కలలు కనాలి.. కష్టపడి చదవాలి

– విద్యార్థులకు మంత్రి అజారుద్దీన్ ఉద్బోధ
– ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను సందర్శించిన మంత్రి

హైదరాబాద్, జూలై 18: ప్రతీ విద్యార్థి డాక్టర్, ఇంజనీర్, శాస్త్రవేత్త, సివిల్ సర్వెంట్, ఉపాధ్యాయుడు, ప్రిన్సిపాల్, క్రీడాకారుడు, నాయకుడు లేదా తనకు నచ్చిన ఏ రంగంలోనైనా అత్యున్నత స్థానాన్ని లక్ష్యంగా పెట్టుకుని కష్టపడాలని మైనారిటీల సంక్షేమం, ప్రభుత్వ రంగ సంస్థల శాఖల మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ విద్యార్థులకు సూచించారు. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్(టీపీఎస్)ను శనివారం సందర్శించి మూడు గంటలకుపైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యంతో మమేకమయ్యారు. ప్రిన్సిపాల్, అదనపు జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. తరగతి గదులు, ప్రయోగశాలలు, హాస్టళ్లు, భోజనశాలలు, క్రీడా మైదానాలు, పారిశుధ్య సదుపాయాలు, తాగునీటి వసతులు, క్రికెట్ ప్రాక్టీస్ నెట్స్, బాస్కెట్‌బాల్, వాలీబాల్ కోర్టులు తదితర మౌలిక సదుపాయాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులనుద్దేశించి మంత్రి అజారుద్దీన్ మాట్లాడుతూ తనకు ఆత్మీయ స్వాగతం పలికిన అంద‌రికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ నాణ్యమైన విద్య అందించేందుకు ఉపాధ్యాయులు చేస్తున్న సేవలను అభినందించారు. నాణ్యమైన తరగతి గదులు, ప్రతిభావంతులైన ఉపాధ్యాయులు, ప్రపంచస్థాయి వసతులు అందుబాటులో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ తాను చదివిన పాఠశాలలో చాలా చిన్న ఆట స్థలం మాత్రమే ఉండేదని, అయినప్పటికీ క్రమశిక్షణ, అంకితభావం, కృషితోనే విజయాన్ని సాధించానని తెలిపారు. విజయానికి సదుపాయాల కంటే సంకల్పం, పట్టుదల, శ్రమ ఎంతో ముఖ్యమని విద్యార్థులకు వివరించారు. గత తరాలు పరిమిత వనరులతోనే విజయాలు సాధించాయని, నేటి విద్యార్థులకు ప్రభుత్వం అన్ని అవకాశాలు కల్పించిందని, అందువల్ల ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. విజయానికి మూలం అభిరుచి అని పేర్కొన్న మంత్రి నిజమైన అభిరుచి ఉంటేనే కష్టపడి పనిచేయగలమని, చదువు, క్రీడలు లేదా ఏ రంగమైనా క్రమశిక్షణ, అంకితభావం, నిరంతర సాధన విజయానికి మార్గమని చెప్పారు. విద్యార్థులు ఉపాధ్యాయులను సందేహాలు అడగడానికి ఎప్పుడూ వెనుకాడవ‌ద్ద‌ని, నిరంతరం నేర్చుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. తాను అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదగడంలో తన ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని గుర్తుచేసుకున్నారు. వారు తనకు క్రమశిక్షణ, మంచి ప్రవర్తన, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, ఇతరులను గౌరవించడం వంటి విలువలను నేర్పారని, తన విజయాలను చూసి నాటి తన ఉపాధ్యాయులు గర్వపడుతున్నారని చెప్పారు. ప్రతీ విద్యార్థి తనలోని ప్రతిభను గుర్తించి అభివృద్ధి చేసుకోవాలని, అది చదువైనా, క్రికెట్ అయినా, కళలైనా, ఏ రంగమైనా నిరంతర సాధనతో ముందుకు సాగాలని ఉద్బోధించారు. వైఫల్యాలు లేదా నిరాశలు వచ్చినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దని, ప్రతీ అపజయం భవిష్యత్తు విజయానికి పునాది అవుతుందని మంత్రి విద్యార్థులకు సూచించారు. మొదటి తరగతి నుంచి పదో తరగతి వరకు నేర్చుకున్న విలువలు జీవితాంతం మన వెంట ఉంటాయని, మంచి అలవాట్లు, మంచి స్నేహాలు, సద్గుణాలు అలవరచుకోవాలని అన్నారు. అబ్బాయిలు, అమ్మాయిలు సమానంగా కష్టపడి చదవాలని, పరస్పరం గౌరవించుకోవాలని, సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని, తమ తల్లిదండ్రులు, రాష్ట్రం, దేశానికి గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షించారు. అనంతరం మంత్రి అజారుద్దీన్ విద్యార్థులతో కలిసి క్రికెట్ ఆడి, బ్యాటింగ్, ఫీల్డింగ్‌కు సంబంధించిన విలువైన సూచనలు అందించారు. వందలాదిమంది విద్యార్థులు ఆయనను కలుసుకుని విద్య, క్రీడలు, భవిష్యత్ లక్ష్యాలపై ప్రశ్నలు అడిగారు. అజారుద్దీన్ ప్రతీ విద్యార్థితో ఆప్యాయంగా మాట్లాడి క్రికెట్ బ్యాట్లు, టీ-షర్టులు, నోట్‌బుక్స్ తదితర వాటిపై ఆటోగ్రాఫ్‌లు ఇచ్చి, ఫొటోలు దిగుతూ ప్రతి ఒక్కరినీ పెద్ద కలలు కనాలని, వాటిని సాధించేందుకు కష్టపడాలని ప్రోత్సహించారు. మంత్రి సందర్శన తమ జీవితంలో మరపురాని అనుభవమని, ఆయన మాటలు తమలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాయని, విద్య, క్రీడలు, జీవితంలో క్రమశిక్షణ, నిజాయతీ, అంకితభావంతో ముందుకు సాగేందుకు స్ఫూర్తినిచ్చాయని విద్యార్థులు, ఉపాధ్యాయులు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *