప్రభుత్వం ఎంత చెప్పినా ఒప్పుకోలేదు. గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ సహకారం తీసుకొని కూడా ప్రయత్నం చేసినం. ఇప్పుడు మీరు 152 మీటర్ల కోసం ప్రయత్నం చేస్తున్నరు, దానికి ఒప్పుకుంటే మంచిదే.
ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే తమ్మిడిహట్టి దగ్గరకు మనకు కావాల్సిన నీళ్లు లేవు అని సీడ‌బ్ల్యూసీ మూడుసార్లు చెప్పింది. ప్రత్యామ్నాయం చూసుకోవాలని సూచించింది. 2015 మార్చి 4  నాటి లేఖలో ఉన్న 165 టీఎంసీలలో ఎగువ రాష్ట్రాలకు 63 టీఎంసీ ఉంది. ఇందులో 60 మీరు తీసుకుంటే ఉండేది 102. ఇందులో డైవర్టబుల్ ఎంత అని రాసారు. మొత్తంగా ఎత్తగలిగేదో ఎంతో, ప్రత్యామ్నాయం చూసుకో అని రాసిందన్నరు, 2015 మార్చి 13న ఉమా భారతి తెలంగాణకు రాసిన లేఖలో 160 టీఎంసీల నీళ్లు అందుబాటులో లేవు ప్రత్యామ్నాయం చూసుకోమని రాసారు. రాష్ట్రానికి అవసరమైన నీళ్లు లేవు అని మూడు లేఖలు ఉన్నాయి. 240 టీఎంసీలు మేడిగడ్డ నుంచి వాడుకోవడానికి అన్ని రకాల అనుమతులు ఉన్నయి. మూడు ఉత్తరాల్లో కనీసం 160 కాదు కదా 102 కూడా లేదు అన్నరు. అసలు ఇందులో నీళ్లు ఎంత లిఫ్టు చేస్తరు? హైదరాబాద్, ఇతర జిల్లాల మంచినీళ్లకే 50 టీఎంసీలు కావాలె. మరి సాగు నీళ్ల పరిస్థితేంటి? ఏదేమైనా కాళేశ్వరం తెలంగాణకు వరం, వరప్రదాయిని. రాజకీయాల కోసం మూడేళ్ల నుంచి మేడిగడ్డకు మరమ్మతు చేయడం లేదు. నీళ్లు ఎత్తడం రాష్ట్రం నిర్ణయమే అని ఎన్డీఎస్ఏ చెంప చెల్లుమనేలా చెప్పింది. అన్నారం, సుందిళ్ల బేషుగ్గా ఉన్నాయని సీడ‌బ్ల్యూపిఆర్ఎస్ రిపోర్టు చెప్పింది. అయినా మూడేళ్లుగా మరమ్మతు చేయకుండా కాలయాపన చేసారు. తమ్మిడిహట్టి మీరు తెచ్చినా మాకు అభ్యంతరం లేదు. కేసీఆర్ అన్ని ఆలోచించి 240 ఇక్కడ ఎత్తుకుంటం, ఉమ్మడి ఆదిలాబాద్ కోసం చెన్నూరు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా లక్ష ఎకరాలకు సాగు నీరు ఇవ్వాలని నిర్ణయించినం. వార్దా 20 టీఎంసీలతో డీపీఆర్ తయారు చేసి కేంద్రానికి పంపినం. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే డిపిఆర్ వాపస్ వచ్చింది. అవి ముందుకు తీసుకుపోకుండా రాజకీయాల కోసం ఇలాంటివి చేస్తున్నారు. బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాలు ముఖ్యం కాదు .. రాస్ట్ర ప్రయజనాలు ముఖ్యం. ఆ కమిటీ ఎప్పుుడు తేల్చాలి, ఎప్పుడు పర్యావరణ అనుమతులు రావాలి? ఎప్పుడు అవుతుంది.

కాళేశ్వరమే తెలంగాణకు వరం
మీరు చెబుతున్నది ఏంటి 25వేల కోట్లు ఖర్చు చేసి తమ్మిడిహట్టి నుంచి నీళ్లు తెచ్చి సుందిళ్లల పోస్తరట. ఎక్కడా ఆయకట్టు లేదు. వచ్చే నీళ్లు 240 టీఎంసీలు వస్తయా కాలేశ్వరం లాగా? మొత్తం పని అయ్యే వరకు అంచనాలు 30వేల నుంచి 40వేల కోట్లు అవుతుంది కావచ్చు. రాజకీయ కుట్ర కాదా ఇదంతా? తమ్మిడిహట్టి కడితే మాకు అభ్యంతరం లేదు, అయితుందో కాదో కాలం తేల్చుతుంది. కానీ వెంటనే మేడిగడ్డ మరమ్మతు చేయండి. కన్నెపల్లి కట్క ఒత్తండి. ఉత్తం.. నువ్వు గ్రావిటీ ద్వారా తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీళ్లు తెస్తవా? ఎవరి చెవిలో పువ్వులు పెడుతున్నరు? ప్రజలు అమాయకులా? ముఖ్యమంత్రి కార్యాలయం బాధ్యత లేకుండా ఎలా విడుదల చేస్తారు? డీపీఆర్ బయట పెట్టండి. నొక్కి అడుగుతున్నా సమాధానం చెప్పాలి. గోబెల్స్ ప్రచారంతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బిఆర్ఎస్ పార్టీ అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకున్నది. మూడు లేఖల ద్వారా తమ్మిడిహట్టి వద్ద నీళ్లు లేవని తేల్చిన తర్వాతనే మేడిగడ్డకు పోవాల్సి వచ్చింది. అన్ని కొనగలం కానీ, నీళ్లను కొనలేం అంటున్న రేవంత్ రెడ్డి.. ఎందుకు నీళ్లు లిఫ్ట్ చేయడం లేదు? ఎంపీ చామల కిరణ్ మాట్లాడుతున్నరు, లెవల్ లేదు ఎట్ల లిఫ్ట్ చేస్తం అని! లెవల్ ఉన్నప్పుడు కన్నెపల్లి నుంచి ఎందుకు లిఫ్ట్ చేయలేదు? గడ్డి పీకారా? కరువును తరిమి తరిమి కొట్టే శక్తి ఉన్నది కాళేశ్వరానికి అని హ‌రీష్‌రావు స్ప‌ష్టం చేశారు.
—————————————————————————————————————————————————————

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *