ఖైరతాబాద్ లో వేడెక్కుతున్న‌ రాజకీయం

– ముఖాముఖి పోటీకి సర్వం సిద్ధం
– దానం అనర్హతతో ఖాలీ అయిన స్థానానికి త్వరలో ఉప ఎన్నిక
– గెలుపు కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వ్యూహాలు
– తెరపైకి వస్తున్న ఆశావహుల పేర్లు

                                                 (మండువ రవీందర్రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, వరంగల్)

ఖైరతాబాద్‌ ‌శాసనసభ స్థానం ఖాలీ అయినట్లు అధికార ప్రకటన వెలువడడంతో రాజకీయ పార్టీలు ఉప ఎన్నికకు రంగం సిద్దం చేసుకుంటున్నాయి. ఈ నియోజకవర్గం ఎంఎల్‌ఏగా బీఆర్ఎస్‌ నుండి గెలిచిన దానం నాగేందర్‌ ‌కాంగ్రెస్‌ ‌కండువా కప్పుకోవడమేకాక ఆ పార్టీ పక్షాన ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓటమి చవిచూసిన విషయంపై బీఆర్‌ఎస్‌ ‌న్యాయస్థానానికి వెళ్ళగా, ఆయనపై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. కోర్టు ఉత్తర్వుల మేరకు శాసనసభ కార్యదర్శి ఖైరతాబాద్‌ ‌నియోజకవర్గం ఖాలీ అయినట్లు ప్రకటించారు. దీంతో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు త్వరలో జరగనున్న ఉప ఎన్నికకు సిద్దమవుతున్నాయి. గత శాసనసభ ఎన్నికల తర్వాత గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌పరిధిలో రెండు శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ ‌విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మూడవ ఉప ఎన్నికలోనూ తమదే పై చెయ్యి కావాలని కాంగ్రెస్‌ ‌పట్టుదలగా ఉంది. వాస్తవానికి 1967నుంచి పరిశీలిస్తే ఈ నియోజకవర్గంలో ఎక్కువసార్లు కాంగ్రెసే విజయం సాధిస్తూ వచ్చింది. ముఖ్యంగా దివంగత పి.జనార్థన్‌రెడ్డి కాంగ్రెస్‌ ‌నేతగా దాదాపు అయిదుసార్లు ప్రాతినిద్యం వహించారు. ఆయన అకాల మరణంతో 2008లో జరిగిన ఉప ఎన్నికల్లోకూడా ఆయన కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థిగా అఖండ విజయం సాధించారు. అలాగే ప్రస్తుతం అనర్హత వేటుపడిన దానం నాగేందర్‌కూడా ఈ నియోజకవర్గంనుంచి మూడుసార్లు ఎన్నికైనారు. 2009లో కాంగ్రెస్‌నుంచి, 2018, 2023లో బిఆర్‌ఎస్‌ ‌నుంచి ఎన్నికైనారు. కాగా, కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఈ స్థానంలో జరిగే ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు దానం మళ్ళీ సిద్దమవుతున్నారు. ఉప ఎన్నికల్లో తన గెలుపు ఖాయమని ఢంకా బజాయించి చెబుతున్న దానంకు కాంగ్రెస్‌ అధిష్టానం టికట్‌ ‌కేటాయిస్తుందా లేదా అన్నది అనుమానమే. దానం ఈ స్థానంలో గెలిచినా ఓడినా నియోజవర్గ ప్రజలతో సత్సంబందాలు ఉన్నప్పటికీ పార్టీ ఫిరాయింపు మచ్చ ఆయన్ను వెన్నాడుతున్నది. 2023లో ఆయనతో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీపడిన పి.విజయారెడ్డికి ఈసారి అవకాశం లభిస్తుందన్న ప్రచారం జరుగుతున్నది. నియోజవర్గంలో మంచి పేరున్న స్వర్గీయ పీజేఆర్‌ కూతురు కావడం వల్ల కాంగ్రెస్‌కు కలిసి వచ్చే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారు. కాగా, దానంకు ఎంఎల్సీ పదవి ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలున్నాయనుకుంటున్నారు. గ్రేట‌ర్‌ ‌పరిధిలో జరిగిన రెండు శాసనసభ ఉప ఎన్నికలను జారవిడుచుకున్న బీఆర్‌ఎస్‌ ‌తన సిట్టింగ్‌ ‌స్థానాన్ని ఈసారైనా కాపాడుకోవాలన్న పట్టుదలతో ఉంది. ఈ ఎన్నిక ఫలితాలు 2028లో జరగనున్న శాసన సభ ఎన్నికలపై ప్రభావం పడే అవ‌కాశం ఉండటం వల్ల ఎట్టిపరిస్థితిలో ఈ ఉప ఎన్నికలో విజయం సాధించేందుకు వ్యూహరచన చేస్తున్నది. కాంగ్రెస్‌ ‌వెయ్యి రోజుల పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ప్రబ‌లడంతో బీఆర్‌ఎస్‌ ‌నుండి పోటీ చేసేందుకు ఎక్కువ సంఖ్యలో మొగ్గు చూపుతున్నారు. ప్రధానంగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ ‌కుమారుడు సాయికిరణ్‌పేరు విస్తృత ప్రచారంలో ఉండగా, మాజీ కార్పొరేటర్‌ ‌మన్నె కవితారెడ్డి, మన్నె గోవర్థన్‌రెడ్డిలు తమ వంతు ప్రయాత్నాలు చేస్తున్నారు. కాగా, పీజేఆర్‌ కుమారుడు విష్ణువర్థన్‌రెడ్డికి మరో అవకాశం వస్తుందనుకుంటున్నారు.

