– సర్వాంగ సుందరంగా మేడారం.. మెరిసిపోతున్న పైలాన్, కొత్త కలెక్టరేట్
– రూ.16,007 కోట్ల రహదారి అభివృద్ధికి ములుగు నుంచి శ్రీకారం
– రూ.868 కోట్ల అభివృద్ధి పనులకు పైలాన్
– రూ.63.50 కోట్ల నూతన కలెక్టరేట్ ప్రారంభం
ములుగు, ప్రజాతంత్ర, ఆగస్టు 15: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ములుగు జిల్లా పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి. శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. ఆదివారం మేడారం, ములుగు ప్రాంతాల్లో తుది ఏర్పాట్లను శనివారం మంత్రి సీతక్క, ఎంపీ బలరాం నాయక్ తో కలిసి పరిశీలించారు. ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాల హెలిప్యాడ్, గట్టమ్మ సమీపంలోని పంచాయతీరాజ్ రహదారుల అభివృద్ధి పైలాన్, నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం, అభివృద్ధి పనుల పైలాన్ ప్రాంతాలను, మేడారం వనదేవతల ప్రాంగణం, హెలిప్యాడ్, ముఖ్యమంత్రి ప్రయాణించే మార్గాలు, చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ ప్రాంతం, ప్యూరిఫైయర్ వాటర్ ప్లాంట్ పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా సమన్వయంతో పని చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
మేడారంలో ప్రత్యేక ఏర్పాట్లు
ముఖ్యమంత్రి పర్యటన కోసం మేడారంలో హెలిప్యాడ్ను సిద్ధమైంది. ముఖ్యమంత్రి చేతుల మీదుగా లబ్దిదారులకు పింఛన్ల మంజూరు పత్రాలను అందించే కార్యక్రమానికి ఏర్పాట్లను పూర్తిచేశారు. భక్తుల కోసం ప్యూరిఫైయర్ వాటర్ ప్లాంట్ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. రూ. 16,007 కోట్ల రహదారి అభివృద్ధికి ములుగు వేదిక గ్రామీణ రహదారుల అభివృద్ధిలో కొత్త అధ్యాయానికి ములుగు జిల్లా వేదిక కానుంది. ఈ భారీ ప్రాజెక్టుకు గుర్తుగా ములుగు గట్టమ్మ ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన భారీ పైలాన్ ను తీర్చిదిద్దారు. రాష్ట్రవ్యాప్తంగా తొలి దశలో 2,145 రహదారులను 7,448 కిలోమీ టర్ల మేర అభివృద్ధి చేసే కార్యక్రమానికి ఈ పైలాన్ ప్రతీకగా నిలవనుందని పేర్కొన్నారు. రూ.63 కోట్ల 50 లక్షల నిధులతో నిర్మించిన నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారని మంత్రి తెలిపారు. అదేవిధంగా జిల్లాలో చేపట్టిన రూ.868 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులను సూచించే నూతన కలెక్టరేట్ పైలాన్ను తీర్చిదిద్దారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బోర్డడే హేమంత్ సహదే వరావు, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటిడిఏ పిఓ లెనిన్ వస్సల్ టోప్పో. భూపాలపల్లి ఎస్పీ సంకీర్త్, ఏటూరు నాగారం ఎఎస్పీ మనన్ భట్, అదనపు కలెక్టర్లు సిహెచ్ మహేందర్ జి, సంపత్ రావు, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి, ఆర్డీవో కృష్ణవేణి, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
నేటి ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్
షెడ్యూల్ ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు మేడారం చేరుకుంటారు. అక్కడి నుంచి సమ్మక్క- సారలమ్మ వనదేవతల ఆలయానికి చేరుకొని మధ్యాహ్నం 1.40 గంటల నుంచి 1.50 గంటల వరకు వనదేవతలను దర్శిం చుకుంటారు. అనంతరం వనదేవతల ప్రాంగణం వేదికగా చేయూత పింఛన్ల లబ్దిదా రులకు మంజూరు పత్రాలను పంపిణీ చేసి, భక్తుల కోసం ఏర్పాటు చేసిన ప్యూరిఫైయర్ వాటర్ ప్లాంట్ను ప్రారంభిస్తారు. అనంతరం హెలికాప్టర్లో బయలుదేరి మధ్యాహ్నం 2.20 గంటలకు ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాల హెలిప్యాడ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి గట్టమ్మ ఆలయ సమీపంలో రూ.16,007 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పంచాయతీరాజ్ రహదారుల అభివృద్ధి కార్యక్రమానికి గుర్తుగా ఏర్పాటు చేసిన పైలాన్ వద్దకు చేరుకొని మధ్యాహ్నం 2.30 గంటలకు పైలాన్ను ఆవిష్కరిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2.40 గంటలకు రూ.868 కోట్ల అభివృద్ధి పనులను సూచించే పైలాను ప్రారంభించి, రూ.63 కోట్ల 50 లక్షల నిధులతో నిర్మించిన నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభిస్తారు. కార్యక్రమాల అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాల హెలిప్యాడ్ నుంచి హనుమకొండ జిల్లా పరకాల పర్యటనకు బయలుదేరుతారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





