– ట్రేడ్ యూనియన్ల పోరాటాన్ని కొనియాడిన ఉద్యమకారుల గుర్తింపు కమిటీ
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 10 : స్వరాష్ట్ర సాధనలో ట్రేడ్ యూనియన్ల పాత్ర అత్యంత కీలకమైనదని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ముక్తకంఠంతో కొనియాడింది. నాడు ఆర్టీసీ, సింగరేణి, రైల్వే, బీఎస్ఎన్ఎల్, టీజేఏసీ ఉద్యోగులతోపాటు అసంఘటిత రంగ కార్మికులు రోడ్లపైకి వచ్చి సకల జనుల సమ్మె ద్వారా యావత్ ప్రభుత్వ యంత్రాంగాన్ని స్తంభింపజేయడం వల్లే నాటి దిల్లీ పీఠం దిగివచ్చిందని గుర్తు చేసింది. కార్మిక లోకం అందించిన ఆ చరిత్రాత్మక మద్దతు లేకపోతే తెలంగాణ కల సాకారం అయ్యేది కాదని, అందుకే ఉద్యమ చరిత్రలో వారికి అగ్రతాంబూలం దక్కుతుందని కమిటీ స్పష్టం చేసింది. ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ఆధ్వర్యంలో అమరవీరుల స్మారక చిహ్నం మొదటి అంతస్తులో శుక్రవారం జరిగిన ముఖాముఖి సంప్రదింపుల ప్రక్రియలో కమిటీ చైర్మన్ డాక్టర్ కె.కేశవరావు, సభ్యులు ప్రొఫెసర్ ఎం.కోదండరామ్ (ఎమ్మెల్సీ), అద్దంకి దయాకర్ (ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్), ఎగ్జిక్యూటివ్ మెంబర్లు మోతె శోభన్ రెడ్డి, ఎస్.రాములు నాయక్ కార్మిక సంఘాల పాత్రపైనే ప్రత్యేకంగా మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ కార్మిక సంఘాల నాయకులు, ప్రతినిధులు, అసంఘటితరంగ కార్మిక శ్రేణులు కమిటీకి తమ వినతులను సమర్పించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





