రైతాంగం సాగు ప‌ద్ధ‌తులు మార్చుకోవాలి

– రెవెన్యూ మంత్రి పొంగులేటి 

కూసుమంచి/ఖమ్మం, ప్రజాతంత్ర, జూలై 18 : ఎల్‌నినో ప్రభావం వల్ల ఈ ఏడాది వర్షాలు తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నందున‌ రైతాంగం సాంప్రదాయ సాగు వీడి ప్రకృతి సవాళ్లకు అనుగుణంగా అప్రమత్తం కావాలని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సూచించారు. అధిక నీటి వినియోగం ఉండే పంటల జోలికి వెళ్లకుండా తక్కువ నీటి అవసరాలతో చేతికొచ్చే ప్రత్యామ్నాయ మెట్ట పంటల వైపే దృష్టి సారించాలన్నారు. పాలేరు నియోజకవర్గ పరిధిలోని కూసుమంచి మండలంలో మంత్రి శనివారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాలలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతుల పక్షపాతి అని, ఇప్పటికే రైతు భరోసా అందించి అన్నదాతలకు అండగా నిలిచింద‌ని స్పష్టం చేశారు.

రూ.4.61 కోట్లతో ప్రగతి బాట

మండల పర్యటనలో భాగంగా మంత్రి పొంగులేటి పలుచోట్ల శంకుస్థాపనలు చేశారు. మల్లాయిగూడెంలో రూ.2.52 కోట్లతో పెరికసింగారం ఎన్ఎస్పీ కెనాల్ నుంచి భగవాన్ తండా మీదుగా మల్లాయిగూడెం వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు, రూ.20 లక్షలతో నిర్మించే గ్రామ పంచాయతీ కార్యాలయ భవనానికి భూమి పూజ చేశారు. కోక్యా తండాలో రూ.1.69 కోట్లతో లింగారం తండా నుంచి లోక్యా తండా ఎన్ఎస్పీ కాలువ వరకు నిర్మించే బీటీ రోడ్డు పనులకు, అగ్రహారంలో రూ.20 లక్షలతో నిర్మించనున్న పంచాయతీ భవనానికి శంకుస్థాపనలు చేశారు. కూసుమంచిలోని క్యాంపు కార్యాలయంలో మండల వ్యాప్తంగా 66 మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. అదేవిధంగా వివిధ అనారోగ్య కారణాలతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న 111మందికి రూ. 35.16 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను మంత్రి పంపిణీ చేశారు.కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. మండల పర్యటనను మల్లాయిగూడెంలో ముగించుకుని మార్గమధ్యలోని లింగారం తండా, జుజ్జులరావ్ పేట గ్రామ శివార్ల మీదుగా కోక్యా తండాకు వెళ్తున్న క్రమంలో మంత్రి పొంగులేటి అక్కడ శ్రమిస్తున్న మహిళా కూలీలను చూసి తన కాన్వాయ్‌ను ఆపి వాహనం దిగారు. హోదాల సరిహద్దులు వీడి నిరాడంబరంగా నేరుగా ఆ పల్లె పడతుల వద్దకు వెళ్లి వారి కష్టసుఖాలను, అవసరాలను ఎంతో ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి పేదవారికి రాజకీయం లేని ‘ఇందిరమ్మ ఇళ్ల’ వెలుగులు అందిస్తామని, ఉచిత కరెంట్, సంక్షేమ పథకాల తోడుంటామని ఆయన ఇచ్చిన భరోసా వారి ముఖాల్లో కొండంత ఆనందాన్ని, కొత్త నమ్మకాన్ని నింపింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *