పెట్టుబడుల‌ గమ్యస్థానంగా తీర్చిదిద్దాలి

– పరిశ్రమల శాఖ అధికారులకు సీఎస్ సంజయ్ ఆదేశాలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 10: రాష్ట్రాన్ని దేశంలోనే అత్యంత ప్రాధాన్య పెట్టుబడి గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేయాలని పరిశ్రమల శాఖ అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. రాష్ట్రంలో చేపడుతున్న కీలక పారిశ్రామిక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పురోగతిపై   పరిశ్రమలు, వాణిజ్య శాఖ సీనియర్ అధికారులతో సచివాలయంలో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణంగా పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేయాలని, తద్వారా మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడానికి, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించడానికి వీలు కలుగుతుందని అన్నారు. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) ద్వారా భారత్ ఫ్యూచర్ సిటీ, జహీరాబాద్ ఇండస్ట్రియల్ సిటీ, కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కుతోపాటు ఇతర వ్యూహాత్మక పారిశ్రామిక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పురోగతిపై ప్రధాన కార్యదర్శి సమీక్షించారు. టీజీఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ శశాంక ఆయా ప్రాజెక్టుల ప్రస్తుత స్థితి, అభివృద్ధి చేస్తున్న మౌలిక సదుపాయాలు, పెట్టుబడి అవకాశాలు, పూర్తి చేయాల్సిన గడువులపై సీఎస్‌కు వివరించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించే దిశగా అధికారులు స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్లాలని సీఎస్ ఆదేశించారు. అలాగే కొనసాగుతున్న ప్రాజెక్టుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, ఎదురయ్యే అవరోధాలను ముందుగానే గుర్తించి, శాఖల మధ్య సమన్వయంతో వాటిని త్వరితగతిన పరిష్కరించాలన్నారు. సమావేశంలో పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య, చేనేత, వస్త్ర శాఖ ప్రత్యేక కార్యదర్శి కాత్యాయనీదేవి, ఇన్వెస్ట్ తెలంగాణ సీఈవో అజిత్ రెడ్డి, ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్ శశాంక, పరిశ్రమల శాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *