– లేకుంటే ఆమరణ దీక్ష చేస్తా : కవిత
– హెచ్ఎంఎస్, టీఆర్ఎస్ నాయకుల సింగరేణి భవన్ ముట్టడి
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 5 : రెండు నెలల్లోగా సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే హైదరాబాద్ లోని సింగరేణి భవన్ ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని తెలంగాణ రక్షణ సేన(టీఆరఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న కార్మికులను అన్‌ఫిట్ చేయడంతోపాటు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హెచ్ఎంఎస్, తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) నాయకులతో కలిసి సోమవారం లక్డీకాపూల్‌లోని సింగరేణి భవన్‌ను ముట్టడించారు. గంటకుపైగా రోడ్డుపై బైఠాయించారు. సింగరేణి యాజమాన్యం తమతో చర్చలు జరిపే వరకు అక్కడినుంచి కదిలేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. హెచ్ఎంఎస్, టీఆర్ఎస్ ఆందోళనతో సింగరేణి భవన్ ఎదుట పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. దీంతో సింగరేణి అధికారులు వచ్చి కవిత, హెచ్ఎంఎంఎస్ నాయకులతో చర్చలు జరిపారు. సింగరేణి సీ అండ్ ఎండీ సెక్రటేరియట్లో సమావేశంలో ఉన్నారని, ఆయన ఆదేశాల మేరకు తాము చర్చలకు వచ్చామని తెలిపారు. కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మెడికల్ బోర్డుకు అప్లయ్ చేసుకున్న వాళ్లందరినీ అన్‌ఫిట్ చేసి వాళ్ల వారసులకు ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేశారు. రెండు నెలల్లోగా ఈ ప్రక్రియ ప్రారంభం కావాలని, లేదంటే సింగరేణి భవన్ గేటు ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని ఆమె హెచ్చరించారు. కార్మికుల సంక్షేమాన్ని యాజమాన్యం పట్టించుకోవటం లేదని విమర్శిం చారు. మూడు నెలల క్రితం తాము ఒత్తిడి తెస్తేనే మెడికల్ బోర్డు పెట్టారని, కానీ దానికి దరఖాస్తు చేసుకున్న వారిలో 10 శాతం మందిని మాత్రమే అన్‌ఫిట్ చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత దరఖాస్తు చేసుకున్న వాళ్లందరినీ అన్‌ఫిట్ చేసి వాళ్ల వారసులకు ఉద్యోగాలు ఇచ్చామని గుర్తు చేశారు. డిపెండెంట్ ఉద్యోగాలు మీరు వేసే బిచ్చం కాదు.. అది కార్మికుల హక్కు అని అన్నారు. సింగరేణి లాభాల్లో 35 శాతం కార్మికులకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలియాస్ పేర్లతో ఉద్యోగాలు చేస్తున్న వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వకుండా విజిలెన్స్ విచారణతో ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. ఇలా వేధింపులతో ఉద్యోగాల నుంచి తొలగించిన వాళ్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలన్నారు. తెలంగాణకు సింగరేణి ఆత్మవంటిదన్నారు. అలాంటి సింగరేణి కార్మికుల సంక్షేమానికి టీఆర్ఎస్, హెచ్ఎంఎస్ పోరాటం చేస్తాయన్నారు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం రూ.60 వేల కోట్లు బకాయిలు పెట్టడంతోనే సంస్థ ఇబ్బందుల్లో ఉందన్నారు. వెంటనే ఆ బకాయిలు చెల్లించి సంస్థను కాపాడాలని డిమాండ్ చేశారు.
సింగరేణి ద్రోహుల చేతిలో ఉంది – రియాజ్ అహ్మద్
సింగరేణి సంస్థ ద్రోహుల చేతిలో బందీ అయ్యిందని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ ఆవేదన వ్యక్తం చేశారు. స్వతంత్ర సంస్థగా ఉండాల్సిన సింగరేణిని మంత్రుల చేతిలో కీలుబొమ్మగా మార్చేశారన్నారు. ఇకనైనా యాజమాన్యం వైఖరిలో మార్పు రావాలని డిమాండ్ చేశారు. డిపెండెంట్ ఉద్యోగాలు సహా కార్మికుల సంక్షేమం కోసం పనిచేయాలని సూచించారు. కొత్త బొగ్గు బావులను ప్రైవేట్ సంస్థలకు కాకుండా సింగరేణి ద్వారా నిర్వహించాలని, నైనీ బ్లాక్‌లో కూడా సింగరేణి నుంచి కార్మికులను నియమించాలన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