తెలంగాణపై కాషాయ జండా ఎగురవేయాలన్న దృఢ‌ సంకల్పంతో ఉన్న బీజేపీ కూడా ఈ అవకాశాన్ని ఎట్టిపరిస్థితిలో వదులుకోరాద‌న్న పట్టుదలతో ఉంది. రాష్ట్రంలో ఎనిమిది పార్లమెంటు, ఎనిమిది అసెంబ్లీ స్థానాలను సాధించుకున్న బీజేపీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి మరింత బలపడేందుకు ఈ ఉప ఎన్నిక గెలుపు దోహదపడుతుందని భావిస్తున్నది. ఈ విషయంలో కేంద్ర నాయకత్వంకూడా దృష్టి సారిస్తున్నది. అం‌దులో భాగంగా కేంద్ర మంత్రి అమిత్‌షా అక్టోబర్‌ 4‌న రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. కరీంనగర్‌లో ఓ ప్రైవేటు మెడికల్‌ ‌కాలేజీ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. కాగా, బీజేపీ రాష్ట్ర కొత్త ఇన్‌చార్జి సునీల్‌ ‌బన్సల్‌ పార్టీ ప్ర‌చార కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు భారీ బహిరంగ సభలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వీటిలో కనీసం రెండు సభలకైనా ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించాలని పార్టీ అభిప్రాయపడుతున్నట్లు వినికిడి. ఈమేరకు రాష్ట్రస్థాయి పదాధికారుల సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్దమైంది. ఇదిలాఉంటే పార్టీలో నెలకొన్న అనైక్యతపై పార్టీ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తున్నది. కాగా, ఖైరతాబాద్‌ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు చాలామంది ఉత్సాహం చూపిస్తున్నా గెలిచే వారికే టికట్‌ ఇవ్వాలని అధినాయకత్వం ఆచితూచి వ్యవహరించనుంది. ఈ నియోజకవర్గంనుంచి గతంలో రెండుసార్లు విజయం సాధించిన చింతల రామచంద్రారెడ్డి పేరు ముందు వరుసలో ఉండగా, ఉమ్మడి ఏపీలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించిన ఇంద్రాసేనారెడ్డి, జూటూరు కీర్తిరెడ్డి పేర్లు ప్రచారంలో ఉన్నాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *